కరీంనగర్ కార్పొరేషన్న్యూస్‌లైన్,నీరందదు.. దప్పిక తీరదు.. మురుగు పారదు.. వీధిదీపాలు వెలగవు.. చీకట్లు తొలగవు.. కాలనీల్లో చెత్తాచెదారం.. దోమల స్వైరవిహారం.. రోడ్లన్నీ గుంతలమయం.. ట్రాఫిక్ అస్తవ్యస్తం.. వానొస్తే ఇళ్లూ వీధులూ జలయమం.. ఇదీ మన నగరాలు.. పట్టణాల ముఖచిత్రం! అభివృద్ధి పేరిట రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా.. సమస్యలు యథాతథం. ప్రజల నుంచి పన్నులు పిండుతున్నా.. అవెక్కడపోతున్నాయో తెలియదు.
వీటన్నింటిని ఇంకెన్నాళ్లు చూస్తూ భరించాలి? ఎంతకాలం ఓపికతో సహించాలి? ఓటుకు నోటు తీసుకుంటే ఈ సమస్యలు తొలుగుతాయా? మద్యానికి ఆశపడితే అవినీతి మత్తు వదులుతుందా? ప్రలోభాలకు లొంగితే ప్రశ్నించే అర్హత ఉంటుందా? మరో ఐదేళ్లు కళ్లప్పగించి చూస్తుండిపోవాల్సిందేనా? ఈ జాఢ్యాలకు కారకులను ఎందుకు వదలాలి? నీ భవిష్యత్తును నిర్దేశించుకునే ఓటు అనే ఆయుధం నీ చేతుల్లోనే ఉంది..