huge package
-
Sai Divesh Chowdary : అమెరికాలో హైదరాబాద్ కుర్రాడికి రూ. 3 కోట్ల ప్యాకేజీ
హైదరాబాదీ కుర్రోడు బంపర్ ఆఫర్ కొట్టేశాడు. ప్రపంచ ప్రఖ్యాత చిప్ తయారీ సంస్థ ఎన్విడియాలో భారీ వార్షిక వేతనంతో ఉద్యోగం సంపాదించాడు. ఒకటీ రెండు కాదు ఏకంగా 3 కోట్ల రూపాయలం ప్యాకేజీతో ఉద్యోగాన్ని సంపాదించాడు. హైదరాబాద్(Hyderabad)లోని ఎల్బీనగర్ చిత్రా లేఅవుట్‌కు చెందిన గుడె సాయి దివేశ్ చౌదరి (Gude Sai Divesh Chowdary) కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి. చిప్‌మేకర్ ఎన్విడియాలో ఉద్యోగం సాధించిన సాయిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. పట్టుదలకు, మారుపేరుగా నిలిచి, ఆత్మవిశ్వాసంతో ఉన్నత చదువు చదివిన సాయి దివేశ్ తనలాంటి ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. దివేశ్ తండ్రి కృష్ణ మోహన్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. తల్లి రమాదేవి పబ్లిక్ స్కూల్లో టీచర్‌గా పదేళ్ల పాటు పనిచేశారు. చిన్నప్పటినుంచీ చదువులో అద్భుత ప్రతిభ కనబరిచేవాడు సాయి దివేశ్. ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు హైదరాబాద్‌లోని రమాదేవి పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు.ఇంటర్లో అత్యుత్తమ స్కోర్ సాధించి, ఎన్ఐటీ కురుక్షేత్రలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఈ సమయంలోనే న్యూటానిక్స్ కంపెనీలో రూ.40లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించాడు. అయితే ఉన్నత చదువు చదవాలనే లక్ష్యంతో లాస్ఏంజెల్స్లోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో క్లౌడ్, ఏఐ టెక్నాలజీలో ఎంఎస్ పూర్తి చేశాడు. ఎన్విడియా కంపెనీలో డెవలప్మెంట్ ఇంజీనీర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. కేవలం చదువు మాత్రమే కాదు క్రీడలు, పలు పోటీ పరీక్షల్లో ఎపుడూ ముందుండేడట. అత్యాధునిక టెక్నాలజీల్లో నైపుణ్యం పొందిన దివేశ్, ప్రస్తుతం ఏఐ ఆధారిత యాప్‌ను అభివృద్ధి చేసే పనిలో ఉన్నాడు. విశేషమైన ప్రతిభతో, ప్రపంచ టెక్నాలజీ రంగంలో దివేశ్ సత్తా చాటుకోవాలంటూ నెటిజన్లు శుభాకాంక్షలందించారు.కాగా 2025లో టాప్ ఏఐ చిప్ తయారీ కంపెనీల్లో టాప్‌లో ఉందీ కంపెనీ 530.7 బిలియన్ల డాలర్ల మార్కెట్ క్యాప్తోప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీగా అవతరించింది ఎన్విడియా. ఇది A100 ,H100 వంటి శక్తివంతమైన GPUలకు ప్రసిద్ధి చెందింది. ఏఐ సృష్టిస్తున్న విప్తవాన్ని దృష్టిలో ఉంచుకుని వీటిని రూపొందించింది. వివిధ అప్లికేషన్లలో AI మోడళ్లకు శిక్షణ ఇవ్వడం , అమలు చేయడం కోసం వీటిని వినియోగిస్తారు. -
కోటి రూపాయల జీతంతో ఉద్యోగం
న్యూఢిల్లీ: పంజాబ్‌కు చెందిన లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ(ఎల్పీయూ) విద్యార్థిని కవిత ఫమన్ సత్తా చాటారు. బహుళజాతి విత్తన, ఎరువుల సంస్థ మోన్శాంటోలో ఏకంగా రూ.