చిన్నశంకరంపేట, న్యూస్‌లైన్: మండలంలోని అంబాజిపేట ఎంపీటీసీ స్థానం ప్రధాన పార్టీల అధ్యక్షులకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక్కడ అభ్యర్థులకన్నా ఆయా పార్టీల అధ్యక్షులకే టెన్షన్ ఎక్కువైంది. అంబాజీపేట ఎంపీటీసీ స్థానం పరిధిలో అంబాజిపేటతోపాటు కామారం గ్రామాలు ఉన్నాయి. అంబాజిపేటలో 728 ఓట్లు, కామారంలో 904 ఓట్లు ఉన్నాయి. నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీడీపీ నుంచి ఆ పార్టీ నాయకుడు పూలపల్లి యాదగిరి సతీమణి మంజుల యాదవ్ పోటీ చేస్తున్నారు. ఈమె గత సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.
అయినప్పటికీ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎంపీటీసీ బరిలో నిలిచారు. కాంగ్రెస్ తరఫున అంబాజిపేటకు చెందిన ద్యాప మణెమ్మ పోటీలో ఉన్నారు. టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రాంరెడ్డి, అంబాజిపేటకు చెందిన కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షుడు సాన సత్యనారాయణ సమీప బంధువు లతాశ్రీని బరిలో నిలిపారు. బీజేపీ నాయకులు కామారం గ్రామానికి చెందిన జూకోటి లక్ష్మిని అభ్యర్థిగా పోటీలో దింపారు.
ప్రధాన పార్టీల నేతలకు సవాల్..
అంబాజిపేట స్థానం నుంచి కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీ, బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తుండగా ఎవరికి వారు తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఆయా పార్టీల మండల అధ్యక్షులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆర్.రామచంద్రారెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పాపయ్యగారి రాంరెడ్డి, బీజేపీ మండల అధ్యక్షులు పాపయ్యగారి రాజిరెడ్డిలది కామారం గ్రామం. వీరందరిదీ ఒకే గ్రామం కావడంతో ఎవరికి వారు తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తంటాలు పడుతున్నారు. అదీగాక కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు అంజిరెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.సుభాష్‌రెడ్డి స్వయాన సోదరులు. టీఆర్‌ఎస్, బీజేపీ అధ్యక్షులు కూడా సొంత అన్నదమ్ములు.
ఇలా ఆయా పార్టీ నేతల మధ్య బంధుత్వం ఉన్నప్పటికీ ఎవరికి వారు తమ అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అభ్యర్థులు సైతం ఆయా పార్టీ నేతలకు సమీప బంధువులు, అనుచర వర్గమే కావడంతో అభ్యర్థుల కన్నా సదరు పార్టీల నాయకులకే టెన్షన్ ఎక్కువైంది. ఆ మేరకు ప్రచారాన్ని కూడా జోరుగా నిర్వహిస్తున్నారు. ఓ రకంగా ఇది పార్టీ నేతల మధ్య జరుగుతున్న పోరుగా మారడంతో గెలుపు ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.
ప్రధాన పార్టీల నేతలకే తలపోటు
Published Sun, Mar 30 2014 11:54 PM | Last Updated on Sat, Sep 2 2017 5:22 AM
Advertisement
Advertisement