ఉయ్యూరు, న్యూస్‌లైన్ : పెనమలూరు నియోజకవర్గంలో టీడీపీకి ఎదురు గాలి వీస్తోంది. అష్టకష్టాలు పడి టికెట్ దక్కించుకున్న ఆ పార్టీ అభ్యర్థి బోడే ప్రసాద్‌కు అధిపత్యపోరు, కులసమీకరణలు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారుు. వీటన్నింటికీ తోడు మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ సహకరించపోవడం, దివంగత నేత చలసాని పండు సతీమణి పద్మావతి, ఆమె మద్దతుదారులు గడపదాటక పోవడంతో బోడే విజయూవకాశాలు పూర్తిగా సన్నగిల్లారుు. ఓటమి అంచున సైకిల్‌పై సవారీ చేస్తున్న బోడే మాత్రం ఎన్నికల ప్రచారంలో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
అంతా మాయ...!
బోడే ప్రసాద్ రాజకీయూల్లోకి వచ్చినప్పటి నుంచి అసెంబ్లీ టికెట్ దక్కించుకునే వరకు ఆయన వ్యవహారశైలి అంతా మాయగానే ఉంది. ఆయనకు కూడా తమ పార్టీ అధినేత చంద్రబాబు మాదిరిగానే ‘హైటెక్ బోడే’ అనే పేరుంది. చేసేది గోరంతైనా ప్రచారం మాత్రం కొండంత చేసుకోవటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఉచిత వైద్య శిబిరాలు, పంట కాలువల పూడికతీత పనుల పేరుతో రోజులతరబడి పత్రికలు, మీడియాలో ప్రచారం చేసుకున్నారు. అంతా తానే సొంతగా చేసినట్లు ప్రచారం చేసుకుని మసిపూసి మారేడుకాయ చేశారు. పంట కాలువల పూడిక తీత పనులకు సంబంధించి పొక్లెయిన్ మాత్రమే బోడే సమకూర్చితే, దాని నిర్వహణ ఖర్చు మొత్తం ఆ కాలువ పరిసరాలకు చెందిన రైతులే భరించారు. శ్మశాన వాటికల అభివృద్ధి తీరులోనూ ఇదే పరిస్థితి. ఇదంతా వెలుగులోకి రాకుండా అంతా తానే చేసినట్లుగా మాయ చేసి కొన్నిపత్రికల్లో(సాక్షి కాదు) కథనాల రారుుంచుకున్న ఘనత ఆయనకే సొంతం.
కూలిచ్చి ప్రచారం..!
బోడే ప్రచారానికి ప్రజా స్పందన కరువైంది. నేతలు కలసిరాకపోవడంతో ప్రతి గ్రామంలోనూ ఎక్కడికక్కడే కిరాయి కూలీలతో ప్రచారాన్ని పూర్తి చేసుకుని మమ.. అనిపిస్తున్నారు. డబ్బు, మద్యం పంచుతూ కూలీలను తన వెంట తిప్పుకుంటున్నారు. ప్రచారంలో ఆయన ఇచ్చే హామీలు ప్రజలకు విసుగుపుట్టిస్తున్నారుు. నియోజకవర్గంలోని సమస్యలపై అవగాహన లేకుండానే హామీలు గుప్పించటంపై ప్రజలు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ఆరోగ్య కేంద్రం అభివృద్ధి, మౌలిక వసతులపై నోరుమెదపని బోడే... సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని అందుబాటులోకి తెస్తానని చెప్పడంపై తెలుగు తమ్ముళ్లే విమర్శలు గుప్పిస్తున్నారు.
ఒప్పందాలకు తిలోదకాల వల్లే..
నియోజకవర్గంలో టీడీపీ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో చలసాని పండు సతీమణి పద్మావతి, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ కనిపించకపోవటంపై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ ఇరువురు నేతలతోపాటు వారి అనుచరులు కూడా అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. బోడే ప్రసాద్‌కు సీటు కేటాయించటం, ఆయన రాజకీయ, ఆర్థిక ఒప్పందాలకు తిలోదకాలు ఇవ్వడమే ఇందుకు కారణాలని తెలుస్తోంది. ఉయ్యూరు మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల తరఫున ఈ ముగ్గురు నేతలూ తమతమ స్థాయిలో ఖర్చు పెట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎవరికి సీటు కేటాయించినా, మిగిలిన ఇద్దరికి వారు చేసిన ఖర్చును చెల్లించాలనేది ఒప్పందం. బోడే ప్రసాద్ ఈ ఒప్పందానికి తిలోదకాలు ఇచ్చినట్లు సమాచారం. నామినేషన్, ప్రచార కార్యక్రమాల సమయంలో కూడా పద్మావతి, వైవీబీలతో సంప్రదించకపోవడంతో వారు ఆగ్రహానికి గురైనట్లు తెలిసింది. ఈ పరిణామాలను తెలుసుకున్న చంద్రబాబు హిందూపురం ఎన్నికల పరిశీలకుడిగా వైవీబీని పంపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బోడే ప్రసాద్ గెలుపు అసాధ్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సైకిల్ ఎదురీత..!
Published Wed, Apr 30 2014 1:30 AM | Last Updated on Fri, Aug 10 2018 8:06 PM
Advertisement
Advertisement