‘దేశం’లో వర్గపోరు | tdp leaders have inner conflicts | Sakshi
Sakshi News home page

‘దేశం’లో వర్గపోరు

Published Wed, Apr 30 2014 12:56 AM | Last Updated on Fri, Aug 10 2018 8:06 PM

‘దేశం’లో  వర్గపోరు - Sakshi

‘దేశం’లో వర్గపోరు

 అచ్యుతాపురం, న్యూస్‌లైన్ : తెలుగుదేశంలో వర్గపోరు ఆ పార్టీ యలమంచిలి అసెంబ్లీ అభ్యర్థి పంచకర్లరమేష్‌బాబుకు చుక్కలు చూపెడుతోంది. ఒక వర్గానికి చెందిన శ్రేణులు కలిసిరాకపోవడంతో సోమవారం రాత్రి ఎం.జగన్నాథపురంలో అతనికి చేదు అనుభవం ఎదురైంది. మాజీ ఎంపీ పప్పల చలపతిరావును తీసుకొని ఆ గ్రామంలో సమావేశం ఏర్పాటు చేయడానికి పంచకర్ల వెళ్లారు. సుందరపు విజయకుమార్ లేకుండా గ్రామంలోకి అడుగు పెట్టడానికి వీలులేదంటూ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ హాఠాత్‌పరిణామంతో పప్పల కంగుతిన్నారు. విజయకుమార్‌ని పరిచయం చేసిన తనను గౌరవించకపోవడమేమిటంటూ వాపోయారు. వాడురావాలి వీడురావాలంటే కుదరని పని.. పార్టీమీద అభిమానం ఉంటే చేయండి లేకపోతేలేదు. ఒక్కఊరు ఓట్లు  వేయకపోతే నష్టమేమీ ఉండదంటూ విసురుగా కారు ఎక్కి పంచకర్ల, పప్పల వెనుదిరిగారు. టీడీపీలో వర్గపోరుకు ఈ సంఘటన అద్దం పట్టింది. తిరుగుబాటు బెడద ఇప్పట్లో సమసిపోదని ఎం.జగన్నాథపురం విషయంలో స్పష్టమైంది.
 
 నియోజకవర్గం ఇన్‌చార్జిగా సుందరపును నియామకాన్ని అప్పట్లో నియోజకవర్గ నాయకులైన లాలం భాస్కరరావు, పప్పల చలపతిరావు,గొంతెన నాగేశ్వరరావు,ఆడారి తులసీరావులు తీవ్రంగా వ్యతిరేకించారు. సుందరపుకి సహకరించవద్దని కార్యకర్తలను ఆదేశించారు. కానీ సర్పంచ్, ప్రాదేశిక ఎన్నికల్లో అభ్యర్థులకు అండగా నిలిచిన విజయ్‌కుమార్ నియోజకవర్గంలో తనకంటూ ఒక స్థానాన్ని, వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గెలుపొందిన సర్పంచ్‌లంతా ప్రస్తుతం సుందరపు వెంటే ఉన్నారు. ఆయనకు టికెట్ రాకపోవడంతో వీరు అసంతృప్తితో ఉన్నారు. నియోజకవర్గం నాయకులే అడ్డుకున్నారంటూ రగిలిపోతున్నారు. ఈ స్థితిలో బేరసారాలతో సుందరపు అలకను తీర్చగలిగారు. గాయపడిన కార్యకర్తల మనోభావాలను మాత్రం మాన్పలేకపోతున్నారు. పంచకర్ల అన్నలాంటివాడని సమావేశాల్లో  సుందరపు విజయకుమార్ పేర్కొనడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వెన్నుపోటు పొడిచినవారిని అన్నా అని పిలవద్దంటున్నారు. ఇదిలావుండగా సుందరపు వర్గాన్ని కాదని పంచకర్ల డబ్బు ఎరతో మరో వర్గాన్ని తయారు చేసుకున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇలా గ్రామాల్లో తెలుగుదేశం కార్యకర్తలు వర్గాలుగా విడిపోవడం అభ్యర్థి పంచకర్లకు తలనొప్పిగా ఉంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement