సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘వరుసగా పురపాలక, ప్రాదేశిక, పంచాయతీ ఎన్నికలు, ఆపై సాధారణ ఎన్నికలు.. ఈ సమయంలోనే పదో తరగతి పరీక్షలు. అటు పరీక్షల విధులు నిర్వహిస్తూ.. ఇటు ఎన్నికల విధులు, శిక్షణ తరగతులకు హాజరుకావడం ఉపాధ్యాయులకు కత్తిమీద సామే. అయినప్పటికీ ప్రత్యేక దృష్టిసారించి పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.సోమిరెడ్డి పేర్కొన్నారు. పదో తరగతి ఏర్పాట్లకు సంబంధించి సోమవారం డీఈఓ కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.
పరీక్షా కేంద్రాలు 427..
జిల్లాలో టెన్త్ పరీక్షలకు 427 కేంద్రాలు ఏర్పాటు చేశాం. వీటి పరిధిలో 1,804 ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు సంబంధించి 98,447 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఇందులో 82,405 మంది రెగ్యులర్, 16,042 మంది ప్రైవేటు విద్యార్థులున్నారు. ప్రతి కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ అధికారితోపాటు మొత్తంగా 4,992 మంది ఇన్విజిలేటర్లను నియమించాం.
ఏర్పాట్లు పూర్తి
పదో తరగతి పరీక్షలకు జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. జిల్లా వ్యాప్తంగా 20 ఫ్లైయింగ్ స్వ్కాడ్ బృందాలు, 40 సిట్టింగ్ స్వ్కాడ్ బృందాలు ఏర్పాటు చేశాం. గతంలో సిట్టింగ్ స్వ్కాడ్ బృందాలు 15 ఉండగా ఈసారి 40కి పెంచడంతో పరీక్షలు మరింత కట్టుదిట్టంగా జరుగుతాయని భావిస్తున్నాం. పరీక్షలకు కేటాయించిన సిబ్బంది తప్పకుండా గుర్తింపు కార్డులు పెట్టుకోవాలి.
ప్రతి కేంద్రంలో మౌలికవసతులు
పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా ఫర్నిచర్, విద్యుత్తు, తాగునీరు, శానిటేషన్ వసతులు కల్పించాం. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలవుతుంది. పరీక్ష ముగిసిన వెంటనే చీఫ్ సూపరింటెండెంట్లు జవాబుపత్రాలను పాలిథిన్ కవర్లు, కాటన్ బ్యాగులో సీల్ చేయాల్సి ఉంటుంది.
టీచర్లూ.. రాజకీయాలొద్దు..
ఎన్నికల పట్ల ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనొద్దు. ఎన్నికల ప్రచారంలో, బహిరంగ సభల్లో పాత్ర పోషించొద్దు. లిఖిత పూర్వక ఫిర్యాదులు, పూర్తిస్థాయి ఆధారాలతో ఫిర్యాదులొస్తే మాత్రం ఉపేక్షించేది లేదు. కఠిన చర్యలకు వెనకాడం.
విద్యార్థులూ.. ఆల్ ది బెస్ట్..
పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆల్ ది బెస్ట్. అన్ని పాఠశాలలకు ఇప్పటికే హాల్‌టిక్కెట్లు పంపిణీ చేశాం. పరీక్షా కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. పరీక్షా కేంద్రాన్ని ముందురోజే చూసుకుని, సమయం కంటే గంట ముందు కేంద్రానికి చేరితే సరిపోతుంది.
అవును.. మాకూ ‘పరీక్షే’!
Published Tue, Mar 25 2014 12:11 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement