కోవెలకుంట్ల, న్యూస్‌లైన్: సీనియర్ నేత.. మూడు పర్యాయాలు శాసనసభ్యుడు.. ప్రజల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ చల్లా రామకృష్ణారెడ్డి సొంతం. పాణ్యం.. కోవెలకుంట్ల నియోజకవర్గాల్లో చక్రం తిప్పినా.. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో నియోజకవర్గంలో ఆయన పట్టు అంతంతకూ సడలుతోంది. ఇన్నాళ్లు వెంట నడిచిన కేడర్ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా పార్టీ మారడంతో ఆయన కోట బీటలు వారుతోంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చల్లా ఎన్నికల బరిలో నిలవకుండా టీడీపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలిపేందుకు నిర్ణయించుకోవడంతో ఒక్కొక్కరుగా ఆయన వర్గం నుంచి తప్పుకోవడం చర్చనీయాంశమవుతోంది.
1983 సంవత్సరంలో రాజకీయ అరంగ్రేటం చేసిన చల్లా ఆ ఎన్నికల్లో పాణ్యం నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసీ గెలుపొందారు. 1989లో డోన్ నియోజకవర్గం నుంచి, 1992లో నంద్యాల పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి చవి చూశారు. 1999, 2004 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున కోవెలకుంట్ల నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కోవెలకుంట్ల నియోజకవర్గం కనుమరుగై బనగానపల్లె నియోజకవర్గం ఏర్పాటైంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి పీఆర్పీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ముక్కలు చేయడంతో ఆరు నెలల క్రితం పార్టీకి రాజీనామా చేశారు. రాష్ర్టంలోని ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసేందుకు అవకాశం లేకపోవడంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తిరిగి మాతృ పార్టీలో చేరిపోయారు. నిన్న మొన్నటి వరకు ఆయన కేడర్‌ను కాపాడుకుంటూ వస్తున్నారు. ఆ కారణంగానే సహకార, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోగలిగారు.
ఈయన అసెంబ్లీ బరిలో నిలిస్తే త్రిముఖ పోటీ నెలకొంటుందని అంతా భావించారు. అనూహ్యంగా చల్లా టీడీపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలిపేందుకు నిర్ణయించుకోవడంతో అంచనాలు తారుమారయ్యాయి. ఆయనైతే కండువా మార్చుకున్నారు కానీ.. అనుచరవర్గం అంత సులువుగా ‘రంగు’ మార్చేందుకు సుముఖత చూపకపోవడం చల్లా ప్రాభవాన్ని గండి కొడుతోంది.
ప్రధానంగా కోవెలకుంట్ల మండలంలో ఆ ప్రభావం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ముఖ్య నేతలంతా చల్లాకు గుడ్‌బై చెప్పేసి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. వైఎస్‌ఆర్‌సీపీ బనగానపల్లె నియోజకవర్గ సమన్వయకర్త కాటసాని రామిరెడ్డి సమక్షంలో చల్లా వర్గంలో అధిక శాతం పార్టీ మారుతుండటంతో ఆయన ప్రాభవానికి గండి పడుతోంది. సార్వత్రిక ఎన్నికల నాటికి మరికొందరు ఇదే కోవలో చల్లాకు దూరమవుతారనే చర్చ జరుగుతోంది.
‘చల్ల’గా జారుకుంటున్నారు
Published Sun, Apr 6 2014 2:37 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
Advertisement
Advertisement