టీఆర్‌ఎస్ నేతలపై కాంగ్రెస్ కన్ను
పార్టీలోకి లాగేసుకునేందుకు వ్యూహాలు
రంగంలోకి కొప్పుల రాజు.. అసంతృప్త నేతలతో మంతనాలు
త్వరలో 15 మంది చేరతారని గుసగుసలు
కోదండరాం, మల్లేపల్లి లక్ష్మయ్యతోనూ రహస్య భేటీ
8 మంది టీ-జేఏసీ నాయకులకు సీట్లిచ్చే ప్రతిపాదన
జాగ్రత్త పడుతున్న కేసీఆర్.. పెండింగ్‌లో ఇరు పార్టీల అభ్యర్థుల జాబితాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరింత బలపడేందుకు కాంగ్రెస్ తన వ్యూహాలకు పదును పెట్టింది. టీఆర్‌ఎస్‌తో పొత్తు విషయం ఎటూ తేలకపోవడంతో.. ప్రత్యామ్నాయ మార్గాలపై కాంగ్రెస్ దృష్టి సారించింది. ఆపరేషన్ ఆకర్ష్‌కు మరోసారి తెరలేపింది. తనకు గట్టి పోటీనిస్తున్న ఉద్యమ పార్టీనే అందుకు ప్రధాన టార్గెట్ చేసుకుంది. టీఆర్‌ఎస్‌లోని అసమ్మతి నేతలను పార్టీలోకి లాక్కోడానికి కాంగ్రెస్ పెద్దలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ మొదలవుతున్న నేపథ్యంలో గులాబీ దండును బలహీనపరిచేందుకే ఈ ఎత్తులు వేస్తున్నారు. టీఆర్‌ఎస్‌లో బలమైన నేతలను గుర్తించినప్పటికీ.. వారిలో పార్టీ అధినేత కేసీఆర్ తీరుపై అసంతృప్తిగా ఉన్న వారినే కాంగ్రెస్ ముఖ్యులు లక్ష్యంగా చేసుకుంటున్నారు.
పధానంగా కాంగ్రెస్ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో.. స్థానిక టీఆర్‌ఎస్ నేతలను చేర్చుకోవడం ద్వారా పార్టీ గెలుపు అవకాశాలను సుగమం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. టీఆర్‌ఎస్ నుంచి చాలా మంది నేతలు కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు అందడంతో అభ్యర్థుల జాబితాను వెల్లడించకుండా పెండింగ్‌లో పెట్టారు. వాస్తవానికి తెలంగాణ అభ్యర్థుల జాబితాపై కసరత్తు రెండు రోజుల క్రితమే పూర్తయింది. అయితే గులాబీ నేతలతో రహస్య మంతనాలు జరుగుతుండటంతో... అవి ఫలప్రదమయ్యే వరకు జాబితాను విడుదల చేయకూడదని పార్టీ పెద్దలు నిర్ణయించారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం రెండు మూడు రోజుల్లో టీఆర్‌ఎస్ నుంచి సుమారు 15 మంది వరకు నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. కాంగ్రెస్ బలహీనంగా ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే చేరికలు ఎక్కువగా ఉండనున్నాయి.
ఉత్తర తెలంగాణపై ప్రత్యేక దృష్టి
వాస్తవానికి ఉత్తర తెలంగాణ జిల్లాలో పలు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌కు గట్టిపోటీనిచ్చే నేతలు కాంగ్రెస్‌లో కరువయ్యారు. వరంగల్ జిల్లాలో స్టేషన్‌ఘన్‌పూర్, పరకాల, కరీంనగర్ జిల్లాలో చొప్పదండి, రామగుండం, నల్లగొండ జిల్లా భువనగిరి, ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి తదితర 30 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బలహీనంగా ఉన్నట్లు పార్టీ పెద్దలు అంచనాకు వచ్చారు. ఆయా నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను నిలబెడితే గెలిచే అవకాశముందని భావిస్తున్నారు. తెలంగాణ జిల్లాలో విస్త్రతంగా పర్యటించి వెళ్లిన ఏఐసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ కొప్పుల రాజు తాజాగా హైదరాబాద్‌లో మకాం వేశారు. టీఆర్‌ఎస్, తెలంగాణ రాజకీయ జేఏసీ నేతలతో రహస్య చర్చలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఓ ప్రైవేట్ హోటల్‌లో జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, కో-చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్యతో కొప్పుల రాజు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. చర్చల వివరాలను ఇరువైపులా గోప్యంగా ఉంచడం మరింత ఆసక్తికరంగా మారింది. అయితే టీజేఏసీ నేతలకు టిక్కెట్లు ఇచ్చే అంశంతోపాటు తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కు మద్దతిచ్చే విషయంపై మాట్లాడేందుకే ఈ భేటీ జరిగినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణకు వ్యతిరేకంగా వ్యహరించిన పార్టీల నేతలను టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆదరిస్తూ.. వారికి టికెట్లు ఇస్తున్న నేపథ్యంలో.. దీనిపై టీజేఏసీ ఎందుకు విమర్శించడం లేదనే అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది.
జేఏసీ నేతలకు టికెట్లు!
జేఏసీ నుంచి 8 మంది నాయకులకు టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోందని, వారికి బహిరంగ మద్దతు ప్రకటించే అంశంపైనా కోదండరాం అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. మల్లేపల్లి లక్ష్మయ్య, అద్దంకి దయాకర్‌తోపాటు పిట్టల రవీందర్, జిల్లాల్లోని జేఏసీ నాయకులు గంగారాం, రాజేందర్‌రెడ్డి(మహబూబ్‌నగర్), రంగరాజు(ఖమ్మం), మర్రి అనిల్(నల్లగొండ), సినీ దర్శకుడు ఎన్.శంకర్, న్యాయవాదుల జేఏసీ నేత రాజేందర్‌రెడ్డిలకు టికెట్లు ఇచ్చే ప్రతిపాదనలను కొప్పుల రాజు ఈ సందర్భంగా కోదండరాం ముందుంచినట్లు జేఏసీ వర్గాలు తెలిపాయి.
ఇక టీఆర్‌ఎస్‌లో అసంతృప్తిగా ఉన్న నేతల జాబితాను కొప్పుల రాజు రూపొందించుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. టీఆర్‌ఎస్ ఎంపీ మందా జగన్నాథం, ఎమ్మెల్యే రాజయ్య, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, దాసోజు శ్రవణ్ వంటి నేతలతో మంతనాలు జరుపుతున్నట్లు వినికిడి. వీరే కాకుండా ఉత్తర తెలంగాణ జిల్లాలో కాంగ్రెస్ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో బలమైన టీఆర్‌ఎస్ నాయకుల జాబితాను కూడా తెప్పించుకుని వారికి గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్ నేతలను కాంగ్రెస్‌లోకి లాగే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేసీఆర్‌కూ సంకేతాలు వెళ్లాయి. అందుకే టీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితా 15 రోజుల క్రితమే సిద్ధమైనప్పటికీ.. వాటిని ప్రకటించకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. జాబితాను ఇప్పుడే ప్రకటిస్తే వెంటనే అసమ్మతి నేతలను కాంగ్రెస్ ఎగరేసుకుపోయి టికెట్లు కేటాయింస్తుందని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా ఢిల్లీ నుంచి కాంగ్రెస్ జాబితా వెల్లడయ్యాకే.. టీఆర్‌ఎస్ అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని ఆయన నిర్ణయించినట్లు తెలుస్తోంది.