కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లకు ఏమాత్రం పోటీ ఇవ్వని దుస్థితి
ఆశలు పెట్టుకున్న ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లోనూ ఎదురీత
అనేక నియోజకవర్గాల్లో మూడో స్థానం కోసమే పోరు
హెదరాబాద్: పోలింగ్ సమీపిస్తున్న సమయంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ సమరోత్సాహంతో ముందుకు సాగుతుండగా, తెలుగుదేశం పార్టీ సరైన వ్యూహం లేక చతికిలపడుతోంది. తెలంగాణ కోసం పోరాడిన పార్టీగా టీఆర్‌ఎస్, తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ప్రచారంలో దూసుకుపోతుండగా, తెలుగుదేశం పార్టీకి ఏ నినాదంతో ముందుకు పోవాలో తెలియని పరిస్థితి నెలకొంది. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన పార్టీగా ప్రచారం చేసుకోవాలని భావించినప్పటికీ, తెలంగాణ వచ్చే సమయంలో ఢిల్లీలో చంద్రబాబు చేసిన రాజకీయాలు ప్రజల కళ్లముందు కనిపిస్తుండడంతో ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు ఉనికి చాటుకునేందుకు కూడా శ్రమించాల్సి వస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు కాకుండా మిగతా 8 జిల్లాల్లో ఎక్కడా టీడీపీ నుంచి ఇతర పార్టీలు గట్టిపోటీ ఎదుర్కోవడం లేదు. అరకొర నియోజకవర్గాల్లో పోటీ ఇస్తున్నా గెలిచే స్థాయిలో లేకపోవడం అభ్యర్థులకు ఇబ్బంది కరంగా మారింది. బీజేపీతో పొత్తు కొన్ని జిల్లాల్లోనే సఖ్యంగా సాగుతోంది. అనేక చోట్ల రెండు పార్టీలు కత్తులు దూసుకునే పరిస్థితే నెలకొంది. ఖమ్మం, మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో బీజేపీతో పొత్తు టీడీపీ అభ్యర్థులకు కలిసిరాకపోగా, మరింత ఇబ్బందిగా మారింది.
నల్లగొండలో చంద్రబాబు నిర్వహించిన బహిరంగసభలు కూడా తూతూ మంత్రంగా సాగాయంటే పరిస్థితిని అంచనా వేయవచ్చు. ఏ జిల్లాలో కూడా రెండు, మూడు నియోజకవర్గాలలో మించి ఉనికి కనబరిచే స్థితిలో టీడీపీ లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు చాలా చోట్ల చేతులెత్తేశారు. ఇక టీడీపీ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఖమ్మంలో సీన్ పూర్తిగా రివర్స్ అయింది. అక్కడ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు, ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు వర్గాలు ఒకరినొకరు ఓడించుకునేందుకు కష్టపడుతూ, ఇతర పార్టీలకు విజయావకాశాలను సునాయాసం చేస్తున్నాయి. రంగారెడ్డిలో సీట్ల కేటాయింపులో ఏర్పడిన లొల్లి ఆ పార్టీ పుట్టిముంచుతోంది. అనేక చోట్ల పార్టీ కార్యకర్తల నుంచే వ్యతిరేకత వస్తోంది. ఎల్‌బీ నగర్‌లో బీసీ సీఎం అభ్యర్థిగా రంగంలోకి దిగిన ఆర్. కృష్ణయ్య తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఇక్కడ టికెట్టు కోసం పోటీ పడ్డ ఎస్.వి. కృష్ణప్రసాద్, ఆయన మద్దతుదారులు ఆదివారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కమ్మ వర్గానికి చెందిన సెటిలర్స్‌ను కోల్పోవడం కృష్ణయ్యపై తీవ్ర ప్రభావం చూపుతుంది. హైదరాబాద్‌లో ఏ సీటు కచ్చితంగా గెలుస్తామని చెప్పే స్థితిలో టీడీపీ లేదు. సనత్‌నగర్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, నాంపల్లి వంటి నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఎదురీదుతున్నారు.
జిల్లాల్లో పరిస్థితి ఇదీ ..
