
కిషన్‌రెడ్డికి ఉగ్ర ముప్పు
భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి కి ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరించింది.
హెచ్చరించిన ఇంటెలిజెన్స్ విభాగం
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరించింది. ఉగ్రవాదుల హిట్‌లిస్ట్‌లో ఉన్న కిషన్‌రెడ్డి భద్రతా సూచనలు పక్కన పెట్టి ఉదయం వేళ తెలంగాణ జిల్లాల్లో ప్రచారం.. సాయంత్రం తన నియోజకవర్గంలో పాదయాత్రలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కనీస రక్షణ చర్యలు లేకుండా ప్రజల్లోకి వెళ్లడం సరికాదని ఇంటెలిజెన్స్ హెచ్చరించినట్లు సమాచారం. కిషన్‌రెడ్డికి ప్రభుత్వం ‘వై’ కేటగిరి భద్రత కల్పించింది. ఇందులో భాగంగా ముగ్గురు చొప్పున గన్‌మన్లు ఆయన వెంట, ఇంటి వద్ద రక్షణగా ఉంటారు. ప్రత్యేకంగా ఆయనకు బుల్లెట్ ఫ్రూఫ్ స్కార్పియో వాహనాన్ని సమకూర్చారు.
కానీ ప్రస్తుతం ఎన్నికల్లో ప్రచారం చేయాల్సి రావటంతో ఆయన భద్రతను గాలికొదిలేసి తిరుగుతున్నారు. ఉదయం హెలికాప్టర్‌లో జిల్లాలకు వెళ్తున్న ఆయన సాయంత్రం తాను పోటీ చేస్తున్న అంబర్‌పేట నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొంటున్నారు. జిల్లాలకు వెళ్లినప్పుడు బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం అందుబాటులో లేకపోతుండటంతో సాధారణ కారులోనే తిరుగుతున్నారు. గన్‌మెన్లు కూడా పూర్తి సంఖ్యలో వెంట ఉండటం లేదు. ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ విభాగం తాజా హెచ్చరికలు జారీ చేసినట్టు సమాచారం. ఆయన ఎక్కడికి వెళ్తున్నారో ముందుగానే స్థానిక పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని, సాధారణ వాహనంలో కాకుండా కచ్చితంగా బుల్లెట్‌ప్రూఫ్ వాహనంలోనే తిరగాలని సూచించినట్టు తెలిసింది.