కేశినేని నాని
హైదరాబాద్: విజయవాడ లోక్సభ నియోజకవర్గ టిడిపి బాధ్యుడు కేశినేని నాని చివరకు తన పంతం నెగ్గించుకున్నారు. పట్టుబట్టి విజయవాడ లోక్సభ నియోజవర్గం పార్టీ టికెట్ సాధించారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బిఫామ్ కూడా నానికి ఈరోజు ఇచ్చారు. ఈ స్థానం విషయమై టీడీపీలో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ లోక్సభ స్థానానికి పోటీ చేయాలని కేశినేని శ్రీనివాస్ (నాని) మొదటి నుంచి అనుకుంటున్నారు. పార్టీ అధిష్టానం కూడా తనకే కేటాయిస్తుందని ఆయన భావించారు. అయితే ఈ స్థానాన్ని పవర్స్టార్ పవన్ కళ్యాణ్ సూచించిన విధంగా నిర్మాత పొట్లూరి వరప్రసాద్కు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేటాయిస్తున్నట్లు ప్రచారం జరిగింది. కోనేరు సత్యనారాయణ పేరు కూడా వినిపించింది.
కొన్ని కార్పోరేట్ శక్తులు తనకు సీటు రాకుండా చేస్తున్నాయని రెండు రోజుల క్రితం నాని ఆరోపించారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా టిడిపి టికెట్ తనకే దక్కుతుందన్న ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. తాను లోక్సభకు మాత్రమే పోటీచేస్తానని, శాసనసభకు పోటీ చేయనని తెగేసి చెప్పారు. పార్టీ ఆదేశించినా తాను శాసనసభకు పోటీ చేయనన్నారు. కోనేరు సత్యనారాయణ, పొట్లూరి వరప్రసాద్ ఇద్దరూ అంతర్జాతీయ స్కామర్లని విమర్శించారు. అటువంటి వారిని పవన్ కళ్యాణ్ ప్రోత్సహిస్తున్నారని కూడా అన్నారు. చివరకు విజయవాడ లోక్సభ స్థానాన్ని తెలుగు దేశం పార్టీ నానికే కేటాయించింది.