ఒంగోలులో సీవీఎన్ రీడింగ్ సమీపంలో రోడ్ షోలో మాట్లాడుతున్న కిరణ్
ఒంగోలు టూటౌన్, న్యూస్‌లైన్: తెలంగాణలో సీట్ల కోసం సోనియా రాష్ట్రాన్ని విభజించిందని జైసమైక్యాంధ్ర రాష్ట్ర అధ్యక్షుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. రోడ్‌షోలో భాగంగా శనివారం జిల్లాకు వచ్చిన ఆయన ఒంగోలులోని సీవీఎన్ రీడింగ్ రూం సమీపంలో నిర్వహించిన రోడ్‌షోలో మాట్లాడారు. ఎటువంటి ప్రణాళికలు లేకుండా రాష్ర్ట విభజనకు అనుకూలంగా వ్యవహరించిన పార్టీలకు వచ్చే ఎన్నికల్లో ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
50 ఏళ్లకుపైగా కష్టపడి అభివృద్ధి చేసుకున్న హైద రాబాద్‌ను తెలంగాణకు ఇవ్వడం వెనుక కేసీఆర్, సోనియాల స్వార్థం ఉందన్నారు. విభజన వల్ల సాగు, తాగునీటి కోసం నిత్యం కొట్లాటలు జరుగుతాయన్నారు. యువత భవిష్యత్తు కోసమే జైసమైక్యాంధ్ర పార్టీని పెట్టామని చెప్పారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్, బంగారు తల్లి, పిల్లలకు డైట్ చార్జీలు వంటి పథకాలను ప్రవేశపెట్టానని చెప్పారు. * 46 వేల కోట్లుగా ఉన్న రాష్ట్ర బడ్జెట్‌ను *80 వేల కోట్లకు తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.
పావలా వడ్డీ బకాయిలు, మైక్రో ఫైనాన్స్ ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి స్త్రీనిధి పెట్టామన్నారు. ఆల్ ఫ్రీ అని చెప్పే నాయకుల మాటలు నమ్మవద్దన్నారు. విభజన వల్ల రెండు చోట్ల జీతాలిచ్చే పరిస్థితి లేదన్నారు. జైసమైక్యాంధ్ర పార్టీకి ఓట్లేసి గెలిపించాలని కోరారు. కేసీఆర్, బీజేపీ నేతలు అద్వానీ, సుష్మాస్వరాజ్, చంద్రబాబుల తీరును దుయ్యబట్టారు. యువకులను, పోరాట యోధులను అసెంబ్లీ, పార్లమెంట్‌కు పంపుతామన్నారు.
కార్యక్రమంలో జైసమైక్యాంధ్ర పార్టీ జిల్లా బాధ్యుడు జడా బాలనాగేంద్రం, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు సంజీవరెడ్డి, జగన్మోహన్‌రావు, జిల్లా నాయకులు రామస్వామి, మాదా శ్రీదేవి, కే లక్ష్మీకుమారి వివిధ పార్లమెంటరీ నియోజకవర్గాల నాయకులు రఘునాథ్, న్యాయవాదుల జేఏసీ నాయకురాలు దేవకుమారి, యన్‌ఆర్‌కె. నాగిరెడ్డి, విద్యార్థి జేఏసీ నాయకులు నాగరాజు, కార్యకర్తలు పాల్గొన్నారు.