సాక్షి ప్రతినిధి, అనంతపురం : పొత్తు ధర్మాన్ని విస్మరించిన టీడీపీ అధిష్టానంపై కమలనాథులు కన్నెర్ర చేశారు. తమకు కేటాయించిన స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిని తప్పించకపోతే.. మిగిలిన వాటిలో తమ సత్తా చాటుతామని అల్టిమేటం జారీ చేశారు. వివరాల్లోకి వెళితే.. పొత్తులో భాగంగా గుంతకల్లు శాసనసభ స్థానాన్ని బీజేపీకి టీడీపీ అధినేత చంద్రబాబు కేటాయించారు. అక్కడ వెంకట్రామయ్యను బీజేపీ తమ అభ్యర్థిగా ఎంపిక చేసింది. సీఐ ఉద్యోగానికి రాజీనామా చేసి ఆయన ఎన్నికల బరిలోకి దిగారు. నామినేషన్ ఘట్టం ముగియడానికి 24 గంటల ముందు వెంకట్రామయ్య బలహీనమైన అభ్యర్థి అని, ఆయనను మార్చాలని అనంతపురం లోక్‌సభ టీడీపీ అభ్యర్థి జేసీ దివాకర్‌రెడ్డి ఆ పార్టీ అధినేత చంద్రబాబు ద్వారా కమలనాథులపై ఒత్తిడి తెచ్చారు. కానీ.. ఆ డిమాండ్‌కు బీజేపీ అధిష్టానం అంగీకరించలేదు. ఉద్యోగానికి రాజీనామా చేసి త్యాగం చేసిన వెంకట్రామయ్యకు ఇచ్చిన టికెట్‌ను వెనక్కి తీసుకుంటే నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చినట్లవుతుందని కమలనాథులు తెగేసి చెప్పారు.
గుంతకల్లు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి వెంకట్రామయ్య ఒక్కరే బరిలో ఉంటే తాను గెలవలేనని చంద్రబాబుకు జేసీ దివాకర్‌రెడ్డి తెగేసి చెప్పినట్లు సమాచారం. ఆ ఒత్తిళ్లకు తలొగ్గిన చంద్రబాబు.. నామినేషన్‌లు దాఖలుకు చివరి రోజున గుంతకల్లు టీడీపీ అభ్యర్థిగా జితేంద్రగౌడ్‌ను ప్రకటించి, బీ-ఫారం జారీ చేశారు. టీడీపీ అధికారిక అభ్యర్థిగా గుంతకల్లు నుంచి జితేంద్రగౌడ్ నామినేషన్ కూడా దాఖలు చేశారు. తమకు కేటాయించిన స్థానంలో టీడీపీ అభ్యర్థి ఎలా నామినేషన్ వేస్తారని కమలనాథులు టీడీపీ అధిష్టానాన్ని నిలదీశారు. కానీ.. ఫలితం కన్పించలేదు. నామినేషన్‌ల ఉపసంహరణ గడువు బుధవారం మధ్యాహ్నం మూడు గంటలతో పూర్తవుతుంది.
ఆ లోగా గుంతకల్లులో టీడీపీ అభ్యర్థి జితేంద్రగౌడ్‌ను తప్పించాలని మంగళవారం కమలనాథులు డిమాండ్ చేశారు. లేకుంటే.. హిందూపురం లోక్‌సభ స్థానంలో శరత్‌కుమార్‌రెడ్డి, కదిరి, పుట్టపర్తి అసెంబ్లీ స్థానాల్లో పోటీచేస్తోన్న ఉత్తంరెడ్డి, హనుమంతరెడ్డిలను బరిలో నుంచి తప్పించే ప్రశ్నే ఉండదని స్పష్టీకరిస్తున్నారు. అనంతపురం లోక్‌సభ స్థానంలో స్వతంత్ర అభ్యర్థి నాగరాజుకు మద్దతు ఇస్తామని.. మిగిలిన అసెంబ్లీ స్థానాల్లోనూ స్వతంత్ర అభ్యర్థులకు మద్దతు ఇచ్చి, మోడీ ఫొటోతో ప్రచారం చేస్తామని.. టీడీపీ అభ్యర్థులను ఓడించడమే ఏకైక అజెండాగా పనిచేస్తామని బీజేపీ నేతలు స్పష్టీకరిస్తున్నారు. కాగా, కమలనాథులు జారీ చేసిన అల్టిమేటంను టీడీపీ నేతలు తేలిగ్గా తీసుకుంటున్నారు.
నెయ్యమా? కయ్యమా?
Published Wed, Apr 23 2014 3:06 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM
Advertisement
Advertisement