హెరిటేజ్ పా‘పాలు’
కొలతల్లో నిలువు దోపిడీ
లీటర్‌కు 100 మిల్లీలీటర్లు తక్కువగా పాల ప్యాకెట్లు
అరలీటర్ పాలకు రూ.2 నుంచి రూ.4 వరకు నష్టం
తూనికలు-కొలతల శాఖ దాడుల్లో వెలుగులోకి
నేడు వివరాలు వెల్లడిస్తామన్న అధికారులుఅడ్డుకునేందుకు ‘ఎల్లో సిండికేట్’ యత్నాలు
హెరిటేజ్ పాలలో కేన్సర్ కారకం ఉందన నిషేధం విధించిన కేరళ
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి చెందిన హెరిటేజ్ డెరుురీ వినియోగదారులను నిలువునా వంచిస్తోంది. ఈ పాల కొనుగోలుదారుల్లో మధ్య తరగతి వారే ఎక్కువగా ఉండటంతో వారే బాధితులుగా మిగులుతున్నారు. సాధారణ పాలకన్నా ప్యాకేజ్డ్ మిల్క్ పట్ల వినియోగదారులకు ఎంతో నమ్మకం ఉంటుంది. హెరిటేజ్ దాన్ని కూడా పలుమార్లు వమ్ము చేసేసింది. లీటర్‌కు ఏకంగా వంద మిల్లీలీటర్లు తక్కువ పరిణామంతో పాలను ప్యాకెట్లలో సీల్ చేయడం వల్ల వినియోగదారునికి ఒక్కో అరలీటర్ ప్యాకెట్‌పైన రూ.2 నుంచి రూ.4 వరకు నష్టం కలుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వినియోగదారుల నిలువు దోపిడీ కొనసాగడం తూనికలు కొలతల శాఖ అధికారులు దృష్టికి వెళ్లడంతో శనివారం రాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దాడులు ప్రారంభించారు. ఇవి ఆదివారం కూడా కొనసాగాయి. ఈ విషయాన్ని ధ్రువీకరించిన ఆ శాఖ కంట్రోలర్ గోపాల్‌రెడ్డి పూర్తి వివరాలను సోమవారం వెల్లడిస్తామని చెప్పారు. పాలు, వివిధ రకాల పాల ఉత్పత్తుల కొలతల్లో అవకతవకలున్నట్టు ప్రాథమిక అంచనాకు వచ్చిన అధికారులు ఆ మేరకు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. అయితే రెండురోజుల్లో సీమాంధ్రలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉండటంతో తూనికలు, కొలతల శాఖ దాడులు, హెరిటేజ్‌లో జరుగుతున్న పా‘పాలు’ బయటపడకుండా నియంత్రించేందుకు ఇటు టీడీపీ నేతలతో పాటు మరోవైపు ‘ఎల్లో సిండికేట్’ సైతం తీవ్ర స్థాయిలో అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం.
పుట్టుక నుంచే అక్రమాలు..
చిత్తూరు జిల్లా చంద్రగిరిలో పాలపొడి తయారీ కంపెనీగా హెరిటేజ్ ఫుడ్స్ కథ మొదలైంది. చంద్రబాబు రెవెన్యూ మంత్రి కావడంతో దీని దశ తిరిగింది. ప్రభుత్వ డెయిరీలు మూతపడుతుండగా... అందుకు విరుద్ధంగా హెరిటేజ్ మాత్రం బాబు అధికార దండంతో ‘చక్రం తిప్పడం’వల్ల ఓ వెలుగు వెలుగుతూ వచ్చింది. ఆయన సీఎం అయిన తర్వాత హెరిటేజ్‌కు రాయితీల పంట పండి ంచుకున్నారు. మరోవైపు అప్పటికే పేరు ప్రఖ్యాతులున్న సంగం డెయిరీ, చిత్తూరు డెయిరీ వంటివి రోజురోజుకు నిర్వీర్యమయ్యేలా చేశారు.
ఆ పాల నిండా ‘కేన్సర్’ కారక విషం!
హెరిటేజ్ సంస్థ అమ్ముతున్నది పాలు కాదు విషమంటూ గతంలో ప్రభుత్వ విప్ పద్మరాజు ఆరోపించారు. దీనిపై తక్షణమే విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేశారు. హెరిటేజ్ పాలలో కేన్సర్ కారకమైన రసాయనం ఫార్మాల్డిన్ ఉందంటూ.. 2012 సెప్టెంబర్ 18న కేరళ ప్రభుత్వం వీటి విక్రయాలపై ఏకంగా నిషేధం విధించింది. ఈ పాలతో ప్రజలకు కలుగుతున్న ముప్పుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం పలు సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లింది. ఈ పాల వల్ల ఎందరు కేన్సర్ బారినపడ్డారో తేల్చాలని డిమాండ్ చేసింది. హెరిటేజ్ పాలపై వస్తున్న ఆరోపణల్లో నిజానిజాలు తేలే వరకు వాటి విక్రయాలపై రాష్ట్రంలో నిషేధం విధించాలంటూ వైద్యులతో సహా అనేకమంది డిమాండ్ చేసినా సర్కారు చెవికెక్కలేదు. మరోవైపు ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించని హెరిటేజ్ ప్లాంట్లలో పని కూడా దినదిన గండమేనని కార్మికులే చెబుతుంటారు. విశాఖపట్నం జిల్లాలోని కశింకోట మండలం బయ్యవరం దగ్గరున్న హెరిటేజ్ డెయిరీ రెండో విభాగంలో కాంట్రాక్టు కార్మికులతో ట్రయల్ రన్ నిర్వహిస్తున్న సమయంలో శీతలీకరణ విభాగం యూనిట్-2లో భారీ పేలుడు సంభవించింది. దీంతో అక్కడ పనిచేస్తున్న సుధాకర్, మనోజ్, ధర్మవీర్ సజీవదహనమయ్యారు. తూర్పుగోదావరి జిల్లా ఎర్రగండిలో ఉన్న హెరిటేజ్ మిల్క్ బల్క్ యూనిట్ ఎఫ్యులెంట్ ట్యాంక్ పరిసరాలకు సరైన భద్రత కల్పించకపోవడంతో అందులోపడి అనిల్‌కుమార్, కరుణకుమార్ అనే చిన్నారులు మృతిచెందారు.