సుప్రీం తీర్పు సూపరంటున్న తమ్ముళ్లు
గుసగుసలు: మున్సిపాలిటీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలను నిలిపేయడంతో టీడీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారట. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యేదాకా వాటిని వెల్లడించొద్దని సుప్రీంకోర్టు ఆదేశించడం తమకు చెప్పలేనంత రిలీఫ్ ఇచ్చిందని టీడీపీ ఎమ్మెల్యే ఒకరు చెప్పుకొచ్చారు. ‘బీజేపీతో పొత్తుల సంగతేంటో తేలక మేం చస్తుంటే మధ్యలో ఈ లోకల్ బాడీ ఎలక్షన్ల సమస్యొకటి. ఇప్పుడది లేకుండా పోయింది’ అంటూ సంబరపడ్డారు. ఈ రోజు కాకున్నా రేపటి రోజైనా స్థానిక ఎన్నికల ఫలితాలను ప్రకటించాల్సిందే కదా అని సన్నిహితులు ఆరా తీస్తే అసలు విషయం చెప్పేశారాయన.
‘‘స్థానిక ఎన్నికల్లో మేం గెలుస్తామన్న నమ్మకం ఎటూ లేదు. వాటి ఫలితాలను ఇప్పుడే ఎక్కడ ప్రకటిస్తారో, ఆ ప్రభావం నా సెగ్మెంట్లో ఎక్కడ పడుతుందోనని ఇంతకాలం భయపడ్డా. ఇప్పుడా ఆందోళన లేదు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యాక ఆ ఫలితాలను ప్రకటించినా, వాటిలో మాకెన్ని సీట్లు వచ్చినా నష్టం లేదు. కదా! అదీగాక, బీజేపీతో మా పొత్తు చర్చలు ఇంకా ఎటూ తేలడం లేదు. ఇలాంటి సమయంలో గనుక స్థానిక ఎన్నికల ఫలితాలను ఇప్పుడే వెల్లడిస్తే, వాటిలో మేమెటూ తెల్లముఖం వేస్తాం కాబట్టి, మాకు బలం లేదని బీజేపీ చెబుతున్నదంతా కరెక్టని తేలిపోతుంది. సుప్రీం తీర్పుతో ఆ గండాన్నీ గట్టెక్కినట్టే’’ అని చెప్పుకొచ్చారు.