
టీఆర్‌ఎస్‌లో నరకం చూపారు: విజయశాంతి
మెదక్: ఓటమి భయంతోనే కేసీఆర్ మహబూబ్‌నగర్ నుంచి మెదక్ పార్లమెంట్ స్థానానికి వచ్చారని మెదక్ అసెంబ్లీ అభ్యర్థి, ఎంపీ విజయశాంతి విమర్శించారు. బుధవారం మెదక్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేసిన అనంతరం పట్టణంలోని జీకేఆర్ గార్డెన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఆర్‌ఎస్ నాయకులపై మండిపడ్డారు.
టీఆర్‌ఎస్ దోపిడి దొంగల పార్టీ, మోసం చేయడం వారినైజం, కేసీఆర్ మాటల మరాఠి, ఆయనకు అధికారం అప్పగిస్తే కుటుంబ పాలనే కొనసాగిస్తారని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్‌లో జరుగుతున్న విషయాలు బయట పెడితే ఇక్కడి ప్రజలు వారిని తరిమి కొడతారని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మంది మంత్రి పదవుల కోసం రాజకీయాల్లోకి వచ్చి నానా గడ్డి తింటున్నారని, తాను మాత్రం తెలంగాణ వచ్చే వరకు మంత్రి పదవి ఆశించలేదని పేర్కొన్నారు. తన జీవితం ప్రజలకోసమే అంకితం చేస్తున్నానని ప్రకటించారు. ఈ నియోజకవర్గ ప్రజలే నా కుటుంబీకులని చెప్పారు. రాములమ్మ అంటే టీఆర్‌ఎస్‌కు భయమని పేర్కొన్నారు.
ఐదేళ్లు టీఆర్‌ఎస్‌లో నరకం చూపారని, అయినా ప్రజల కోసం అన్ని అవమానాలు భరించానన్నారు. కేసీఆర్ అధికారంలోకి వస్తే తెలంగాణకు పరిశ్రమలు రావన్నారు. బీజేపీ మోడి పేరుతో ప్రజలను మోసం చేస్తుందన్నారు. తెలంగాణలో సైకిల్ పంక్చరైందని ఎద్దేవా చేశారు. తాను మెదక్ పట్టణంలో ఇల్లు కట్టుకొని ప్రజల మధ్యనే ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రకటించారు. మెదక్ జిల్లా కేంద్రం ఏర్పాటు చేసేందుకు అలుపెరగని పోరాటం చేస్తానని చెప్పారు.