ఏలేరు రైతుల పరిహారం మింగేసిన బాబు
ఏలేరు కుంభకోణంలో అసలు దోషి చంద్రబాబేనని 1997లోనే బీజేపీ నిక్కచ్చిగా తేల్చిచెప్పింది. ‘ఉదయకమలం’ సిరీస్‌లో భాగంగా... ‘అవినీతి ఏరులై పారిన ఏలేరు స్కామ్’ పేరుతో 1997 ఫిబ్రవరిలో పుస్తకం వేసింది. ఆ కుంభకోణం కథాకమామిషును, అందులో బాబు పోషించిన ప్రధాన పాత్రను అందులో పూసగుచ్చింది. ఆ పుస్తకంలో బీజేపీ ఏం రాసిందో చూడండి...
ముఖ్యమంత్రికి లెక్కలు రావా?...
‘‘ఏలేరు భూములకు అక్రమంగా పెంచిన నష్టపరిహారం కింద ఇంతవరకు ఖజానా కోల్పోయింది రూ.5.9 కోట్లేనని ముఖ్యమంత్రి (బాబు) ప్రకటించారు. కానీ వాస్తవాలు దీనికి విరుద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే రూ.14 కోట్ల చెల్లింపు పూర్తయింది. పైగా మరో రూ.5 కోట్లకు కూడా లెక్కలే లేవు. ఉదాహరణకు రూ.4.43 లక్షల నష్టపరిహారం పొందినట్టు చెబుతున్న జగన్నాథం అనే లబ్ధిదారు పేరు ముఖ్యమంత్రి (బాబు) చెప్పిన లెక్కల జాబితాలో లేదు. అంటే చంద్రబాబు చెవిలో అధికారులు పువ్వులు పెట్టారనుకోవాలా? లేక చంద్రబాబే ప్రజల చెవిలో పువ్వులు పెట్టారనుకోవాలా?’’
అసలు దోషి చంద్రబాబే...
‘‘ఏలేరు కుంభకోణంలో అసలు దోషి ముఖ్యమంత్రి చంద్రబాబే. రైతులకు అసాధారణ మొత్తాలలో జరిగిన చెల్లింపులకు సంబంధించిన ఫైళ్లపై ఆయన స్వయంగా సంతకాలు చేశారు. పైగా... ‘డబ్బు వెంటనే చెల్లించకపోతే కోర్డు ధిక్కారమవుతుందేమోనన్న భయంతోనే నేను, నా మంత్రివర్గ సహచరులు త్వరత్వరగా సంతకాలు చేశాం. అంతే తప్ప అవినీతి ఆలోచన మాలో ఏ కోశానా లేదు’ అంటూ శాసనసభలో సన్నాయి నొక్కులు నొక్కారు. పరిహారం అసాధారణంగా పెరిగిపోయినా, కోట్లాది రూపాయల ప్రజాధనం చేజారిపోయినా, ‘కోర్టు ధిక్కార నేరం భయంతోనే చూస్తూ ఊరుకున్నాం’ అంటూ జనం చెవుల్లో బాబు పూలు పెట్టారు. అసాధారణ తీర్పులపై హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో అప్పీలు చేసుకోవచ్చన్న కనీస జ్ఞానం కూడా ఆయనకు గానీ, ఆయన ప్రభుత్వానికి గానీ లేదనుకోవాలా? ముఖ్యమంత్రిగా బాబు చేసిన సంతకం వల్లే ప్రజాధనం ఖజానా దాటిపోయిందన్నది వాస్తవం. పైగా దీనిపై ఎవరో ఒకరిపై చర్య తీసుకున్నట్టు కనిపించకపోతే బాగుండదని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి కోసలరాంను బదిలీ చేశారు బాబు. ఇంతకీ ఆయనపై మోపిన అభియోగం ఏమిటి? సీఎంగా లబ్ధిదారులైన రైతుల వివరాలను, పరిహారం ఎంత పెరిగిందన్న వివరాలను, ఇలాంటి కేసులు ఇంకెన్ని ఉన్నాయన్న వివరాలను సేకరించలేదని! స్వయంగా ముఖ్యమంత్రి సంతకం చేసిన ఫైలును ఆపేందుకు ఏ అధికారి మాత్రం సాహసించగలడు?! బాబు ఇలా ఎక్కడ లేని ఆసక్తితో ఏలేరు ఫైళ్లపై చకచకా సంతకం చేయడానికి కారణం ఒక్కటే... విశాఖ జిల్లాలో అధికార టీడీపీ నేతలు పలువురు పీలా పోతినాయుడు (ఏలేరు కుంభకోణంలో పాత్రధారి)తో షరీకై చెల్లింపులు నిరాటంకంగా జరిగేందుకు దోహదపడ్డారు.’’
చూపుడు వేళ్లన్నీ సచివాలయం వైపే...
‘‘ఏలేరు కుంభకోణం మొత్తం స్వామి, పోతినాయుడు చేతుల మీదుగానే జరిగిపోయినట్టు బయటికి కనిపిస్తున్నా... జాగ్రత్తగా పరిశీలిస్తే ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఉన్నతాధికారులు అందించిన సహకారం వల్లే అవినీతి ఇన్నాళ్లూ గుట్టుగా సాగిందని స్పష్టమవుతుంది. దర్యాప్తు ఇంకాస్త ముందుకు కదిలితే చంద్రబాబు తెరవెనుక పోషించిన పాత్ర కూడా వెల్లడవుతుంది. కాబట్టే అలా జరగకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నట్టు స్పష్టమవుతూనే ఉంది. పైగా ఈ వ్యవహారంపై ఇప్పటిదాకా చంద్రబాబు స్పందించిన తీరు, దర్యాప్తుకు ఆదేశించిన విధానాన్ని బట్టి చూస్తే ఆయన అంతరంగం ఏమిటన్నది తెలిసిపోతోంది. హైకోర్టు తనంతట తాను కదిలి, అక్రమ చెల్లింపులను నిలిపేసింది. లేదంటే రూ.40 కోట్లకు పైగా ప్రజాధనం దుర్వినియోగమయ్యేది’’
(‘‘పోతినాయుడుకు గడ్డం ఉండేదిట. అది నల్లగడ్డం. కానీ ఏలేరు స్కామ్‌లో మరో గడ్డం నాయుడే అసలైన నిందితుడు. అయితే ఆ గడ్డం తెల్లగడ్డం. పైగా ఆ నాయుడు విశాఖలో కాకుండా హైదరాబాద్‌లో, సచివాలయంలో ఉంటాడు’’ అంటూ కూడా పుస్తకంలో బీజేపీ విసుర్లు విసిరింది! కేసు విచారణ సందర్భంగా కోర్టులో లాయర్లు కూడా ఈ మేరకు చలోక్తులు విసురుకున్నారని పేర్కొంది!!)