జగన్ జోష్..!
సాక్షి, గుంటూరు :గుంటూరు నగరం జన సంద్రమైంది. రహదారులన్నీ జనదిగ్బంధమయ్యాయి. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం గుంటూరు వచ్చిన జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అభిమానులు బ్రహ్మరథం పట్టారు. వైఎస్సార్ జనభేరి ర థంపై తరలి వస్తున్న ఆత్మీయ నేతకు అడుగడుగున అఖండ స్వాగతం లభించింది. తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో నిర్వహించిన వైఎస్సార్ జనభేరి ప్రచారంలో రాజన్న బిడ్డను చూసేందుకు రోడ్లవెంట బారులు తీరారు. తాడేపల్లి, మంగళగిరి మీదుగా చిలకలూరిపేట బైపాస్ రోడ్డు నుంచి మంగళవారం సాయంత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు చేరుకున్నారు. అశేష జనవాహిని ఎదురేగి పూలజల్లులతో అఖండ స్వాగతం పలికారు. పార్టీ గుంటూరు పార్లమెంటు అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, గుంటూరు పశ్చిమ, తూర్పు అసెంబ్లీ అభ్యర్థులు లేళ్ల అప్పిరెడ్డి, మొహమ్మద్ ముస్తఫాలు ఆయనకు ఎదురేగి స్వాగతం పలికారు. న ల్లచెరువు నుంచి జనభేరి రథంపై జగన్ రోడ్ షో ప్రారంభించారు.
చిన్నారులకు ఆశీర్వాదం..
నల్లచెరువు జెండాచెట్టు ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉన్న ముస్లిం మహిళలను చూసి తన వాహనం దిగి వచ్చిన జగన్ వారితో కొంతసేపు మాట్లాడారు. వారు చూపిస్తున్న అభిమానాన్ని చూసి పరవశించిన జగన్ పేరు పేరున వారిని పలక రించారు. తనకోసం ఎదురు చూస్తున్న ప్రజలకు అభివాదం చేసుకుంటూ ఆంజనేయస్వామి గుడి సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడ కొద్దిసేపు వాహనాన్ని నిలిపి రోడ్డుకు ఇరువైపులా, డాబాలపై నుంచి ఉన్న మహిళలు, వృద్ధులు, చెట్లపైకి ఎక్కి ఉత్సాహంగా చూస్తున్న యువకులకు అభివాదం చేశారు. మార్గంమధ్యలో, చంటిబిడ్డలను ఆశీర్వదించమంటూ అనేక మంది తల్లులు జగన్ కాన్వాయ్ పైకి తమ చిన్నారులను అందించారు. ఆయన వారిని ఆప్యాయంగా ముద్దాడి హృదయపూర్వకంగా ఆశీర్వదించారు. అక్కడి నుంచి శ్రీనివాసరావుతోటకు చేరుకున్న జగన్‌కు రోడ్లపైకి చేరిన మహిళలు రాజన్న బిడ్డ తమ ఆత్మీయ సోదరుడు వస్తున్నాడని హారతులిచ్చారు. లంబాడి మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి ఫ్యాను గుర్తుకే తమ ఓటు అంటూ ఉత్సాహంగా నృత్యాలు చేశారు.
చుట్టుగుంటలో జగన్నినాదాల హోరు..
సంపత్‌నగర్‌కు చేరుకున్న జగన్‌కు జన ప్రభంజనం ఎదురేగి ఘనస్వాగతం పలికింది. తెలుగుతల్లి విగ్రహం వద్ద యువకులు జగన్ నినాదాలతో హోరెత్తించారు. అక్కడి నుంచి 60 అడుగుల రోడ్డు మీదుగా రోడ్‌షో జీటీరోడ్డుకు చేరింది. మెడికల్‌క్లబ్ మీదుగా చుట్టుగుంట సెంటర్‌కు చేరుకున్న జగన్ కాన్వాయ్‌కు అడుగడుగునా హారతులు పట్టారు. ఏటీఅగ్రహారంలో రోడ్‌షోగా బయలుదేరిన జగన్‌కు అడుగడుగున ప్రజలు నీరాజనం పలికారు. రోడ్డు పొడవునా మహిళలు, చిన్నారులు, యువకులు, వృద్ధులు బారులు తీరి రాజన్న బిడ్డకే తమ మద్దతు అంటూ ముక్తకంఠంతో నినదించారు. కంకరగుంట బ్రిడ్జి నుంచి నగరంపాలెం చేరుకున్న జగన్‌కు జనం జేజేలు పలికారు. ప్రచార రథాన్ని అనుసరిస్తూ ముందుకు సాగారు. హిందూ కళాశాల కూడలికి కాన్వాయ్ చేరుకోగానే అప్పటికే రోడ్లపైకి చేరిన అశేష జనవాహిని జగన్ నినాదాలతో హోరె త్తించింది. తనపై జనం చూపుతున్న అభిమానానికి పరవశించిన జగన్ అందరికి అభివాదాలు చేస్తూ ముందుకు సాగారు.
తూర్పులో జనప్రవాహం
మార్కెట్ సెంటర్ మీదుగా రోడ్ షో తూర్పు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. పార్టీ తూర్పు అభ్యర్థి మొహమ్మద్ ముస్తఫా అశేష జనవాహినితో జననేతకు ఎదురేగి అఖండ స్వాగతం పలికారు. జిన్నాటవర్ చేరుకున్న రోడ్‌షోకు అపూర్వ స్వాగతం లభించింది. చందన బ్రదర్స్ సెంటర్‌లో వేచి ఉన్న జనవాహనిని ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. త్వరలో రానున్న రాజన్న రాజ్యంలో తాను మొట్టమొదటిగా చేయబోయే ఐదు సంతకాల గురించి ప్రజలకు వివరించారు. గుంటూరు పార్లమెంటు అభ్యర్థి బాలశౌరి, తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల అభ్యర్థులు ముస్తఫా, అప్పిరెడ్డిలను ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆయన పిలుపునకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో రాత్రి 10 గంటలు కావస్తుండటంతో ప్రసంగాన్ని ముగించిన జగన్ ప్రచార రథం దిగి వాహనం ఎక్కారు. విజయవాడ వైపు వెళ్తున్న జగన్‌ను మంగళదాస్‌నగర్ వద్ద పార్టీ కార్యకర్తలు, నాయకులు అక్కడ ఉన్న కాళికాలయంలో కొబ్బరి కాయ కొట్టి వెళ్లాలని కోరారు. కోడ్ అమలులో ఉన్నందున ఆగకూడదని చెబుతూ చిరునవ్వుతో అభివాదం చేస్తూ ముందుకు సాగారు. రోడ్‌షోలో పార్టీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ కావటి మనోహర్‌నాయుడు, పార్టీ నాయకులు కిలారి రోశయ్య, షేక్ షౌకత్, నసీర్ అహ్మద్, గులాం రసూల్, యేటిగడ్డ నరసింహారెడ్డి, నూనె ఉమామహేశ్వరరెడ్డి, రాతంశెట్టి రామాంజనేయులు, ఆళ్ళ శ్రీనివాసరెడ్డి, అంగడి శ్రీనివాసరావు, మద్దుల రాజాయాదవ్ తదితరులు పాల్గొన్నారు.