సాక్షి, కడప: ‘పగలు పలకరింపులు..రాత్రి రాజకీయాలు’ అన్నట్లు.. జిల్లా టీడీపీలో నయా రాజకీయం నడుస్తోంది. కొన్నేళ్లుగా కష్టకాలంలో పార్టీకి అండగా ఉంటూ..కేడర్‌ను ఇబ్బందులు పెట్టిన కాంగ్రెస్ నేతలను ఎదుర్కొంటూ ‘పార్టీ’ని నిలబెట్టిన నేతలను కాదని చంద్రబాబు కొత్త నేతలను అరువు తెచ్చుకోవడం ఎంత తప్పో ఇప్పుడు తెలిసొస్తోంది. కొత్తనేతల రాకతో ఇన్నాళ్లూ నివురుకప్పిన నిప్పులా ఉన్న పార్టీలోని అసమ్మతి ప్రచారపర్వంలో పైకి లేస్తోంది.
టీడీపీ తరఫున బరిలో నిలిచిన నేతలను ఓడించేందుకు టిక్కెట్టు దక్కని నేతలు కంకణం కట్టుకున్నారు. పగలు వారి తరఫున ప్రచారం చేస్తూ...రాత్రి అనుచరులతో మంతనాలు జరిపి ఎలాగైనా మనపార్టీ అభ్యర్థి ఓడిపోవాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఈ పరిణామాలు బరిలోని అభ్యర్థులకు గుబులు రేపుతున్నాయి. ఈ క్రమంలో అసమ్మతి, అంతర్గత పోరుతో తమ్ముళ్లు సతమతమవుతుంటే..వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ శ్రేణులు మాత్రం సమష్టికృషితో ప్రచారంలో ముందుకెళ్తున్నారు.
‘మేడా’ ఆశలు ఆవిరి
మాజీమంత్రి పసుపులేటి బ్రహ్మయ్యను కాదని కాంగ్రెస్‌పార్టీకి ‘చేయి’చ్చి ఇటీవలే సైకిలెక్కిన మేడా మల్లికార్జనరెడ్డికి టిక్కెట్టు కేటాయించారు చంద్రబాబు. దీంతో ‘మేడా’కు మద్దతిచ్చేందుకు మనసొప్పని మోదుగుల పెంచలయ్య’ బ్రహ్మయ్యతో మంతనాలు జరిపారు. మేడా గెలిస్తే..తమ భవిష్యత్ గల్లంతే అని చర్చించుకుని వ్యతిరేకంగా పనిచేద్దామని పెంచలయ్య ప్రతిపాదన పెట్టినట్లు తెలిసింది. ‘నువ్వు చెప్పేది నిజమే. అయితే ఇప్పటికే ‘మేడా’తో ఒప్పందం మేరకు మద్దతిస్తానని మాట ఇచ్చా. పైకి అండగా ఉంటూనే లోలోపల వ్యతిరేకంగా పనిచేద్దాం’ అంటూ అంతర్గత చర్చ జరిగినట్లు తెలిసింది. అయితే పెంచలయ్య మాత్రం బాహాటంగానే తన సామాజికవర్గానికి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి గాజులభాస్కర్‌కు మద్దతిస్తున్నారు. దీంతో మేడాకు గట్టి దెబ్బ తగిలింది. బ్రహ్మయ్య కూడా ‘మేడా’కు వ్యతిరేకంగా ముఖ్య అనుచరులతో పనిచేయిస్తున్నట్లు తెలుస్తోంది.
‘వరద’ను ఓడించడమే లక్ష్యంగా..
