
బాలకృష్ణకు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉందా?:షర్మిల
ఆ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటేనే ఒక భరోసా అని వైఎస్సార్ సీపీ నేత వైఎస్ షర్మిల పునరుద్ఘాటించారు.
అనంత: మానసిక స్థితి సరిగాలేని బాలకృష్ణకు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉందా? అని షర్మిల నిలదీశారు. గతంలో బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగితే..ఆ కేసు నుంచి బయట పడేందుకు మానసిక స్థిమితం లేదంటూ బాలకృష్ణ ఒక సర్టిఫికెట్ తెచ్చుకున్న సంగతిని షర్మిల గుర్తు చేశారు. జిల్లాలోని హిందూపురంలో ప్రసంగించిన ఆమె.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, బాలకృష్ణలపై మండిపడ్డారు. పిచ్చివాళ్లకు ఓటు వేస్తే ప్రజలను పిచ్చోళ్లను చేస్తారన్నారు. మంచి కొడుకు అనిపించుకోలేని బాలకృష్ణ నటుడు కావొచ్చేమో కాని...మంచి రాజకీయ వేత్త కాలేరని షర్మిల అభిప్రాయపడ్డారు.
మంచి నేత అంటే మీసాలు తిప్పడమో, తొడ గొట్టడమే కాదని..ప్రజల కష్టనష్టాలు తెలుసుకోవడమన్నారు. చంద్రబాబు ప్రజల కోసం ఏనాడు పోరాడ లేదని, కాంగ్రెస్‌తో కుమ్మక్కు రాజకీయాలు చేయడానికే ఆయనకు సమయం సరిపోయిందని షర్మిల తెలిపారు. ప్రజా సమస్యలపై అవిశ్వాసం పెడితే ఆయన విప్ జారీ చేసి కాంగ్రెస్‌ను కాపాడారన్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి..ఆయనపై చెప్పులు వేయిస్తే బాలకృష్ణ మాత్రం ఆయనతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారన్నారు. కొడుకు అన్న పదానికి మచ్చ తెచ్చిన ఆయనకు జగన్నను విమర్శించే స్థాయి ఉందా? అంటూ షర్మిల ప్రశ్నించారు. వైఎస్ఆర్ కోసం మరణించిన కుటుంబాలను కొడుకుగా జగన్ ఓదార్చి.. చెయ్యని నేరాలకు జైలుకు వెళ్లారన్నారు. అసలు బాలయ్యకు.. జగనన్నకు నక్కకు నాగ లోకానికి ఉన్న తేడా ఉందని షర్మిల ఎద్దేవా చేశారు. రైతులు, చేనేతలు, విద్యార్థుల పక్షాన నిలబడి దీక్షలు చేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డిదేనని ఆమె గుర్తు చేశారు. చివరకు ఓదార్పు కోసం జగన్ పదవులను సైతం తృణప్రాయంగా వదులుకున్నారన్నారు.
ఆ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటేనే ఒక భరోసా అని వైఎస్సార్ సీపీ నేత వైఎస్ షర్మిల పునరుద్ఘాటించారు. పేదవాడి మనసెరిగి పరిపాలించిన ఆ మహానేతకు ఇప్పటికీ ప్రజల గుండెల్లో స్థానం పదిలంగానే ఉందన్నారు. జిల్లాలోని ఎన్నికల రోడ్ షోలో భాగంగా హిందూపురంలో పర్యటించిన ఆమె.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుని రాజన్న సువర్ణ యుగాన్ని తెచ్చుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆనాటి వైఎస్సార్ పాలనలో పావలా వడ్డీకే రుణాలను ఇచ్చిన సంగతిని గుర్తు చేశారు. ప్రతీ పేద విద్యార్థి డాక్టర్, ఇంజనీర్ కావడమే లక్ష్యంగా పని చేసిన వైఎస్సార్ ప్రతీ ఒక్కరిగా భరోసా కల్పించారని షర్మిల తెలిపారు. ఆయన ప్రవేశ పెట్టిన ఆరోగ్య శ్రీ పథకం పేదవాడు వైద్యం చేయించుకోవడాని ఎంతగానో ఉపయోగపడిందన్నారు. ముస్లిం మైనార్టీలకు ఐదు శాతం రిజర్వేషన్లను వైఎస్సార్ కల్పించారన్నారు. ఆయన హయాంలో ఏ ఒక్క ఛార్జీ పెరగలేదని షర్మల ఈ సందర్భంగా గుర్తు చేశారు.