తెలంగాణ ఏర్పాటుకు పూర్తిగా మద్దతిచ్చాం
ఎక్కడైనా ఇదే మాట చెబుతాం: వెంకయ్య
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ పూర్తి మద్దతు ప్రకటించిందని, దీన్ని దాచుకోవాల్సిన అవసరం తమ పార్టీకి లేదని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వెంకయ్యనాయుడు తేల్చి చెప్పారు. తెలంగాణకు మద్దతిచ్చామన్న మాటను విశాఖపట్నం, విజయవాడలో కూడా చెప్పామని, ఇకపైనా చెబుతామని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పాటుపై తమకు అభ్యంతరం లేదని, అయితే రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ విభజించిన తీరునే తాము తప్పుపడుతున్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సీమాంధ్ర పర్యటన రంగు రంగుల ఖాళీ కుర్చీలతో కళకళలాడిందని ఎద్దేవా చేశారు.
వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామన్న భరోసా ఏమాత్రం లేని సోనియా.. గుంటూరు పర్యటనలో ప్రజలకు తాను భరోసా అంటూ హామీలిచ్చారని వ్యాఖ్యానించారు. మోడీ పర్యటన తర్వాత ఆయన పట్ల సీమాంధ్ర ప్రజలకు భరోసా ఏర్పడిందని, రేపటి ఎన్నికల్లో ప్రజలు దీన్ని నిరూపించబోతున్నారని వెంకయ్య అన్నారు. మోడీ గాలితో లోక్‌సభ ఎన్నికలు ఏకపక్షంగా కొనసాగుతాయని, అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమిస్పష్టమైన మెజార్టీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఒకే విధమైన రాజకీయ పార్టీలని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలనే రెండు పార్టీలు తమ గొప్పలుగా చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాయన్నారు. వైఎస్‌ఆర్ కాలంలో జరిగిన మంచి ద్వారా లబ్ధి పొందాలనుకునే వారు.. అప్పడు జరిగిన తప్పులకూ బాధ్యత వహించాలన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ లేనంతగా ఈసారి ఎన్నికల్లో విపరీతంగా డబ్బు, మద్యం పంపిణీ జరుగుతోందని వెంకయ్య అభిప్రాయపడ్డారు. ఇంత జరుగుతున్నా కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు చూస్తూ మిన్నకుంటోందని ఆయన ప్రశ్నించారు. బీజేపీ, టీడీపీ కూటమి అభ్యర్థులెవరూ అలాంటి పనులు చేయడం లేదన్నారు.