కోటి వార్షిక వేతనంతో ఉద్యోగాన్ని చేజిక్కించుకున్నారు. ఎల్పీయూలో ఎంఎస్సీ అగ్రికల్చర్(ఆగ్రోనమీ) చివరి సంవత్సరం చదువుతున్న కవిత.. బేయర్స్ కంపెనీ అనుబంధ సంస్థ అయిన మోన్శాంటో కెనడా విభాగంలో ప్రొడక్షన్ మేనేజర్ ఉద్యోగాన్ని పొందారు. ప్రిలిమినరీ పరీక్ష, ఇంటర్వ్యూ అనంతరం కవితకు మోన్శాంటో ప్రతినిధులు ఉద్యోగాన్ని ఆఫర్ చేశారు. మోన్శాంటోలో చేరేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానన్న కవిత.. ఎల్పీయూ అధ్యాపక బృందానికి ధన్యవాదాలు తెలిపారు. కల నిజమైనట్టుగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. తమ విద్యార్థిని భారీ ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించడం పట్ల లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ డైరెక్టర్ అమన్ మిత్తల్ సంతోషం వ్యక్తం చేశారు. మంచి ప్యాకేజీలు రావన్న కారణంతో అగ్రికల్చర్ కోర్సులను చదివేందుకు విద్యార్థులు ఇష్టపడటం లేదని, ఏడు అంకెల వేతనం దక్కడం ఇదే మొదటిసారి అని తెలిపారు. కవిత ఫమన్ విజయంతో వ్యవసాయ విద్యకు పోత్సాహం పెరుగుతుందని ఎల్పీయూ అగ్రికల్చర్ విభాగం అధిపతి డాక్టర్ రమేశ్ కుమార్ అభిప్రాయపడ్డారు. -
ఆ నలుగురికి బంపర్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ: ఇండియన్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ) కు చెందిన నలుగురు విద్యార్థులు బంపర్ ఆఫర్ కొట్టేశారు. టాప్ కంపెనీలు పాల్గొన్న ప్లేస్మెంట్ కార్యక్రమంలో ఇన్సిస్టిట్యూట్‌కు చెందిన నలుగురు విద్యార్థులు రూ. 95 లక్షల వార్షిక ప్యాకేజీ(150,000 డాలర్లు ) సాధించారు. అలాగే ఏడుగురు విద్యార్థులకు సంవత్సరానికి 80,000 డాలర్ల ప్యాకేజీ సాధించారని వాణిజ్య మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ సాదించారని ఐఐఎఫ్‌టీ ప్రకటించింది. దక్షిణ అమెరికా, థాయ్‌లాండ్, ఆఫ్రికా, సౌత్-ఈస్ట్ ఆసియా దేశాల్లో వీరికి భారీ వేతనంతో ఉద్యోగాలు లభించినట్టు వెల్లడించింది. ముఖ్యంగా బ్రిటీష్ టెలికాం, డిబిఎస్, గోద్రేజ్, హీరో మోటోకార్ప్, మదర్ డైరీ, షాపుర్జీ పల్లోంజి, టెట్రా పాక్, టివిఎస్ మోటార్స్ తదితర కంపెనీలు తమ అంతర్జాతీయ వ్యాపార రంగంలోని వివిధ విభాగాలకు తమ విద్యార్థులను ఎంపిక చేశారని పేర్కొంది. దేశీయంగా రూ.18.27లక్షలు, అంతర్జాతీయంగా రూ.19.23 లక్షలు సగటు వార్షిక వేతనంగా ఉందని తెలిపింది. -
ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థికి రూ.1.5 కోట్ల ప్యాకేజీ
కోల్‌కతా: ఖరగ్‌పూర్ ఐఐటీ విద్యార్థికి బంపర్ ఆఫర్ తగిలింది. క్యాంపస్ ప్లేస్మెంట్లలో భాగంగా ఆ విద్యార్థికి రూ.1.5 కోట్ల వార్షిక వేతనం ఇచ్చేందుకు ఓ సంస్థ ముందుకువచ్చింది. క్యాంపస్ ప్లేస్మెంట్లలో ఓ విద్యార్థికి ఇంత భారీ ప్యాకేజీ లభించడం ఇదే మొదటిసారి అని ఖరగ్‌పూర్ ఐఐటీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే సదరు విద్యార్థికి కలిగే ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని అతని పేరు కానీ, ఆఫర్ ఇచ్చిన సంస్థ పేరు కానీ వెల్లడించడం లేదని తెలిపాయి. -
సైకిల్ సీటుకు..కార్పొరేటు
సాక్షి ప్రతినిధి, కాకినాడ :తెలుగుదేశం పార్టీతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్న ఓ కార్పొరేట్ దిగ్గజం చమురు కార్యకలాపాలన్నీ అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించడం లేదా ప్రతిపక్షం దన్ను అవసరమని భావించిన ఆ సంస్థ ఎన్నికల్లో టీడీపీకి భారీ ప్యాకేజీ ముట్టచెప్పేందుకు అంగీకరించిందని విశ్వసనీయ సమాచారం. ఆ కార్పొరేట్ దిగ్గజం అక్కడి ఎంపీ సహా పలువురు ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టడం కంటే అటువంటి వారు ఎన్నికయ్యేందుకు ఎంతైనా కుమ్మరించడమే మేలనే అభిప్రాయానికి