సాక్షి ప్రతినిధి, కాకినాడ :
మాజీ మంత్రి తోట తెలుగుదేశం పార్టీలో చేరీ చేరగానే కాకినాడ పార్లమెంటు సీటు తనదేనంటూ పార్టీలో అన్నీ తానే అన్నట్టు ప్రకటించుకోవడం టీడీపీలో కొత్త చిచ్చురేపింది. అసలు తోట టీడీపీలోకి రావడంతోనే వివాదాలు మొదలయ్యాయని కేడర్ తలపట్టుకుంటోంది.
తుది వరకు కాంగ్రెస్‌ను వీడేది లేదని ఇటీవలే ప్రగల్భాలు పలికిన తోట ఇంతలోనే ప్లేటు ఫిరాయించి మామ, మాజీ మంత్రి డాక్టర్ మెట్ల సత్యనారాయణరావుతో దౌత్యం నడిపించి, టీడీపీ పంచన చేరారు. ఆ పార్టీ తరఫున జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నట్టు కూడా ప్రచారమైంది.
దీంతో.. గత ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, ఓటమి పాలై, తిరిగి టిక్కెట్టుపై ఆశతో ఉన్న పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి జ్యోతుల చంటిబాబు వర్గీయులు కన్నెర్రజేశారు. ఈ నేపథ్యంలో చంటిబాబు 24 గంటల అల్టిమేటమ్ ఇవ్వడంతో దిగొచ్చిన చంద్రబాబు చర్చలకు పిలిచి, జగ్గంపేట టిక్కెట్టు మరెవరికీ ఇచ్చేది లేదని చంటిబాబుకు చెప్పారు. ఇక ఆ సమస్య సద్దుమణిగిందని పార్టీ నేతలంతా కుదుటపడుతున్న తరుణంలో తోట తెలుగుదేశం పార్టీలో కొత్త చిచ్చు రేపారు.
టీడీపీని ముంచేస్తారా?
కాకినాడ ఎంపీ సీటు తనదేనని జిల్లా ముఖ్య నేతల సమక్షంలోనే తోట ప్రకటించ డం పార్టీ జిల్లా నాయకత్వాన్ని అవమానించినట్టు కేడర్ భావిస్తోంది. ‘కేడర్ లెస్ లీడర్’గా మిగిలిన తోట అక్కడ కాంగ్రెస్‌ను భూస్థాపితం చేసి ఇప్పుడు ఇక్కడ టీడీపీని కూడా నట్టేట ముంచేసే ఎత్తుగడలో ఉన్నట్టు కనిపిస్తోందని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
కాకినాడ సీటు తనదేనని ప్రకటించుకోవడం ద్వారా తమను అవమానించినట్టు పార్టీ జిల్లా నాయకత్వం భావిస్తోంది. కాకినాడ పార్లమెంటు సీటుపై ఆశలు పెంచుకుని, గడచిన ఆరేడు నెలలుగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న విశ్వంను రేసు నుంచి తప్పించేందుకు మామా, అల్లుళ్లైన మెట్ల, తోట ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.
నరసింహానికి అంత సీన్ లేదు..
గతంలో తునిలో నిర్వహించిన కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ పార్టీ సమావేశంలో విశ్వంను ఎంపీ అభ్యర్థిగా పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్ యనమల రామకృష్ణుడు నేతలకు పరిచయం చేశారు. అంతకంటే ముందు పెద్దాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి అని ప్రకటించారు. పెద్దాపురం టిక్కెట్టు కమ్మ సామాజికవర్గానికి ఇవ్వాలనే నిర్ణయంతో విశ్వం సీటు పెద్దాపురం నుంచి ఒకసారి పిఠాపురం అని, మరోసారి కాకినాడ రూరల్ అని..మార్చి, మార్చి ఇప్పుడు కాకినాడ ఎంపీ సీటుకు కూడా ఎసరు పెడుతున్నారని ఆయన అనుచరులు, కైట్ విద్యార్థులు రోడ్డెక్కి ధర్నాకు దిగడంతో పార్టీ శ్రేణులకు మింగుడు పడటం లేదు.
నరసింహం టీడీపీలోకి రావడంతో ఇప్పటికే పార్టీలో ఉన్న వారికి మానసిక స్థిమితం లేకుండా చేస్తున్నారని నేతలు ఆవేదన చెందుతున్నారు. పార్టీ కార్యాలయ కార్యదర్శి మందాల గంగ సూర్యనారాయణ జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్పతో.. ధర్నా చేస్తున్న విశ్వం అనుచరులను ఉద్దేశించి ఫోన్‌లో మాట్లాడించారు. ఈ విషయాలన్నీ తరచి చూస్తే కాకినాడ ఎంపీ సీటు తనదేనంటున్న తోటకు పార్టీలో తన సీటు తానే ప్రకటించుకునేంత సీన్ లేదనే విషయాన్ని స్పష్టం చేస్తోందంటున్నారు.
పార్టీ అధిష్టానం కాకినాడ పార్లమెంటు సీటుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, ఎవరికీ ప్రకటించలేదని రాజప్ప విశ్వం అనుచరులకు చెప్పడం పార్టీలో మరింత గందరగోళానికి దారితీసింది. అసలు తోటను పార్టీలోకి ఆహ్వానించడమెందుకు, ఆ కారణంగా పార్టీని ఎన్నటి నుంచో నమ్ముకున్న నేతల్లో అభద్రతను సృష్టించడం ఎందుకని.. అధినేత తీరుపై పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి.
‘దేశం’లో తోటాకు మంట
Published Thu, Mar 27 2014 12:38 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement