తమిళనాడు సీఎం జయలలితపై నేటి నుంచి రోజువారీ విచారణ
స్టే ఎత్తేసిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: ఆదాయానికి మించి రూ. 66.65 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారనే 18 ఏళ్లనాటి కేసులో తమిళనాడు సీఎం జె. జయలలితపై మంగళవారం నుంచి రోజు వారీ విచారణ తిరిగి ప్రారంభం కానుంది. కర్ణాటకలోని ట్రయల్ కోర్టు చేపట్టిన ఈ కేసు విచారణకు సంబంధించి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఎస్.పి.పి)గా ఉన్న జి. భవానీ సింగ్ అనారోగ్య కారణాల రీత్యా వైద్య పరీక్షలకు వెళ్లారు. దీంతో ఈ నెల 7న సుప్రీం కోర్టు ఈ కేసు విచారణపై మూడు వారాల స్టే విధించింది.
కాగా, సింగ్ స్థానంలో సీనియర్ అడ్వొకేట్ ఎల్. నాగేశ్వరరావు ఎస్.పి.పిగా కేసును చేపట్టనున్న నేపథ్యంలో న్యాయమూర్తులు జస్టిస్ బి.ఎస్. చౌహాన్, జస్టిస్ జె. చలమేశ్వర్‌లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణను మంగళవారం నుంచి తిరిగి ప్రారంభించాలని ఆదేశించారు. ఏఐఏడీఎంకే అధినేత అయిన జె. జయలలిత తమిళనాట 1991-96 మధ్య సీఎంగా ఉన్న సమయంలో ఆదాయానికి మించి రూ.66.65 కోట్లు పోగేశారని కేసు నమోదైంది. విచారణ పారదర్శకంగా సాగేందుకుగాను సుప్రీం కోర్టు గతంలోనే ఈ కేసును తమిళనాడు నుంచి బెంగళూరులోని ట్రయల్ కోర్టుకు బదిలీ చేయడం తెలిసిందే.