
సాధారణ ఓటర్ల మాదిరే...
శాంతి భద్రతల పర్యవేక్షణ విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది సాధారణ ఓటర్ల మాదిరిగా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
శాంతిభద్రతల విధుల్లోని భద్రతా సిబ్బంది ఓటుపైసుప్రీం
న్యూఢిల్లీ: శాంతి భద్రతల పర్యవేక్షణ విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది సాధారణ ఓటర్ల మాదిరిగా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇంకా ఎన్నికల ప్రక్రియ మొదలుకాని ప్రాంతాల్లో వీరు ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చని సోమవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. శాంతిభద్రతల పర్యవేక్షణ విధుల్లోని సిబ్బంది మూడేళ్ల పాటు విధులు నిర్వర్తించడమే కాక.. కుటుంబంతోపాటు అక్కడే నివసిస్తేనే సంబంధిత ప్రాంతాల్లో ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అర్హులన్న కేంద్ర ఎన్నికల సంఘం వా దనను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎం లోథా నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చింది.
2014 జనవరి 1 నుంచి ఈ రోజు వరకూ పోస్టింగ్ పొంది విధులు నిర్వర్తిస్తున్న వారంతా సంబంధిత ప్రాంతాల్లో ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అర్హులని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పోస్టల్ బ్యాలెట్ సమర్థవంతంగా అమలు చేయడానికి వీలుగా భద్రతా సిబ్బంది వివరాలను రెండు రోజుల్లో ఈసీకి సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో స్పందించిన ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్‌లో ఓటు హక్కు కోసం ఇప్పటి వరకూ డిక్లరేషన్ సమర్పించని వారు తాము పని చేస్తున్న నియోజకవర్గాల్లో ఓటర్లుగా నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. అయితే ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన 225 లోక్‌సభ స్థానాల్లో మినహా మిగిలిన చోట్ల భద్రతా సిబ్బంది ఓటర్లుగా నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు.