సైకిల్ సీటుకు..కార్పొరేటు
సాక్షి ప్రతినిధి, కాకినాడ :తెలుగుదేశం పార్టీతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్న ఓ కార్పొరేట్ దిగ్గజం చమురు కార్యకలాపాలన్నీ అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించడం లేదా ప్రతిపక్షం దన్ను అవసరమని భావించిన ఆ సంస్థ ఎన్నికల్లో టీడీపీకి భారీ ప్యాకేజీ ముట్టచెప్పేందుకు అంగీకరించిందని విశ్వసనీయ సమాచారం. ఆ కార్పొరేట్ దిగ్గజం అక్కడి ఎంపీ సహా పలువురు ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టడం కంటే అటువంటి వారు ఎన్నికయ్యేందుకు ఎంతైనా కుమ్మరించడమే మేలనే అభిప్రాయానికి వచ్చిందని తెలిసింది. ఎన్నికల అనంతరం ఏ ప్రభుత్వం వచ్చినా వనరుల తరలింపునకు ప్రజల నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురు కాకుండా చూసుకునే వ్యూహంలో భాగమే ఈ ఒప్పందమంటున్నారు. ఇది అడ్డగోలుగా వనరులు తరలించే సందర్భంలో ప్రజల గొంతు నొక్కేసే ప్రయత్నమేనని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు విశ్లేషిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే చివరి నిమిషంలో టీడీపీ అమలాపురం ఎంపీ అభ్యర్థిని మార్చేశారని తెలుగుతమ్ముళ్లు బాహాటంగానే చెబుతున్నారు. కోనసీమలో పార్టీ శ్రేణులకు ముక్కుమొహం తెలియని పండుల రవీంద్రబాబును బరిలోకి దింపడం వెనుక మర్మమిదేనంటున్నారు. వాస్తవానికి ఏడాది క్రితమే అమలాపురం ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావును చంద్రబాబు ప్రకటించారు. నామినేషన్ల ఘట్టం ముగియడానికి కొద్ది రోజుల ముందు గొల్లపల్లికి జెల్లకొట్టి రవీంద్రబాబుకు సీటు కట్టబెట్టడం వెనుక కార్పొరేట్ దిగ్గజం ప్రమేయం ఉందని కోనసీమ కోడై కూస్తోంది. రవీంద్రబాబు విశాఖలో పనిచేస్తున్న సమయంలో ఉన్న సాన్నిహిత్యంతో కార్పొరేట్ సంస్థ పెద్దలు పట్టుబట్టి మరీ ఆయనను ప్రతిపాదించినట్టు పార్టీ నేతలు భావిస్తున్నారు. పార్టీ వెన్నంటి ఉన్న వారిని కాదని కార్పొరేట్ దిగ్గజం భవిష్యత్ అవసరాల కోసం వారు చెప్పినట్టే అభ్యర్థిని మార్చేశారని తెలుగు తమ్ముళ్లు అగ్గిమీదగుగ్గిల మవుతున్నారు. అయితే ఆ వ్యూహానికి ముసుగుగా ఉన్నత విద్యావంతుడిని బరిలోకి దింపామని చెపుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.
ఆ సంస్థ కోసమే రవీంద్రబాబుకు టిక్కెట్టు..
రవీంద్రబాబు ఎంపిక ఆ పార్టీలో తొలి నుంచీ వివాదంగా మారింది. కార్పొరేట్ దిగ్గజం దన్ను ఉండబట్టే ఆయన తక్కువ సమయంలోనే పార్టీ టిక్కెట్ పొందారనే ప్రచారం జరుగుతోంది. పార్లమెంట్ నియోజకవర్గంపరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్‌లలో ఎన్నికల ఖర్చుకు ఆ దిగ్గజమే సుమారు రూ.50 కోట్లు వెచ్చించేందుకు సన్నద్ధమయ్యే రవీంద్రబాబుకు టిక్కెట్ ఇప్పించినట్టు సచాచారం. టీడీపీలో కార్పొరేట్ సంస్కృతికి మచ్చుతునకలైన సుజనా చౌదరి, గరికిపాటి రామ్మోహనరావులే ఈ వ్యవహారంలో చక్రం తిప్పారంటున్నారు. గెలుపు, ఓటములతో నిమిత్తం లేకుండా పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు కనీసం ఆర్థికంగా చేయూత లభిస్తుందనే నమ్మకంతో కార్పొరేట్ దిగ్గజం చెప్పినట్టు ఎంపీ టిక్కెట్టును కట్టబెట్టారంటున్నారు. గొల్లపల్లిని రాజోలు నుంచి పోటీ చేయాలని స్వయంగా చంద్రబాబు అభ్యర్థించినా అంగీకరించేందుకు నాలుగు రోజుల సమయం తీసుకున్నారు. అక్కడ పోటీకయ్యే మొత్తం ఖర్చు భరించేలా హామీ లభించడంతోనే రాజోలు వెళ్లడానికి గొల్లపల్లి అంగీకరించారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఈ పరిణామాలన్నీ పరిశీలిస్తుంటే ఈ ఎన్నికల్లో జిల్లాకు సంబంధించి తమ పార్టీని నడిపిస్తున్నది అధినేత కాక.. ఆ కార్పొరేట్ దిగ్గజమేనంటున్నారు.