మళ్లీ ఎల్లో శివాలు
అమెరికాలో కేవీపీపై కేసు పేరుతో వైఎస్ కుటుంబంపై విషం
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలకింకా నెల రోజులే ఉంది. ఎల్లో మీడియా ‘పతాక శీర్షికల’తో శివాలెత్తుతోంది. గత ఎన్నికల్లోనూ పలుమార్లు ఇలాగే చేసి భంగపడిన ఎల్లో చానళ్లు, పేపర్లు కలిసికట్టుగా మళ్లీ వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుటుంబంపై విషం కక్కటం మొదలుపెట్టాయి. ఇండియాలో టైటానియం తవ్వకాల కోసం ఉక్రెయిన్‌కు చెందిన గ్యాస్ వ్యాపారి డిమిట్రీ ఫిర్టాష్ ముడుపులు చెల్లించారనే అంశ ంపై అమెరికాలోని షికాగోలో అభియోగాలు నమోదు చేశారని.. అందులో కాంగ్రెస్ ఎంపీ కె.వి.పి.రామచంద్రరావు పేరు ఉందని.. వైఎస్ హయాంలోనే ఈ కుంభకోణం చోటుచేసుకుందని ‘ఈనాడు’, దాని తోకపత్రిక గురువారం పతాక శీర్షికలతో చెలరేగిపోయాయి. వ్యూహంలో భాగంగానే అన్నట్లు.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. ఈ ఆరోపణలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి ముడిపెడుతూ ఆరోపణలు గుప్పించేశారు.
ఆ ఫిర్యాదులో వై.ఎస్.రాజశేఖరరెడ్డి దగ్గరి బంధువు అని ఉందని.. అది జగనే కావచ్చంటూ బాబు సందేహించటం, దాన్ని ఎల్లో చానళ్లు బీభత్సంగా ప్రసారం చేయటం అన్నీ చకచకా జరిగిపోయాయి. రాబోయే రోజుల్లో మరిన్ని రకాలుగా వైఎస్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే వ్యూహాలకు సైతం ఎల్లో సిండికేట్ పదును పెడుతున్నట్లు సమాచారం. ఎల్లో మీడియా తాజా కథనాలపై రాజ్యసభ సభ్యుడు కేవీపీ స్పందిస్తూ.. అమెరికా జస్టిస్ డిపార్టుమెంటు చేసిన ఆరోపణలుగా చెప్తున్న ఆ వార్తల్లో నిజానిజాలేమిటో తనకు తెలియదన్నారు. దీనికి సంబంధించి అమెరికా జస్టిస్ డిపార్టుమెంటు నుంచి కానీ, ఆ దేశానికి చెందిన మరేదైనా చట్ట సంస్థ నుంచి కానీ తనకు ఎలాంటి వివరాలు కానీ, అభియోగాలు మోపుతున్నట్లు సమాచారం కానీ అందలేదని చెప్పారు.
ఎలాంటి అధికారిక పత్రమైనా ఉందా?
ఏఎన్‌ఐ వార్తా సంస్థ గురువారం ఢిల్లీలో కేవీపీని కలిసి.. ఆరోపణలపై స్పందన కోరగా.. ‘‘అభియోగాలేమిటి? ఆరోపణలు ఏమిటి? ఆ ఆరోపణలకు సంబంధించిన ఎలాంటి అధికారిక పత్రమైనా ఉందా? అది కేవలం ఒక వార్తా కథనం. అది ఏదైనా కావచ్చు. దీనిపై నేనేం స్పందిస్తాను? అమెరికన్ జస్టిస్ డిపార్టుమెంటు వాళ్లు చేసినట్లుగా చెప్తున్న ఈ ఆరోపణలకు సంబంధించి ఆ సంస్థ కానీ, మరేదైనా అమెరికా దర్యాప్తు సంస్థ కానీ ఏదైనా చెప్తే.. దానిపై నేను స్పందిస్తాను. దీని గురించి నాకు ఏ వివరాలు ఇచ్చినా.. వివరాలు అందగానే నా అభిప్రాయం చెప్తాను’’ అని ఆయన బదులిచ్చారు. ‘మీపై వచ్చిన ఆరోపణలు ఎన్నికల నేపధ్యంలో జరిగిన కుట్రగా భావిస్తున్నారా?’ అని ప్రశ్నించగా.. ఈ వ్యవహారానికి సంబంధించి తనకు ఏ విషయమూ తెలియకుండా దీనిపై తాను ఏదైనా మాట్లాడటం సరికాదని బదులిచ్చారు.