
విశాఖ లోక్‌సభ బరిలో ‘గంటా’?
టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలు
పోటీకి ససేమిరా అంటున్న గంటా
విశాఖపట్నం: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు కష్టాలు వెంటాడుతున్నాయి. విశాఖ లోక్‌సభకు పోటీచేయాలని తెలుగుదేశం అధిష్టానం నుంచి తాజాగా ఒత్తిడి రావడంతో ఆయన షాక్ అయ్యారు. బీజేపీని బుజ్జగించి విశాఖ లోక్‌సభ స్థానం బదులు కాకినాడ కేటాయించేందుకు ఇరు పార్టీల మధ్య ఇప్పటికే అంగీకారం కుదిరినట్టు సమాచారం. దీంతో ఆరునూరైనా విశాఖ లోక్‌సభ నుంచే గంటాను బరిలో దింపేందుకు పార్టీ తీవ్ర ఒత్తిడి తీసుకొస్తోంది. కానీ, గంటా మాత్రం విశాఖ లోక్‌సభ నుంచి ఎన్నికల బరిలో దిగేందుకు ససేమిరా అంటున్నట్టు తెలిసింది. ఈ స్థానంలో వైఎస్సార్‌సీపీ నుంచి పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ లేదా షర్మిల పోటీచేస్తారన్న ప్రచారంతో ముందేఆయన చేతులెత్తేశారు.
వారిద్దరిలో ఎవరు బరిలో నిలిచినా ఢీకొనే సత్తాలేదనే పోటీకి విముఖత చూపుతున్నట్లు సమాచారం. మరోవైపు లోక్‌సభకు కాకుండా అనకాపల్లి అసెంబ్లీ సీటు కోసం ఆయన ప్రయత్నించారు. అక్కడ సర్వేల ద్వారా దారుణ పరాభవం తప్పదని తేలడంతో భీమిలీ వైపు దృష్టి సారించారు. తాజాగా అధినేత చంద్రబాబు గంటాను రెండు రోజుల కిందట తన వద్దకు పిలిపించుకుని విశాఖ ఎంపీగా బరిలో దిగాల్సిందేనని, లేకుంటే వేరే స్థానం కష్టమని తేల్చిచెప్పడంతో ఎటూతేల్చుకోలేకపోతున్నట్టు తెలిసింది. నిర్ణయించుకోవడానికి గడువు కోరి అనుచరగణంతో మంతనాల్లోనే మునిగితేలినట్టు సమాచారం. పోటీచేసి ఓటమి మూటగట్టుకునేకంటే ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకుంటేనే మేలేమోనని అనుచరుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది.