సాక్షి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వైఖరి ఆ పార్టీ క్యాడర్‌ను గందరగోళానికి గురిచేస్తోంది. సీడబ్ల్యూసీ ప్రకటన తరువాత సీమాంధ్ర రాజధాని తదితర అవసరాల కోసం భారీ ప్యాకేజీ ప్రకటించాలని కోరిన చంద్రబాబు.. తాజాగా తెలంగాణవాదుల్లో అనుమానాలు రేకెత్తేవిధంగా ప్రధానికి లేఖ రాయడం జిల్లాలోని పార్టీశ్రేణులను విస్మయపరిచింది.
ఏ సందర్భం లేకుండా స్పందించడం, సమైక్యవాదులు లేవనెత్తుతున్న అంశాలనే పేర్కొంటూ ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరడంతో మరోసారి పార్టీ తెలంగాణపై వెనక్కు వెళ్తుందేమోనన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. 2009 ఎన్నికల ప్రణాళికలో తెలంగాణకు అనుకూలత ప్రకటించి టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్న టీడీపీ.. డిసెంబర్ 9న కేంద్రం తెలంగాణను ప్రకటించగానే తన నిర్ణయాన్ని మార్చుకుంది. అప్పటినుంచి జిల్లాలో టీడీపీ పరిస్థితి దిగజారుతూనే ఉంది. 2009 ఎన్నికల్లో ఐదుగురు శాసనసభ్యులు గెలువగా ఇప్పుడు ముగ్గురు మాత్రమే మిగిలారు. వేములవాడ, కరీంనగర్ ఎమ్మెల్యేలు సిహెచ్.రమేష్‌బాబు, గంగుల కమలాకర్ టీఆర్‌ఎస్‌లో చేరారు. వేములవాడ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ ఘోరంగా ఓటమి పాలయ్యింది.
సహకార, పంచాయతీ ఎన్నికల్లోనూ ఆశించిన ఫలితాలు రాలేదు. చంద్రబాబు కాళ్లకు బలపాలు కట్టుకుని ఁవస్తున్నా మీ కోసంరూ. అంటూ జిల్లాలో తిరిగినా పార్టీ పరిస్థితి మాత్రం చక్కబడలేదు. దీంతో ఆ పార్టీ ద్వితీయశ్రేణి నాయకులు అనేక మంది వలసబాట పట్టారు. ఎక్కడా అవకాశాలు లేనివారు, ఇతర పార్టీల్లో నిలదొక్కుకోలేమని భావించిన వారు మాత్రమే టీడీపీలో కొనసాగుతున్నారు. చంద్రబాబు పాదయాత్ర జిల్లాలో కొనసాగుతున్న సమయంలోనే తెలంగాణపై అఖిలపక్ష సమావేశం జరిగింది. తాము విభజనకు వ్యతిరేకం కాదని, ప్రణబ్‌ముఖర్జీ కమిటీకి 2008లో ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని టీడీపీ ప్రకటించింది. దీంతో ఈ ప్రాంతంలో పూర్వవైభవం సాధించాలని పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు.
ఈ తరుణంలో చంద్రబాబు కొత్త అనుమానాలు కలిగేలా వ్యవహరించడాన్ని పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీని కాపాడుకోవడానికి వ్యక్తిగతంగా అనేక అవమానాలను భరించామని, తమ మనోభావాలను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా నిర్ణయాలు మార్చుకుంటున్నారని సీనియర్ కార్యకర్త ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణవాదుల్లో అనుమానాలు బలపడేలా పార్టీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా టీడీపీలో ఒక్కరు కూడా మిగలరని వాపోయాడు. ఇప్పటికే సీమాంధ్రలో ఉద్యమానికి టీడీపీ నేతలు నాయకత్వం వహిస్తుండడం తమకు ఇబ్బందిగా మారిందంటున్న కార్యకర్తలు వారికి వత్తాసు పలికేలా స్వయంగా చంద్రబాబే లేఖ రాయడం తప్పుబడుతున్నారు.
కాంగ్రెస్‌లోనూ..
తాజా పరిణామాలు కాంగ్రెస్ పార్టీలోనూ చర్చకు దారి తీస్తున్నాయి. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి విభజనపై వ్యక్తం చేసిన అభిప్రాయాలపై జిల్లా కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు. సీఎంకు మొదటినుంచి వ్యతిరేకంగా ఉన్న ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆయన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. సీమాంధ్ర జేఏసీ నేతగా కిరణ్ మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. మాజీమంత్రి జీవన్‌రెడ్డితో పాటు సీనియర్ నాయకులు సీఎం తీరును తప్పుబట్టారు. సీఎంకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న మంత్రి శ్రీధర్‌బాబుకు తాజా పరిణామాలు ఇబ్బందికరంగా మారాయి.
టీడీపీలో గుబులు
Published Wed, Aug 14 2013 4:38 AM | Last Updated on Sat, Jul 28 2018 3:15 PM
Advertisement