అసెంబ్లీ నియోజకవర్గం
ఆర్మూర్
ఎవరెన్నిసార్లు గెలిచారు:
సోషలిస్టు పార్టీ- 1, కాంగ్రెస్ - 8
టీడీపీ - 3, టీఆర్‌ఎస్ -1
ప్రస్తుత ఎమ్మెల్యే: ఏలేటి అన్నపూర్ణ (టీడీపీ)
రిజర్వేషన్: జనరల్
నియోజకవర్గ ప్రత్యేకతలు:
రాజకీయ చైతన్యం ఎక్కువ.
మైనార్టీలు, బీసీల ఓట్లు అధికం
ప్రస్తుతం బరిలో నిలిచింది: 11
ప్రధాన అభ్యర్థులు వీరే..
కె.ఆర్ సురేష్‌రెడ్డి (కాంగ్రెస్)
ఆశన్నగారి జీవన్‌రెడ్డి (టీఆర్‌ఎస్)
షేక్ మహబూబ్ (వైఎస్సార్ కాంగ్రెస్)
రాజారాం యాదవ్ (టీడీపీ)
గత వైభవం కోసం మాజీ స్పీకర్ కె.ఆర్.సురేష్‌రెడ్డి, విశ్వసనీయతను నిరూపించుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్, సత్తా చాటడం కోసం టీఆర్‌ఎస్, ఉనికిని కాపాడుకోవడానికి టీడీపీ.... ఇలా ఆర్మూర్‌లో హేమాహేమీలు తలపడుతున్నారు...బీసీ, మైనార్టీ ఓటర్లు అధికంగా గల ఈ సెగ్మెంట్‌లో పోటీ హోరాహోరీ సాగే అవకాశం ఉంది.
(కొండవీటి సురేష్ కుమార్, ఆర్మూర్ )
రాష్ట్ర రాజకీయాల్లో ఆర్మూర్ నియోజకవర్గానికి ప్రత్యేక చరిత్ర ఉంది. ఆర్మూర్ కేంద్రంగా రాజకీయాలు నిర్వహించిన నాయకులు రాష్ట్ర స్థాయిలో ఉన్నత పదవులు అధిరోహించారు. ప్రస్తుతం ఇక్కడ 11 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నా కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీల మధ్యనే ప్రధానంగా పోరు నెలకొంది.
ఓడిన చోటే సత్తా చాటాలని....
నాలుగుసార్లు వరుసగా గెలుపొందిన శాసనసభ మాజీ స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డి గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో ఓడిన చోటే గెలవాలనే పట్టుదలతో ఆర్మూ ర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. అయితే నియోజకవర్గ అభివృద్ధిని పట్టించు కోకపోవడం ఆయనకు ప్రతికూల అంశంగా మారింది.
తొలి అభ్యర్థి..తొలి విజయం కోసం...
ఆశన్నగారి జీవన్‌రెడ్డిని ఏడాది క్రితమే టీఆర్‌ఎస్ ఆర్మూరు నియోజకవర్గ అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో మొదటి విజయం కూడా తనదే కావాలన్న లక్ష్యంతో జీవన్‌రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. టీఆర్‌ఎస్‌తో కలిసి రావాలని తెలంగాణ వాదులను కోరుతున్నారు.
విశ్వసనీయతకు పట్టం కట్టాలి..
వైఎస్సార్ అమలుచేసిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన అభ్యర్థి షేక్ మహబూబ్ ధీమాతో ఉన్నారు. ప్రచారంలో దూసుకుపోతూ ప్రధాన పార్టీ అభ్యర్థులకు గట్టి పోటీనిస్తున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడే కుటుంబాన్ని ఆదరించాలని కోరుతున్నారు.
ఉనికి కోసం టీడీపీ....
టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఏలేటి అన్నపూర్ణ పోటీ నుంచి తప్పుకొని తన తనయుడు ఏలేటి మల్లికార్జున్ రెడ్డికి బాల్కొండ నుంచి టీడీపీ టికెట్ సాధించుకొంది. దీంతో బాల్కొండ నుంచి బీసీకి టికెట్ ఇస్తానంటూ చంద్రబాబు నాయుడు టీడీపీలో చేర్చుకొన్న ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ జేఏసీ నాయకుడు రాజారాం యాదవ్‌కు ఆర్మూర్ టికెట్ కేటాయించారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం తప్ప ఆర్మూర్ నియోజకవర్గంలోని రాజకీయాలతో పెద్దగా సంబంధం లేని రాజారాం యాదవ్ ఇప్పటికే పార్టీలో ఉన్న నాయకులపై ఆధారపడి టీడీపీ గురించి ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలంగాణ కోసం జరుగుతున్న ఎన్నికల్లో తమ పార్టీకి ప్రతికూల పరిస్థితులే అని తెలిసినా టీడీపీ ఉనికిని కాపాడుకోవడమే లక్ష్యంగా రాజారాం యాదవ్ ముందుకు వెళ్తున్నారు.
ఆర్మూరును ఆదర్శంగా తీర్చిదిద్దుతా
వ్యవసాయాధారిత పరిశ్రమలు నెలకొల్పుతా
విద్య, ఉపాధి అవకాశాలు కల్పిస్తా
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి పట్టణ ప్రజలకు తాగునీటిని అందిస్తా.
- కేఆర్ సురేశ్‌రెడ్డి
ముంపు బాధితులకు నష్టపరిహారం అందేలా చూస్తా
ఉచిత విద్యుత్ కొనసాగిస్తా
నందిపేటలో ఆర్టీసీ డిపో ఏర్పాటుకు కృషి చేస్తా
ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రిని అభి వృద్ధి చేస్తా.
-షేక్ మహబూబ్
ఎర్రజొన్న రైతులకు బకాయిలు ఇప్పిస్తా
లక్కంపల్లి సెజ్ భూములను రైతులకు తిరిగి అప్పగించేలా చూస్తాను
తాగునీటి పరిష్కారానికి శాశ్వత పరిష్కారమైన ఎత్తిపోతలను పూర్తి చేయిస్తా
-ఆశన్నగారి జీవన్‌రెడ్డి
పసుపు కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటుకు కృషి
గల్ఫ్, బీడీకార్మికుల సమస్యలను పరిష్కరిస్తా
నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు తాగు, సాగునీరందేలా పథకాలు అమలుచేయిస్తా
వ్యవసాయాధారిత పరిశ్రమలు ఏర్పాటుకుచర్యలు తీసుకుంటా
-రాజారాం యాదవ్