
అసెంబ్లీలో అతివలు
ఆకాశంలో సగం అని చెప్పుకుంటున్నా... చట్టసభల్లో అతివల స్థానం చాలా స్వల్పంగా ఉంటోంది. 1952 నుంచి ఈ 62 ఏళ్లలో జిల్లా నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టిన అతివలు కేవలం 12 మందే కావడం గమనార్హం. వారిలో ఎక్కువ మంది తండ్రి, లేదా భర్త నుంచి రాజకీయ వారసత్వంగా వచ్చినవారే. అయితే వారసత్వంగా వచ్చినా తమదైన శైలిలో రాణించి నియోజకవర్గానికి, జిల్లాకు కూడా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చినవారూ ఉన్నారు. ఏ వారసత్వం లేకపోయినా స్వీయప్రతిభతో రాణించి ఎమ్మెల్యేగా పోటీచేసి విజయం సాధించిన వారూ ఉన్నారు. జిల్లాలో పురుషుల కన్నా మహిళల ఓట్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు మహిళలకు మరిన్ని స్థానాల్లో టికెట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది.
- సాక్షి ఎలక్షన్ డెస్క్, గుంటూరు
జిల్లాలో గతంలో 19 నియోజకవర్గాలు ఉండేవి. 2008లో నియోజకవర్గాల పునర్విభజన అనంతరం రెండు స్థానాలు తగ్గి ప్రస్తుతం 17 అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. 1952లో జరిగిన తొలి ఎన్నికలలో ఒకే ఒక మహిళ విజయం సాధించి మద్రాసు-ఆంధ్ర సంయుక్త రాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టారు. కృష్ణాజిల్లా పామర్రుకు చెందిన తమ్మా కోటమ్మారెడ్డి గుంటూరు హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తూ ఇక్కడ స్ధిరపడ్డారు. ఆమె ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1955. 1962 ఎన్నికలలో జిల్లా నుంచి ఒక్క మహిళ కూడా అసెంబ్లీలో అడుగుపెట్టలేదు. 1967 ఎన్నికలలో తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని తెనాలి నుంచి ఆలపాటి వెంకట్రామయ్య కుమార్తె దొడ్డపనేని ఇందిర గెలుపొందారు. అనంతరం 1972, 1978 ఎన్నికలలో కూడా వరుసగా మూడు సార్లు విజయం సాధించి తిరుగులేని మహిళా నేతగా జిల్లాలో తనదైన ముద్ర వేశారు. 1967 ఎన్నికలలోనే గుంటూరు-1 నుంచి శనక్కాయల అంకమ్మ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1972 ఎన్నికలలో పెదకూరపాడు నియోజకవర్గం నుంచి షేక్ ఫాతిమున్నీసా బేగం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. 1983 ఎన్నికలలో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్నపనేని రాజకుమారి విజయం సాధించారు.
1985 ఎన్నికలలో కూచినపూడి నుంచి ఈపూరి సీతారావమ్మ తన భర్త ఈపూరి సుబ్బారావు వారసురాలిగా టీడీపీ టిక్కెట్‌పై పోటీచేసి గెలుపొందారు. ఆ తర్వాత 1989, 1994 ఎన్నికల్లోనూ వరుసగా గెలుపొందారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు.1989 ఎన్నికలలో చిలకలూరిపేట నుంచి డాక్టర్ కందిమళ్ళ జయమ్మ తన తండ్రి కందిమళ్ళ అప్పారావు వారసత్వాన్ని అందిపుచ్చుకుని టీడీపీ టిక్కెట్‌పై పోటీచేసి విజయం సాధించారు. అదే ఎన్నికల్లో వినుకొండ నుంచి నన్నపనేని రాజకుమారి గెలుపొందారు. 1994 ఎన్నికలలో సత్తెనపల్లి నుంచి సీపీఎం తరఫున పుతుంబాక భారతి తన భర్త పుతుంబాక వెంకటపతి వారసురాలిగా రాజకీయాల్లో ప్రవేశించి ఎమ్మెల్యేగా గెలుపొందారు.1999 ఎన్నికలలో గుంటూరు-2 నుంచి శనక్కాయల అరుణ, తెనాలి నుంచి డాక్టర్ గోగినేని ఉమ, మాచర్ల నుంచి జూలకంటి దుర్గాంబ ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి మేకతోటి సుచరిత, మంగళగిరి నుంచి కాండ్రు కమల ఎన్నికయ్యారు.
రెండుసార్లు ముగ్గురేసి...
జిల్లా నుంచి 1989 ఎన్నికల్లోనూ, 1999 ఎన్నికల్లోనూ ముగ్గురేసి చొప్పున మహిళలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 1989లో నన్నపనేని రాజకుమారి వినుకొండ నుంచి కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీచేసి గెలుపొందగా, తెలుగుదేశం పార్టీ తరఫున చిలకలూరిపేట నుంచి డాక్టర్ కందిమళ్ళ జయమ్మ, కూచినపూడి నుంచి ఈపూరి సీతారావమ్మ విజయం సాధించారు. 1999 ఎన్నికల్లో గెలుపొందిన ముగ్గురూ తెలుగుదేశం పార్టీ వారే కావడం గమనార్హం. గుంటూరు-2 నుంచి శనక్కాయల అరుణ, తెనాలి నుంచి డాక్టర్ గోగినేని ఉమ, మాచర్ల నుంచి జూలకంటి దుర్గాంబ వీరిలో ఉన్నారు. 1967,1972,1994, 2009 ఎన్నికల్లో ఇద్దరు చొప్పున మహిళలు గెలుపొందారు. 1952,1978,1983,1985లో ఒక్కొక్కరు చొప్పున గెలుపొందారు. కాగా 1955,1962,2004 ఎన్నికల్లో జిల్లా నుంచి మహిళా శాసనసభ్యులు ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం.
పార్లమెంటుకు...
పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించి తెనాలి నుంచి సినీనటి తాడిపర్తి శారద 1994లో ఎంపీగా గెలుపొందారు. బాపట్ల నుంచి 2004లో దగ్గుబాటి పురందేశ్వరి, 2009లో పనబాక లక్ష్మి గెలుపొంది కేంద్రంలో మంత్రులుగా పనిచేశారు.
ఈసారి ముగ్గురికి టిక్కెట్లిచ్చిన వైఎస్సార్‌సీపీ...
జిల్లాలోని 17 నియోజకవర్గాల్లో మహిళలకు 30 శాతం చొప్పున కనీసం ఐదు సీట్లు కేటాయించవలసి ఉంది. అయితే మిగతా పార్టీల కంటే ఎక్కువగా 2009లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ముగ్గురు మహిళలకు టిక్కెట్లిచ్చారు. వారిలో ఇద్దరు గెలుపొందారు. తండ్రి బాటలోనే ఈసారి ఎన్నికలలో వైఎస్ జగన్‌మోహనరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున ముగ్గురు మహిళలకు టిక్కెట్లిచ్చారు. ప్రత్తిపాడులో మేకతోటి సుచరిత, తాడికొండలో హెచ్.క్రిస్టినా, వినుకొండలో డాక్టర్ నన్నపనేని సుధ పార్టీ అభ్యర్థులుగా పోటీచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కాండ్రు కమలకు మళ్లీ టిక్కెట్ ఇవ్వగా ఆమె పోటీకి విముఖత చూపారు. తెలుగుదేశం పార్టీ ఒక్క మహిళకు కూడా టిక్కెట్ ఇవ్వకపోవడం గమనార్హం.