
లండన్ టు ఆత్మకూరు
విద్యావంతులు, యువత రాజకీయాల్లోకి వస్తేనే వాటిలో కుళ్లును కడిగేయొచ్చన్న విషయాన్ని ఆమె నమ్మింది. అందుకే ఖండాంతరాలు దాటి వచ్చింది. ఉన్నత ఉద్యోగాన్ని వదిలి సొంతూరి బాట పట్టింది. వరంగల్ జిల్లా ఆత్మకూరు జడ్పీటీసీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసింది. ఆత్మకూరు మండలం ముస్త్యాలపల్లికి చెందిన సిలువేరు జ్యోత్స్నారాణి దళిత కుటుంబంలో జన్మించింది.ఇంటర్, డిగ్రీ ఇక్కడే చదివి, రెండేళ్ల క్రితం యూకే వెళ్ళి ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ పూర్తి చేసింది. అనంతరం అక్కడే ఓ కంపెనీలో మంచి ఉద్యోగంలో స్థిరపడింది. ఆరు నెలల క్రితం ఇంటికొచ్చిన ఆమె ఆత్మకూరు మండల జడ్పీటీసీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసింది.
ఎందుకు ఈ ఆలోచన వచ్చిందని ఆమెను ‘న్యూస్‌లైన్’ ప్రశ్నించగా... ‘పత్రికలు, టీవీల్లో వార్తలను చూసిన ప్రతిసారీ భారతదేశం స్వార్థపూరిత రాజకీయాలతో వెనుకబడిపోతోందని ఆవేదన కలిగేది. ఆరు నెలల క్రితం ఇంటికి ఫోన్ చేస్తే త్వరలోనే మన జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయని చెప్పారు. ప్రజలకు సేవచేయాలంటే ప్రజాప్రతినిధి అయితేనే సాధ్యమని అందరూ అన్నారు. వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసి సొంతూరికి వచ్చాను.ఆరు నెలల నుంచి మా ఊరు, మండలంలోని ఇతర ప్రాంతాల పరిస్థితులను గమనించాను. దళితులంటే కొన్ని చోట్ల ఇప్పటికీ వివక్ష, చిన్న చూపు ఉంది. వాటిని రూపుమాపాలంటే విద్యావంతులు ముందుకు రావాలని... విద్యావంతులైన యువతతోనే అభివృద్ధి సాధ్యమనే సంకల్పంతో రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాను. మా నాన్న భాస్కర్ స్ఫూర్తితో జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన’ అని చెప్పారు.