అసెంబ్లీ బరిలో నిలుచునే అభ్యర్థుల జాబితా గుట్టు పార్టీలు తేల్చక పోవడంతో నామినేషన్ల ప్రక్రియకు జిల్లాలో ఇంకా బోణీ పడలేదు. అన్ని పక్షాలనుంచీ ఆశావహులు ఉన్నా వారు ఆయా పార్టీల లిస్టుల్లో ఉంటారా లేదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పొత్తుల్లో ఎవరు పేరు గల్లంతవుతుందో తెలీక అభ్యర్థులుగా నిలవాలనుకునే వారు ఉత్కంఠకు లోనవుతున్నారు. పార్టీల పెద్దల చుట్టూ తిరుగుతున్నారు.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : సాధారణ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలై రెండు రోజులు దాటింది. అయినా అభ్యర్థులెవరూ నామినేషన్లు దాఖలు చేసేందుకు ముందుకు రావడం లేదు. ప్రధాన పార్టీల్లో అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఇంకా కొలిక్కి రావడం లేదు.
పార్టీల మధ్య పొత్తుల వ్యవహారం తెగకపోవడంతో అభ్యర్థుల జాబితాపై ప్రభావం చూపుతోంది. మరోవైపు టికెట్లు ఆశిస్తున్న నేతలు పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు ఢిల్లీ, హైదరాబాద్‌లో మకాం వేశారు. ఈ నెల తొమ్మిదిన నామినేషన్ల పర్వం ముగియనుండటంతో చివరి నిముషం వరకు అభ్యర్థులు ఎవరనే అంశంపై ఉత్కంఠ సాగే సూచనలు కనిపిస్తున్నాయి.
జిల్లాలోని రెండు లోక్‌సభ, 14 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల రెండో తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణకు అధికార యంత్రాంగం ఏర్పా ట్లు చేసింది. జిల్లాలో రెండు రోజుల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. కాంగ్రెస్ - సీపీఐ, కాంగ్రెస్- టీఆర్‌ఎస్, టీఆర్‌ఎస్- సీపీఐ, టీఆర్‌ఎస్ - సీపీఎం, టీఆర్‌ఎస్- బీజేీ ప, టీడీపీ- బీజేపీ కూటములు ఏర్పడొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒంటరి పోరుకు సిద్దమంటూనే కాంగ్రెస్, టీఆర్‌ఎస్ వివిధ పార్టీలతో ఎన్నికల అవగాహన కోసం యత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై అన్ని పార్టీల్లోనూ అభ్యర్థుల ఎంపికపై గందరగోళం నెలకొంది. ఏ కూటమి మధ్య ఏ సీటును వదులుకోవాల్సి ఉంటుందనే అంశంపై ఆయా పార్టీల జిల్లా నేతలు, ఔత్సాహిక అభ్యర్థులు లెక్కలు వేసుకుంటున్నారు. పొత్తు కుదిరితే సునాయాసంగా బయట పడొచ్చని కొందరు ఆశావహులు లెక్కలు వేసుకుంటున్నారు. ఈ దిశగా తమ పార్టీ పెద్దలపైనా ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు పొత్తు కుదిరితే తమ సీటు గల్లంతవుతుందనే భయం మరికొందరిని వెంటాడుతోంది.
దీంతో అన్ని పార్టీల్లోనూ చివరి నిమిషం వరకు ఏ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారనే అంశంపై స్పష్టత లోపించింది. ఎదుటి పార్టీ అభ్యర్థిపై స్పష్టత వచ్చిన తర్వాతే తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించాలనే వ్యూహాన్ని కూడా పార్టీలు అనుసరిస్తున్నాయి. ఈ నెల ఆరో తేదీన తొలి విడత ప్రాదేశిక ఎన్నికలు ఉండటంతో ఆ తర్వాతే జాబితా విడుదల చేసేలా పార్టీలు వ్యూహ రచన చేస్తున్నాయి. టికెట్ దక్కని నేతలు స్థానిక ఎన్నికల్లో వ్యతిరేకంగా వ్యవహరిస్తారనే భయం కూడా పార్టీలను వెంటాడుతోంది.
సన్నాహాల్లో అభ్యర్థులు
జాబితాలు ప్రకటించడంలో అన్ని పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుండటంతో అభ్యర్థులు సొంత ఎత్తుగడలు వేస్తున్నారు. మంచి ముహూర్తం చూసుకుని శుక్రవారం నుంచి నామినేషన్ల దాఖలు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పార్టీ జాబితాతో సంబంధం లేకుండా నామినేషన్ దాఖలు చేసి, తర్వాత పార్టీ బీ ఫారం కోసం పట్టు పట్టాలనే యోచనలో అభ్యర్థులు కనిపిస్తున్నారు. నామినేషన్ దాఖలు ద్వారా పార్టీ అధిష్టానంపై ఒత్తిడి పెంచవచ్చనే భావన మరికొందరు నేతల్లో కనిపిస్తోంది. అటు పార్టీల మధ్య ఎన్నికల అవగాహన, ఇటు సొంత పార్టీలో టికెట్ల వేట నడుమ నామినేషన్ల దాఖలు ఆరో తేదీ తర్వాతే ఊపందుకునే సూచనలు కనిపిస్తున్నాయి.
వీడని ఉత్కంఠ..!
Published Fri, Apr 4 2014 3:48 AM | Last Updated on Fri, Mar 22 2019 6:24 PM
Advertisement
Advertisement