
పెద్దాపురంలో పోలింగ్ బహిష్కరణ
ఓటర్లంటే ఐదేళ్లకోసారి మాత్రమే గుర్తుకొచ్చే దేవుళ్లు. అప్పుడు తప్ప ఇన్నాళ్లుగా ఏనాడూ కాలనీల వైపు నాయకులు తొంగి చూస్తే ఒట్టు. అందుకే తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఓటర్లు తమ చైతన్యం ఏమిటో చూపించారు. పెద్దాపురం ఒకటో వార్డులో మునిసిపల్ ఎన్నికల పోలింగ్ జరగలేదు.
అక్కడి దమ్ముపేటకు చెందిన దాదాపు 200 మంది ఓటర్లు ఓటు వేయకుండా బహిష్కరించారు. ఎన్నికలప్పుడు మాత్రమే దర్శనమిచ్చే రాజకీయ నాయకులు, తమకు ఏం చేశారని ఓటు వేయాలని ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. కనీస వసతులు కూడా కల్పించనప్పుడు ఓటు వేసి ఏం లాభమని నిలదీస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరిస్తేనే ఓటేస్తామని తెగేసి చెప్పారు.