వచ్చిందని తెలిసింది. ఎన్నికల అనంతరం ఏ ప్రభుత్వం వచ్చినా వనరుల తరలింపునకు ప్రజల నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురు కాకుండా చూసుకునే వ్యూహంలో భాగమే ఈ ఒప్పందమంటున్నారు. ఇది అడ్డగోలుగా వనరులు తరలించే సందర్భంలో ప్రజల గొంతు నొక్కేసే ప్రయత్నమేనని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చివరి నిమిషంలో టీడీపీ అమలాపురం ఎంపీ అభ్యర్థిని మార్చేశారని తెలుగుతమ్ముళ్లు బాహాటంగానే చెబుతున్నారు. కోనసీమలో పార్టీ శ్రేణులకు ముక్కుమొహం తెలియని పండుల రవీంద్రబాబును బరిలోకి దింపడం వెనుక మర్మమిదేనంటున్నారు. వాస్తవానికి ఏడాది క్రితమే అమలాపురం ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావును చంద్రబాబు ప్రకటించారు. నామినేషన్ల ఘట్టం ముగియడానికి కొద్ది రోజుల ముందు గొల్లపల్లికి జెల్లకొట్టి రవీంద్రబాబుకు సీటు కట్టబెట్టడం వెనుక కార్పొరేట్ దిగ్గజం ప్రమేయం ఉందని కోనసీమ కోడై కూస్తోంది. రవీంద్రబాబు విశాఖలో పనిచేస్తున్న సమయంలో ఉన్న సాన్నిహిత్యంతో కార్పొరేట్ సంస్థ పెద్దలు పట్టుబట్టి మరీ ఆయనను ప్రతిపాదించినట్టు పార్టీ నేతలు భావిస్తున్నారు. పార్టీ వెన్నంటి ఉన్న వారిని కాదని కార్పొరేట్ దిగ్గజం భవిష్యత్ అవసరాల కోసం వారు చెప్పినట్టే అభ్యర్థిని మార్చేశారని తెలుగు తమ్ముళ్లు అగ్గిమీదగుగ్గిల మవుతున్నారు. అయితే ఆ వ్యూహానికి ముసుగుగా ఉన్నత విద్యావంతుడిని బరిలోకి దింపామని చెపుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఆ సంస్థ కోసమే రవీంద్రబాబుకు టిక్కెట్టు.. రవీంద్రబాబు ఎంపిక ఆ పార్టీలో తొలి నుంచీ వివాదంగా మారింది. కార్పొరేట్ దిగ్గజం దన్ను ఉండబట్టే ఆయన తక్కువ సమయంలోనే పార్టీ టిక్కెట్ పొందారనే ప్రచారం జరుగుతోంది. పార్లమెంట్ నియోజకవర్గంపరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికల ఖర్చుకు ఆ దిగ్గజమే సుమారు రూ.50 కోట్లు వెచ్చించేందుకు సన్నద్ధమయ్యే రవీంద్రబాబుకు టిక్కెట్ ఇప్పించినట్టు సచాచారం. టీడీపీలో కార్పొరేట్ సంస్కృతికి మచ్చుతునకలైన సుజనా చౌదరి, గరికిపాటి రామ్మోహనరావులే ఈ వ్యవహారంలో చక్రం తిప్పారంటున్నారు. గెలుపు, ఓటములతో నిమిత్తం లేకుండా పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు కనీసం ఆర్థికంగా చేయూత లభిస్తుందనే నమ్మకంతో కార్పొరేట్ దిగ్గజం చెప్పినట్టు ఎంపీ టిక్కెట్టును కట్టబెట్టారంటున్నారు. గొల్లపల్లిని రాజోలు నుంచి పోటీ చేయాలని స్వయంగా చంద్రబాబు అభ్యర్థించినా అంగీకరించేందుకు నాలుగు రోజుల సమయం తీసుకున్నారు. అక్కడ పోటీకయ్యే మొత్తం ఖర్చు భరించేలా హామీ లభించడంతోనే రాజోలు వెళ్లడానికి గొల్లపల్లి అంగీకరించారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఈ పరిణామాలన్నీ పరిశీలిస్తుంటే ఈ ఎన్నికల్లో జిల్లాకు సంబంధించి తమ పార్టీని నడిపిస్తున్నది అధినేత కాక.. ఆ కార్పొరేట్ దిగ్గజమేనంటున్నారు. -
టీడీపీలో గుబులు
