
చంద్రబాబు వల్లే కొల్లేరు ప్రజలకు కష్టాలు
ఏలూరు రూరల్, న్యూస్‌లైన్ : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు జారీ చేసిన 120 జీవో వల్లే కొల్లేరులోని మూడున్నర లక్షల మంది ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెం టరీ నియోజకవర్గ అభ్యర్థి తోట చంద్రశేఖర్ దుయ్యబట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాంటూరు కుదింపునకు చర్యలు చేపట్టి కొల్లేరు ప్రజలను ఆదుకుంటారని హామీ ఇచ్చారు. దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థి కారుమూరి నాగేశ్వరరావుతో కలిసిఆదివారం ఆయన కొల్లేరు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా గుడివాకలంకలో నిర్వహించిన సభలో చంద్రశేఖర్ మాట్లాడుతూ కొల్లేరు ప్రజల కష్టాలను తెలుసుకున్న మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కాంటూరును 5నుంచి 3కు కుదించాలని అసెం భ్లీలో తీర్మానం చేయించారని గుర్తుచేశారు.
మహానేత మరణంతో కొల్లేరు ప్రజల ఆశలు ఆవిరయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆశయాలను నెరవేర్చి, కొల్లేరు ప్రజలను ఆదుకునేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ మేనిఫెస్టోలో కొల్లేరు అంశాన్ని పొందుపరిచారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన మరుక్షణం కాంటూరును కుదించి భూమిలేని పేదలకు భూమి అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మహానేత దూరం కాకుండా ఉంటే రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ది చెందేదని వివరించారు. ఆయన ఆశయాలు నెరవేర్చేందుకు వైఎస్ జగన్ ప్రజల ముందుకొచ్చారని, ఆయనను ముఖ్యమంత్రి చేయాలని పిలుపునిచ్చారు.
టీడీపీ నాయకులను నిలదీయండి
కొల్లేరు ప్రజలను ఓట్లు అడగటానికి వచ్చే టీడీపీ నాయకులను 120 జీవోను ఎలా తెచ్చారనే విషయమై నిలదీయాలని తోట చంద్రశేఖర్ కొల్లేరు ప్రజలకు పిలుపునిచ్చారు. జీతాలు పెంచమని అడిగిన అంగన్‌వాడీ కార్యకర్తలను గుర్రాలతో తొక్కించిన ఘనత చంద్రబాబుదేనన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యమాలు చేస్తుంటే చంద్రబాబురెండు కళ్ల సిద్ధాంతంతో రాష్ట్రాన్ని ముక్కలు చేశారని దుయ్యబట్టారు. అలాంటి నాయకుడు అధికారంలోకి వస్తే మళ్లీ రాక్షసపాలన వస్తుందని హెచ్చరిం చారు.
ఎందరో పేదల జీవితాల్లో వెలుగులు నింపిన ఆరోగ్యశ్రీ పథకాన్ని కాం గ్రెస్ ప్రభుత్వం నీరుగార్చిందని విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 108, 104తోపాటు ఆరోగ్యశ్రీ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేస్తామన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూపకల్పన చేసిన తల్లిఒడి పథకం ద్వారా ప్రతి తల్లి తన బిడ్డను డిగ్రీ వరకూ చదివించుకుంటూ తమ ఖాతాల్లో రూ.500 నుంచి రూ.వెయ్యి వరకూ పొందవచ్చని వివరించారు. రూ.200 పింఛన్‌ను రూ.700కు పెంచుతామని వివరించారు. పేదలకు రూ.వందకే 150 యూనిట్ల విద్యుత్, డ్వాక్రా రుణాలు రద్దు, రైతులను ఆదుకునేం దుకు రూ.2 వేల కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేయనున్నారని వివరించారు.
అడుగడుగునా ఘన స్వాగతం
తోట చంద్రశేఖర్, కారుమూరి నాగేశ్వరరావులకు కొల్లేరు ప్రజలు ఘనస్వాగతం పలికారు. పూలమాల లతో అభినందించారు. అడుగడుగునా జై జగన్, జోహార్ వైఎస్సార్ అంటూ నినాదాలు చేశారు. ప్రచారానికి వచ్చిన అభ్యర్థుల కోసం గుడివాకలంక సర్పంచ్ ఘంటసాల లక్ష్మీరాంబాబు, ఉప సర్పంచ్ మోరు వీరమ్మతోపాటు మాజీ సర్పంచ్ జయమంగళ భద్రగిరి స్వామి, గ్రామపెద్దలు సభ ఏర్పాటు చేశారు. చేపల వేట సాగిస్తున్న మత్స్యకారులను, ప్యాకింగ్ చేస్తున్న కొల్లేరు కూలీల సమస్యలను అభ్యర్థులు అడిగి తెలుసుకున్నారు. వారివెంట కొల్లేరు నాయకుడు ముంగర సంజీవ్‌కుమార్, ఊదరగొండి చంద్రమౌళి, ఘంటా ప్రసా ద్, మరడాని రంగారావు ఉన్నారు.