సాక్షిప్రతినిధి, నల్లగొండ: సార్వత్రిక సమరం చివరి అంకానికి చేరుకుంది. మరో రెండు రోజులు గడిస్తే కీలక ఘట్టమైన పోలింగ్‌కు తెరలేస్తుంది. ఓటింగ్‌కు 48గంటల ముందే ప్రచారానికి తెర పడనుంది. దీంతో సోమవారం సాయంత్రం ఆరుగంటల వరకే ఇక, అభ్యర్థులు ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇన్నాళ్లూ పట్టణాలు, గ్రామాల్లో హోరెత్తించిన రాజకీయ పార్టీల ప్రచార మైకులు ఇక మూగబోనున్నాయి.
కళాకారుల డప్పుల చప్పుళ్లు, ఆటా, పాటలు బంద్ కానున్నాయి. తమ పార్టీని గెలిపిస్తే అది చేస్తాం.. ఇది చేస్తామని హామీలు గుప్పించిన నేతలు, ఎదుటి పక్షంపై విమర్శలతో విరుచుకుపడిన అభ్యర్థులు ఇక, ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించుకోనున్నారు. సోమవారం సాయంత్రం ఆరు గంటలకు ప్రచారం బంద్ కానుండడంతో మిగిలిన ఒక రోజును ‘డోర్ టు డోర్’ క్యాంపెయిన్‌కు కేటాయిస్తున్నారు. ఎన్నిల షెడ్యూలు విడుదలయ్యాక కూడా, అసెంబ్లీ, పార్లమెంటు అభ్యర్థులు స్థానిక ఎన్నికల్లోనే తలమునకలై ఉన్నారు.
ఇదే సమయంలో మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఉండడంతో నియోజకవర్గాల వారీగా ఈ ఎన్నికలపైనే దృష్టిపెట్టాల్సి వచ్చింది. ఫలితంగా సార్వత్రిక ఎన్నికల ప్రచారం కాసింత ఆలస్యంగానే మొదలైంది. ఎన్నికలకు 2వ తేదీనే నోటిఫికేషన్ వెలువడినా, నామినేషన్ల దాఖ లుకు చివరి రోజైన 9వ తేదీ వరకూ కొందరి అభ్యర్థిత్వాలే ఖరారు కాలేదు. ఈ కారణంగా అంతగా ప్రచారం ఊపు కూడా కనిపించలేదు. నామినేషన్ల స్క్రూటినీ, ఉపసంహరణలు ముగిసి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రెండో విడత ఎన్నికలు ముగిశాక, ఈ నెల 13వ తేదీ నుంచే అసలు ప్రచారం మొదలైంది. దీంతో అభ్యర్థుల ఎన్నికల ప్రచారం కేవలం 15రోజలకే పరిమితమైంది. ఈ రెండు వారాల్లోనే సాధ్యమైనంతగా గ్రామాలను చుట్టి వచ్చేందుకు ప్రయత్నించారు. ఆయా పార్టీల అభ్యర్థుల తరపున కేడర్ తిరిగి ప్రచారం చేసినా, అభ్యర్థులు నేరుగా వె ళ్లి, కలిసిన ఓటర్ల సంఖ్య తక్కువే. దీంతో కనీసం మిగిలిన ఒక రోజు, రెండు రాత్రులను సద్వినియోగం చేసుకునే వ్యూహంతో ఉన్నారు.
ప్రధాన నేతల ప్రచారంతో .. హుషారు
మునుపెన్నడూ లేని రీతిలో ఈ సారి ఎన్నికల ప్రచారం కేవలం పదిహేను రోజులకే పరిమితమైనా, ఆయా పార్టీల అభ్యర్థులు తరపున స్టార్ కాంపెయినర్లు రావడం కలిసొచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థుల కోసం ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల తొలి విడతగా హుజూర్‌నగర్, కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాల్లో పర్యటించి నాలుగు సభల్లో పాల్గొన్నారు. ఆమె పర్యటన విజయవంతం కావడంతో, మరింత ప్రభావం చూపేందుకు పార్టీ అధ్యక్షుడి పర్యటన కోసం ఎదురు చూశారు. చివరకు కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నిల ప్రచార సభల్లో పాల్గొన్నారు. తమకు తోడు పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్య నేతలు ప్రచారానికి రావడంతో వీరికి కలిసి వచ్చింది.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు మాత్రం ఎవరికి వారే ప్రచారం చే సుకోవాల్సి వచ్చింది. భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ప్రధాని మన్మోహన్‌సింగ్ సభలో పాల్గొని కొంత కొరత తీర్చారు. కాగా, కోమటిరెడ్డి సోదరులు ఒకరి కోసం మరొకరు ప్రచారం చేసుకున్నారు. భువనగిరి లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ వెంకటరెడ్డి ప్రచారం చేశారు. సోమవారం కోదా డలో దిగ్విజయ్‌సింగ్ ప్రచారం చేయనున్నారు.
టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తమ పార్టీ అభ్యర్థుల తరఫున జిల్లాలో మూడుసార్లు పర్యటించారు. తొలుత నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అభ్యర్థులతో నల్లగొండలో బహిరంగ సభల్లో పాల్గొన్నారు. రెండో విడతగా, ఒకేరోజు తొమ్మిది నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన జరిపారు. మూడో విడతగా భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో శనివారం ప్రచారం చేసి వెళ్లారు. దీంతో టీఆర్‌ఎస్ అభ్యర్థులు అందరి పక్షాన ఆయన ప్రచారం చేసినట్లయ్యింది.
బీజేపీ అభ్యర్థుల కోసం ఆ పార్టీ జాతీయ నాయకురాలు సుష్మాస్వరాజ్ చౌటుప్పల్‌లో బహరంగ సభలో పాల్గొన్నారు. సోమవారం జనసేన పార్టీ నాయకుడు, సినీనటుడు పవన్ కల్యాణ్ బీజేపీ తరఫున ప్రచారం చేయనున్నారు. ఇక, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారం చేశారు. టీఆర్‌ఎల్డీ తరపున సినీ నటి జయప్రద ప్రచారానికి వచ్చారు.
సీపీఎం తరఫున ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు సీతారం ఏచూరి, బృందాకారత్, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంలు పలు నియోజకవర్గాల్లో రోడ్‌షోలు నిర్వహించారు. అయితే, ప్రచారం కేవలం 15 రోజుల్లోనే ముగియడంతో అభ్యర్థులకు కొంత ఖర్చు కలిసి వచ్చినట్లు అయింది. పోలింగ్‌కు మరో రోజు మిగిలి ఉండడంతో ఓటర్లకు గాలం వేసే పనికి తెరలేవనుంది.
నేటితో ప్రచారానికి తెర
Published Mon, Apr 28 2014 3:31 AM | Last Updated on Sat, Sep 2 2017 6:36 AM
Advertisement
Advertisement