సాక్షి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వైఖరి ఆ పార్టీ క్యాడర్‌ను గందరగోళానికి గురిచేస్తోంది. సీడబ్ల్యూసీ ప్రకటన తరువాత సీమాంధ్ర రాజధాని తదితర అవసరాల కోసం భారీ ప్యాకేజీ ప్రకటించాలని కోరిన చంద్రబాబు.. తాజాగా తెలంగాణవాదుల్లో అనుమానాలు రేకెత్తేవిధంగా ప్రధానికి లేఖ రాయడం జిల్లాలోని పార్టీశ్రేణులను విస్మయపరిచింది. ఏ సందర్భం లేకుండా స్పందించడం, సమైక్యవాదులు లేవనెత్తుతున్న అంశాలనే పేర్కొంటూ ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరడంతో మరోసారి పార్టీ తెలంగాణపై వెనక్కు వెళ్తుందేమోనన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. 2009 ఎన్నికల ప్రణాళికలో తెలంగాణకు అనుకూలత ప్రకటించి టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్న టీడీపీ.. డిసెంబర్ 9న కేంద్రం తెలంగాణను ప్రకటించగానే తన నిర్ణయాన్ని మార్చుకుంది. అప్పటినుంచి జిల్లాలో టీడీపీ పరిస్థితి దిగజారుతూనే ఉంది. 2009 ఎన్నికల్లో ఐదుగురు శాసనసభ్యులు గెలువగా ఇప్పుడు ముగ్గురు మాత్రమే మిగిలారు. వేములవాడ, కరీంనగర్ ఎమ్మెల్యేలు సిహెచ్.రమేష్‌బాబు, గంగుల కమలాకర్ టీఆర్ఎస్లో చేరారు. వేములవాడ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ ఘోరంగా ఓటమి పాలయ్యింది. సహకార, పంచాయతీ ఎన్నికల్లోనూ ఆశించిన ఫలితాలు రాలేదు. చంద్రబాబు కాళ్లకు బలపాలు కట్టుకుని ఁవస్తున్నా మీ కోసంరూ. అంటూ జిల్లాలో తిరిగినా పార్టీ పరిస్థితి మాత్రం చక్కబడలేదు. దీంతో ఆ పార్టీ ద్వితీయశ్రేణి నాయకులు అనేక మంది వలసబాట పట్టారు. ఎక్కడా అవకాశాలు లేనివారు, ఇతర పార్టీల్లో నిలదొక్కుకోలేమని భావించిన వారు మాత్రమే టీడీపీలో కొనసాగుతున్నారు. చంద్రబాబు పాదయాత్ర జిల్లాలో కొనసాగుతున్న సమయంలోనే తెలంగాణపై అఖిలపక్ష సమావేశం జరిగింది. తాము విభజనకు వ్యతిరేకం కాదని, ప్రణబ్‌ముఖర్జీ కమిటీకి 2008లో ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని టీడీపీ ప్రకటించింది. దీంతో ఈ ప్రాంతంలో పూర్వవైభవం సాధించాలని పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఈ తరుణంలో చంద్రబాబు కొత్త అనుమానాలు కలిగేలా వ్యవహరించడాన్ని పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీని కాపాడుకోవడానికి వ్యక్తిగతంగా అనేక అవమానాలను భరించామని, తమ మనోభావాలను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా నిర్ణయాలు మార్చుకుంటున్నారని సీనియర్ కార్యకర్త ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణవాదుల్లో అనుమానాలు బలపడేలా పార్టీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా టీడీపీలో ఒక్కరు కూడా మిగలరని వాపోయాడు. ఇప్పటికే సీమాంధ్రలో ఉద్యమానికి టీడీపీ నేతలు నాయకత్వం వహిస్తుండడం తమకు ఇబ్బందిగా మారిందంటున్న కార్యకర్తలు వారికి వత్తాసు పలికేలా స్వయంగా చంద్రబాబే లేఖ రాయడం తప్పుబడుతున్నారు. కాంగ్రెస్‌లోనూ.. తాజా పరిణామాలు కాంగ్రెస్ పార్టీలోనూ చర్చకు దారి తీస్తున్నాయి. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి విభజనపై వ్యక్తం చేసిన అభిప్రాయాలపై జిల్లా కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు. సీఎంకు మొదటినుంచి వ్యతిరేకంగా ఉన్న ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆయన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. సీమాంధ్ర జేఏసీ నేతగా కిరణ్ మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. మాజీమంత్రి జీవన్‌రెడ్డితో పాటు సీనియర్ నాయకులు సీఎం తీరును తప్పుబట్టారు. సీఎంకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న మంత్రి శ్రీధర్‌బాబుకు తాజా పరిణామాలు ఇబ్బందికరంగా మారాయి.