సాక్షి, ముంబై: విదర్భలో గత లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్ పరువు కాపాడిన తెలుగువారైన విలాస్ ముత్తెంవార్ మళ్లీ బరిలోకి దిగారు. ఏడుసార్లు ఎంపీగా ఎన్నికైన ఆయన వరుసగా నాలుగుసార్లు విజయం సాధించారు. ఈసారి కూడా విజయం సాధించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్న ముత్తెంవార్‌కు గట్టి పోటీ ఎదురవుతోంది.
ప్రత్యర్థులుగా బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారితోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అంజలి దమనీయలు బరిలో ఉన్నారు. తెలుగువారైన ముత్తెంవార్ పూర్వీకులు అనేక ఏళ్ల క్రితం మహారాష్ట్రకు వచ్చి స్థిరపడ్డారు. దాదాపు ఆయన కుటుంబీకులకు ఆంధ్రప్రదేశ్‌తో ప్రస్తుతం అంతగా సంబంధాలు లేవు. అయినా రాష్ట్రంలో ఇప్పటికీ ముత్తెంవార్ కుటుంబీకులను తెలుగు వంశజులుకి చెందినవారుగా గుర్తిస్తారు.
35 ఏళ్లకుపైగా కాంగ్రెస్‌లో....
విలాస్ ముత్తెంవార్ గత 35 ఏళ్లకుపైగా కాంగ్రెస్‌లో అంకితభావమున్న నాయకునిగా కొనసాగుతున్నారు. 1949 మార్చి 22న చంద్రాపూర్ జిల్లాలో జన్మించిన విలాస్ ముత్తెంవార్ కుటుంబం నాగపూర్‌కి మకాం మార్చింది. నాగపూర్ యూనివర్సిటీ నుంచి బీకాం పూర్తి చేసిన అనంతరం రాజకీయాల్లో వచ్చారు. 1980లో తొలిసారిగా చిమూర్ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసిన విలాస్ 1.38 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
మొత్తం ఏడుసార్లు పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యారు. 1998 నుంచి ఇప్పటివరకు వరుసగా నాలుగుసార్లు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన విలాస్ ముత్తెంవార్ ఐదోసారి కూడా విజయం సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్‌లో ఆయన పలు కీలక పదవులు అలంకరించారు.
మచ్చలేని చరిత్ర, అభివృద్ధి పనులే నా ప్రధానాస్త్రాలు...
గత 35 ఏళ్లకుపైగా రాజకీయాల్లో కొనసాగుతున్నప్పటికీ ఇంతవరకు తనపై ఎలాంటి ఆరోపణలు లేవని విలాస్ ముత్తెంవార్ స్పష్టం చేశారు. ప్రత్యర్థులపై పరోక్షంగా నితిన్ గడ్కారీ, అంజలి దమనీయాలపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయన్నారు. ఈసారి ఎన్నికల్లో కూడా మచ్చలేని తన చరిత్రతోపాటు తాను చేసిన అభివృద్ధి పనులను దృష్టిలో ఉంచుకునే ప్రజలు మళ్లీ గెలిపిస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. గోసెఖుర్డ్ డ్యామ్,మిహాన్ ప్రాజెక్టులు వచ్చేందుకు కృషి చేశానని తెలిపారు.
గోసెఖుర్డ్ జలాశయంతో 10 లక్షల హెక్టార్ల భూమి సాగుకు వీలైందన్నారు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సహకారంతో నాగపూర్ నడిబొడ్డున ఈ మల్టీ మోడల్ ఇంటర్ నేషనల్ ప్యాసింజర్ అండ్ కార్గో హబ్ ఎయిర్‌పోర్ట్ ఎట్ నాగపూర్ నిర్మాణం చేపట్టామని తెలిపారు. తద్వారా నాగపూర్‌తోపాటు విదర్భ అభివృద్ధికి మార్గం సుగమమైందని వివరించారు.
సోలార్ సిటీ ప్రాజెక్ట్‌ను బీజేపీ నిరాకరించింది
కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో నాగపూర్, చండీగఢ్‌లో సోలార్ సిటీ ప్రాజెక్టు కోసం రూపొందించిన ప్రతిపాదనను బీజేపీ వ్యతిరేకించిందని విలాస్ ముత్తెంవార్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్ స్థలం అవసరమైందని, అయితే అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ స్థలం ఇచ్చేందుకు నిరాకరించడంతో ప్రాజెక్ట్ ఏర్పాటు చేయలేకపోయామన్నారు.
నేను ప్రజల మనిషిని...
నితిన్ గడ్కారీ, అంజలి దమనియాలు జాతీయ నాయకులని, తాను మాత్రం ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధినని విలాస్ ముత్తెంవార్ తెలిపారు. 35 ఏళ్లుగా రాష్ట్రంతోపాటు కేంద్రంలో అనేక పదవులు అలంకరించినా ఏనాడూ నాగపూర్‌ను నిర్లక్ష్యం చేయలేదన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ నమ్మకంతో మళ్లీ టికెట్ ఇచ్చిందన్నారు.
ఈసారి విలాస్ ముత్తెం‘వార్’
Published Thu, Mar 27 2014 11:19 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement