నీతో ప్రచారం చేస్తే నా ఓటమి ఖాయం... కేశినేని చిన్ని
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల మధ్య సమన్వయం కొరవడిన నేపథ్యంలో ఆ పార్టీ ఓటమి దిశగా పయనిస్తోంది. ముఖ్యంగా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. దీనికి తోడు తాజాగా ఎమ్మెల్యే అభ్యర్థి రాసలీలల వ్యవహారం సోషల్ మీడియాలో బట్టబయలవడంతో ఆ పార్టీ ఆత్మరక్షణలో పడింది. జరుగుతున్న పరిణామాలన్నీ రానున్న ఎన్నికల్లో పార్టీ ఓటమికి సంకేతాలుగా ఆ పార్టీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు.సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ తూర్పు నియోజకవర్గంలో తమ్ముళ్ల మధ్య అంతరం రోజు రోజుకు పెరుగుతోంది. పోలింగ్ తేదీ సమీపించే కొద్దీ నాయకుల మధ్య సమన్వయం పూర్తిగా కొరవడింది. విజయవాడ లోక్‌సభ అభ్యర్థి కేశినేని చిన్ని, విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి గద్దె రామ్మోహనరావు మధ్య విభేదాలు పతాక స్థాయికి చేరాయి, ఇద్దరూ కలిసి కనీసం ప్రచారంలో కూడా పాల్గొనటం లేదు. ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారు. ఓటర్లకు డబ్బు పంపకాలలో సైతం గద్దె రామ్మోహనరావు, ఎంపీ అభ్యర్థిని పరిగణనలోకి తీసుకోకుండా సొంత మనుషులతోనే పంపకాలు చేస్తున్నారు. ఇటీవల వైఎస్సార్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన బొప్పన భవకుమార్ సైతం గద్దె వ్యవహరిస్తున్న తీరుపై గుర్రుగా ఉన్నారు. ఓటర్లకు డబ్బు పంపిణీ విషయంలో ఆయన్ను దూరంగా పెట్టడంతో కినుక వహించారు. గద్దె వ్యవహారం నచ్చక ఆయన అలకబూనారు. దీంతో పాటు పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న సీనియర్లు సైతం గద్దె రామ్మోహన్ తీరుపై గుర్రుగా ఉన్నారు. ఆయనకు ప్రచారంతోపాటు, డబ్బు పంపిణీ కార్యక్రమాల్లో సైతం దూరంగా ఉంటున్నారు. దీంతో టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో నిస్తేజం నెలకొంది. నానాటికీ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి దిగజారుతుండటంతో, కొంతమంది నేతలు సైలెంట్ అయిపోతున్నారు. ఈ పరిణామాలన్నీ ఓటమికి సంకేతాలుగా సూచిస్తున్నాయని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే పరిస్థితి చేజారిపోయిందని, ఓటమి ఖాయం అనే భావనకు టీడీపీ వర్గాలు వచ్చాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాసలీలల రామ్మోహన్!గద్దె అసంతృప్తి సెగలు తాకకుండా... విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఓటర్లు గద్దె పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. తాను ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో నియోజకవర్గంలో అభివృద్ధి గురించి పట్టించుకోలేదని అసంతృప్తితో ఉన్నారు. మాయ మాటలతో ప్రతిసారీ ఎన్నికల్లో మభ్యపెట్టడం, దుష్ప్రచారం చేసి నెట్టుకొస్తున్నాడనే భావన నియోజకవర్గ ఓటర్లలో వ్యక్తం అవుతోంది. దీనికితోడు తాజాగా గద్దె గలీజు బాగోతం బట్టబయలైంది. ఎన్నో ఏళ్లుగా సాగుతున్న ఆయన రాసలీలల వ్యవహారం సోషల్ మీడియా వేదికగా వెలుగులోకి రావటం విజయవాడలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఈయన నిజస్వరూపం తెలిసి తూర్పు నియోజకవర్గ ప్రజలు ఛీకొడుతున్నారు. దీనికితోడు టీడీపీ ప్రభుత్వ హయంలో కాల్‌మనీ వేధింపుల కేసుల్లో నిందితులు కూడా ఈయన అండతోనే అలా వ్యవహరించారనే విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అప్పటి టీడీపీ ప్రభుత్వ ఒత్తిడితో పోలీసులు పట్టించుకోలేదని, ఇన్నాళ్లకు గద్దె పాపాలు పండాయని వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల గద్దె ప్రధాన అనుచరుడు మహిళలను వేధింపులకు గురి చేసి, దాడి చేయడంతో అతనిపై పటమట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయింది. ఇప్పుడు ఏకంగా గద్దె రామ్మోహనరావు వాట్సప్ చాటింగ్ వెలుగులోకి రావడంతో టీడీపీ ఆత్మరక్షణలో పడింది. ఇలా పోలింగ్ తేదీ సమీపించే కొద్దీ టీడీపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. దీంతోపాటు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల మధ్య కోల్డ్ వార్ సాగుతోంది. వీరిరువురు విడివిడిగా ప్రచారం చేసుకొంటున్నారు. గద్దె రామ్మోహనరావు ఎంపీ అభ్యరి్థకి సహకరించటం లేదు. గత రెండేళ్లు నియోజకవర్గంలో ఏ పార్టీ కార్యక్రమం జరిగినా తానే ఖర్చు భరించానని, తీరా ఎన్నికల సమయానికి వచ్చేసరికి గద్దె పట్టించుకోకపోవడంతో ఆయన తీరుపై ఎంపీ అభ్యర్థి కారాలు మిరియాలు నూరుతున్నారు. మొత్తం మీద తూర్పు నియోజక వర్గంలో జరుగుతున్న పరిణామాలన్నీ ఈసారి ఎన్నికల్లో ఆ పార్టీ పుట్టి ముంచడం ఖాయం అనే సంకేతాలను ఇస్తున్నాయి. రాసలీలల రామ్మోహన్!