ప్రొద్దుటూరులో కూడా వరదరాజులరెడ్డిని ఓడించడమే లక్ష్యంగా లింగారెడ్డితో పాటు ఆయన వర్గీయులు వ్యూహరచన చేస్తున్నారు. పైకి మద్దతిస్తున్నట్లు ప్రకటించి లోలోపల ‘వరద’ను చిత్తుగా ఓడించేందుకు లింగారెడ్డి వర్గం గట్టి ప్రయత్నమే చేస్తున్నట్లు తెలుస్తోంది. కొన్నేళ్లుగా టీడీపీ కేడర్‌ను ‘వరద’ ఎనలేని ఇబ్బందులు పెట్టారు. దీన్ని మరవని టీడీపీ కార్యకర్తలంతా ‘వరద’కు మద్దతిచ్చే ప్రసక్తే లేదని లింగారెడ్డి వైపు నిలుస్తున్నారు. కాంగ్రెస్‌పార్టీ నుంచి బయటకు వచ్చిన ‘వరద’కు ప్రత్యేక వర్గం పెద్దగా వెంట రాలేదు. ఈ పరిణామాలన్నీ అధిగమించి గెలవడం ‘వరద’కు కత్తిమీద సామే. నియోజకవర్గంలో చురుకైన నేతగా, పేదల మనిషిగా పేరుతెచ్చుకున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రాచమల్లు ప్రసాద్‌రెడ్డి టీడీపీలోని పరిణామాలన్నీ ఎప్పటికప్పుడు తనకు అనుకూలంగా మలుచుకుంటూ ముందడగు వేస్తున్నారు.
ఇక్కడ పరిస్థితులే కమలాపురం, రాయచోటిలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం అభ్యర్థి పుత్తా నరసింహారెడ్డి గెలిస్తే తమ ఆధిపత్యం తగ్గుతుందని, పుత్తాను ఓడిస్తే...తర్వాతి ఎన్నికల్లోపు తన కుమారుడు అనిల్‌ను ఫోకస్ చేయొచ్చనే యోచనలో వీరశివారెడ్డి ఉన్నారు. ఈ లక్ష్యంతోనే ఈయన ‘పుత్తా’కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. రాయచోటిలో రమేశ్‌రెడ్డిని ఓడించేందుకు పాలకొండ్రాయుడు కూడా కసితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా టీడీపీలో వారికి వారే శత్రువులుగా మారి పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు పనిచేడం వైఎస్సార్‌సీపీకి మరింత మేలు జరగనుంది.
మైదుకూరులో ఇదే పరిస్థితి
మైదుకూరులో 32 ఏళ్లుగా టీడీపీ కోసం పాటుపడుతున్న నేత రెడ్యం వెంకటసుబ్బారెడ్డి. ఇటీవల జరిగిన పరిణామాలతో నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ప్రజలకు ఏమాత్రం పరిచయం లేని, పార్టీకోసం ఎప్పుడూ పాటుపడని పుట్టాసుధాకర్‌యాదవ్‌ను నియమించారు. కేవలం డబ్బులేదనే కారణంతో తనను పక్కనపెట్టారనే ఆక్రోశం రెడ్యంలో బలంగా ఉంది. దీంతో ఇతను కూడా బయటికి మద్దతిస్తున్నట్లు కన్పిస్తున్నా లోలోపల మాత్రం ‘పుట్టా’కు వ్యతిరేకంగానే పనిచేస్తున్నారని మైదుకూరులో కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. టీడీపీలోని గ్రామస్థాయి నేతలు కూడా డబ్బు కోసమే ‘పుట్టా’పై పైపైకి ప్రేమ చూపిస్తున్నారు. సైకిల్ ఎక్కినట్లే ఎక్కి దిగిపోయిన మాజీమంత్రి డీఎల్ అనుచరులు కూడా ‘పుట్టా’ను వ్యతిరేకిస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి కొన్నేళ్లుగా పెద్దాయన రఘురామిరెడ్డి పాటుపడ్డారని, రాజకీయంగా పెద్దాయనకు ఇదే చివరి మజిలీ అని, కచ్చితంగా ఆయనకు అండగా నిలవాలని డీఎల్ వర్గీయులు నిర్ణయించుకున్నారు. అజాతశత్రువుగా పేరుతె చ్చుకున్న రఘురామిరెడ్డికి ప్రజల నుంచికూడా మంచి మద్దతు లభిస్తోంది. ఈ పరిణామాలతో ‘పుట్టా’ కుదేలవుతున్నారు.
‘దేశం’లో గందరగోళం
Published Wed, Apr 23 2014 2:51 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM
Advertisement
Advertisement