ఖమ్మం: ఇక్కడి 10 అసెంబ్లీ సీట్లలో టీడీపీ 9 చోట్ల, బీజేపీ ఒకచోట పోటీ చేస్తోంది. ఒక్కరికీ గెలుస్తామనే ధీమా లేదు. పాలేరు, కొత్తగూడెం అభ్యర్థులకు తుమ్మల వర్గం సహాయ నిరాకరణ చేస్తుండగా, తుమ్మలతో పాటు ఆయన వర్గీయులు పోటీచేస్తున్న 5 నియోజకవర్గాల్లో నామా వర్గం అదే రీతిలో ఉంది. అశ్వారావుపేటలో ఎం. నాగేశ్వరరావు కొంత మేర పోటీ ఇస్తున్నా గెలుపుపై ధీమా లేదు. మధిరలో మోత్కుపల్లి నర్సింహులు ఎదురీదుతున్నారు.
మెదక్: జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ఆరు చోట్ల టీడీపీ పోటీ చేస్తోంది. మెదక్ ఎంపీగా, గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ రంగంలో ఉండడంతో టీడీపీ అభ్యర్థులకు గెలుస్తామని ధీమాగా చెప్పే పరిస్థితి ఒక్కచోట కూడా లేదు. బీజేపీ సహకారం ఏమాత్రం లేదు. పటాన్‌చెరులో టీడీపీ అభ్యర్థికి బీజేపీ రెబల్ అంజిరెడ్డి ప్రమాదకరంగా మారారు.
కరీంనగర్: 13 సెగ్మెంట్లలో టీడీపీ 6 చోట్ల పోటీలో ఉంది. అన్ని చోట్ల త్రిముఖ, బహుముఖ పోటీ నెలకొంది. జగిత్యాల, పెద్దపల్లి, మానకొండూరు, చొప్పదండి నియోజకవర్గాల్లో మాత్రమే టీడీపీ అభ్యర్థులు కొంత పోటీ ఇస్తున్నారు. మిగతా చోట్ల నామ్‌కే వాస్తే. చొప్పదండిలో జేఏసీ విద్యార్థి నేత మేడిపల్లి సత్యంకు చివరి నిమిషంలో టికెట్ ఇవ్వడంతో పార్టీ పరిస్థితి కొద్దిగా మెరుగుపడినట్లు కనిపిస్తోంది.
వరంగల్: త్రిముఖ పోటీలో నామ్‌కేవాస్తేగా మారిపోయింది. మహబూబాబాద్, డోర్నకల్, స్టేషన్ ఘన్‌పూర్‌లలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. పాలకుర్తిలో ఎర్రబెల్లి, ములుగులో సీతక్క, పరకాలలో ధర్మారెడ్డి, నర్సంపేటలో రేవూరి ప్రకాశ్ రెడ్డి గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు.
నిజామాబాద్: కేసీఆర్ కుమార్తె కవిత నిజామాబాద్ ఎంపీగా పోటీ చేస్తుండడంతో ఇక్కడ టీడీపీ ఉనికే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ఏర్పడింది. జిల్లాలోని 9 సీట్లకు గాను టీడీపీ 5 చోట్ల పోటీ చేస్తుండగా, బా ల్కొండలో మాత్రమే మల్లికార్జునరెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డికి కొద్దిగా పోటీ ఇస్తున్నారు.
అదిలాబాద్: జిల్లాలోని 10 సీట్లకుగాను టీడీపీ ఆరుచోట్ల పోటీ చేస్తోంది. బోథ్‌లో సోయం బాబూరావు మాత్రమే పోటీ ఇస్తున్నారు. మిగతా అన్ని చోట్ల మూడోస్థానం కోసమే టీడీపీ పోటీ పడుతోంది.
నల్లగొండ: జిల్లాలోని 8 చోట్ల పోటీ చేస్తున్న టీడీపీ దేవరకొండ, కోదాడ, భువనగిరి నియోజకవర్గాల్లో వూత్రమే ఓమోస్తరు పోటీలో ఉండగా, నల్లగొండ, నాగార్జున సాగర్, నకిరేకల్, సూర్యాపేటల్లో వుూడోస్థానం కోసం పోటీ పడుతోంది.
తెలంగాణలో టీడీపీ అభ్యర్థుల తిప్పలు
Published Mon, Apr 21 2014 2:14 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement