పతాక స్థాయికి ప్రలోభాలు
సాక్షి, గుంటూరు : ఎన్నికల వేళ టీడీపీ ప్రలోభాల పర్వం పతాక స్థాయికి చేరింది. పచ్చ నోట్లు విసిరేస్తే ప్రజలు ఓట్లు రాల్చేస్తారని నమ్మకమో.. మద్యం మత్తులో ముంచేస్తే దాసోహ మంటార నే ధైర్యమో.. తెలుగుదేశం నేతల ప్రచారానికి తెరపడిన దగ్గర నుంచి అదే పనిలో ఉన్నారు. ఓటర్లను తమవైపు తిప్పుకోవాలని అన్ని అడ్డదారులూ తొక్కుతున్నారు. ఓటుకు నోటు అంటూ విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. మద్యం ఏరులై పారిస్తున్నారు. సందట్లో సడేమియాగా ఓటర్లు చూసుకుంటారులే.. ఈ ఒక్కరోజు గడిస్తే ఇక మనల్నేం చేస్తారులే అనుకున్నారో.. ఏమో ఇష్టం వచ్చినట్లు దొంగనోట్లు, కల్తీ మద్యం పంపిణీ విస్తృతం చేసేశారు.
ఓటుకు వెయ్యి పంచిన చోట రెండు ఐదువందల నోట్లు ఇచ్చారు. వాటిలో ఒకటి అసలిది.. మరొకటి నకిలీది.. ఓటర్లకు పంపిణీ చేస్తూ ఓట్లన్నీ మాకే వేయాలంటూ ప్రమాణాలు చేయించుకున్నారు. అవి తీసుకున్న ఓటర్లు ఆనక నకిలీవని తేలడంతో ముక్కున వేలేసుకున్నారు. ఈ విషయం ఆనోటా ఈనోటా జిల్లా అంతటా పాకింది. అనేక నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు పంచిన నగదు నకిలీదని తేలిపోయింది. ముఖ్యంగా గురజాల, మాచర్ల, వినుకొండ, నరసరావుపేట, గుంటూరు పశ్చిమ, చిలకలూరిపేట నియోజకవర్గాల పరిధిలో ఇలాంటివి పంపిణీ చేసినట్లు తెలిసి ఓటర్లు టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నాలుక్కరుచుకున్న నేతలు ఎక్కడో పొరపాటు జరిగిందంటూ అడిగిన వాళ్లకు మాత్రం వాటిని మార్చి కొత్త నోట్లను ఇచ్చేశారు. టీడీపీ చేసిన మోసాన్ని గుర్తించిన ప్రజలు వారికి ఓటు ద్వారానే దెబ్బకుదెబ్బ కొట్టాలని నిర్ణయించుకున్నారు.
కల్తీ మద్యం తాగి టీడీపీ అభిమాని మృతి..
ఇదిలా ఉంటే చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలంలో ఓ టీడీపీ అభిమాని తమ పార్టీ వారి వద్దకు వె ళ్లి మద్యం తాగాడు. అప్పటి నుంచి తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎల్లో మీడియా ఆ ప్రభావం టీడీపీపై పడకుండా ఉండేందుకు నెపం ఇతర పార్టీలపై మోపాలని ప్రయత్నాలు చేసింది. మృతుని కుటుంబసభ్యులతో రాజీ కుదుర్చుకుని అనారోగ్యంతో మృతి చెందినట్లు అందరికీ చెప్పించారు. వృతుడు టీడీపీకి అభిమాని కావడం ఇతర పార్టీల వారి వద్దకు అసలు వెళ్లే అవకాశం లేదనే విషయం తేలిపోవడంతో టీడీపీ నేతలు కల్తీమద్యం పంపిణీ చేస్తున్నారని సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలే నిలదీశారని, దీంతో వాటిని మార్చి మరో బ్రాండ్ అందిస్తున్నారని సమాచారం.