జిల్లా పరిషత్ పీఠం మొదటిసారి బీసీ మహిళకు కేటాయించగా, రిజర్వేషన్‌కు అనుకూలంగా ఆయా పార్టీల నుంచి మహిళా నాయకులు రంగంలోకి దిగారు.
మరో మూడు రోజుల్లో జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో అందరి దృష్టి జిల్లా పరిషత్‌పైకి మళ్లింది. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి జెడ్పీపై జెండా ఎగురవేసేది ఎవరనే చర్చ సర్వత్రా సాగుతోంది. అయితే జెడ్పీ చైర్‌పర్సన్ సీటును దక్కించుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఈ నెల 13న జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు ప్రకటించనుండటంతో ఈ రెండు పార్టీలు ఇప్పటినుంచే వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.
- న్యూస్‌లైన్, కరీంనగర్ సిటీ
కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్ : జిల్లా పరిషత్ పీఠం మొదటిసారి బీసీ మహిళకు కేటాయించగా, రిజర్వేషన్‌కు అనుకూలంగా ఆయా పార్టీల నుంచి మహిళా నాయకులు రంగంలోకి దిగారు. టీఆర్‌ఎస్ తరఫున ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు తుల ఉమ కథలాపూర్ నుంచి, యువజన విభాగం నాయకుడు వీర్ల వెంకటేశ్వర్‌రావు సతీమణి వీర్ల కవిత రామడుగు నుంచి జెడ్పీటీసీగా పోటీ చేశారు. కాంగ్రెస్ పక్షాన మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణగౌడ్ సతీమణి కోడూరి సరోజన గంగాధర నుంచి, డాక్టర్ జేఎన్.వెంకట్ సతీమణి సునీత ఇబ్రహీంపట్నం నుంచి జెడ్పీటీసీ బరిలో నిలిచారు. వీరితోపాటు రెండు పార్టీల నుంచి మరికొందరు జెడ్పీ చైర్‌పర్సన్ కోసం తమ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో 57 జెడ్పీటీసీ స్థానాలకు ఏప్రిల్ 6, 11 తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు జరిగాయి. అన్ని స్థానాలకు కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలు అభ్యర్థులను పోటీలో నిలిపాయి. విజయావకాశాలపై రెండు పార్టీలు పైకి ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం కనిపించకపోవడంతో ఆందోళనలో పడ్డాయి. తమ పార్టీల నుంచి గెలిచిన అభ్యర్థులను కాపాడుకుంటూనే, ప్రత్యర్థి పార్టీలపై వల వేయడానికి చాపకింద నీరులా ప్రయత్నాలు ప్రారంభించాయి. సొంత పార్టీ సభ్యులు జారిపోకుండా విప్ జారీ చేయాలని ఆయా పార్టీలు నిర్ణయించాయి. విజయావకాశాలున్న బీజేపీ, సీపీఐ నాయకులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులతో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నేతలు టచ్‌లో ఉన్నట్టు సమాచారం.
ధనబలమే కీలకం..
జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఎన్నికల్లో ధన బలమే కీలకం కానుంది. పదవిని దక్కించుకునేందుకు ధనబలమున్న అభ్యర్థులవైపే ఆయా పార్టీలు మొగ్గుచూపుతున్నాయి. ఫలితాలు వెల్లడైన తర్వాత నుంచి ఎన్నిక జరిగేంత వరకు జెడ్పీటీసీ సభ్యులతో క్యాంప్‌ల నిర్వహించడం, ఎదుటి పార్టీ వాళ్లను తమవైపు తిప్పుకోవడం ఆషామాషీ కాదు. ఇది రూ.కోట్ల ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.
అందుకే ఎంత ఖర్చైనా భరించే వారికే చైర్‌పర్సన్ చాన్స్ ఇస్తామని ఆయా పార్టీల ముఖ్యనాయకులు సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. అందుకు తగినట్లుగానే అభ్యర్థులు సైతం ఎంతయినా ఖర్చు పెట్టేందుకు సిద్ధపడుతున్నట్టు సమాచారం. తమకు అవకాశం కల్పించాలని ఇప్పటికే ఆయా పార్టీ నేతల నుంచి హామీ తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. చైర్‌పర్సన్ పదవి ఆశిస్తున్న అభ్యర్థులు తమ పార్టీలపైనే మొత్తం భారం వేయకుండా సొంతంగా రంగంలోకి దిగారు. పార్టీ నేతల మద్దతు కూడగట్టడంతో పాటు ఇతర పార్టీల మద్దతు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
కొత్తగా ఎన్నికయ్యే ఎమ్మెల్యేలు, ఎంపీలు తెలంగాణ అపాయింటెండ్ డే అయిన జూన్ 2న తర్వాత ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మున్సిపల్ చైర్మన్, మేయర్ ఎన్నికల్లో వీరి ఓటు సైతం కీలకం. దీంతో అపాయింటెడ్ డే తర్వాతనే ఈ ఎన్నికలు జరిగే అవకాశమున్నట్టు తెలుస్తోంది. మండల పరిషత్, జిల్లా పరిషత్ అధ్యక్ష ఎన్నికలకు ఎమ్మెల్యే ఓటుతో సంబంధం లేకపోవడంతో ఈ రెండు ఎన్నికలను ఫలితాలు వెలువడిన వారం పది రోజుల్లోనే నిర్వహిస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో రాజకీయ పార్టీలన్నీ జెడ్పీ చైర్‌పర్సన్ సీటును ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి.