దండగ కాదు.. పండగ | ys rajashekar reddy government is farmer Electric charges free | Sakshi
Sakshi News home page

దండగ కాదు.. పండగ

Published Thu, Apr 24 2014 11:57 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

దండగ కాదు.. పండగ - Sakshi

దండగ కాదు.. పండగ

పదేళ్ల క్రితం వరకూ రాష్ట్రాన్ని ఏలిన చంద్రబాబు వ్యవసాయం దండగ న్నారు. రైతులందర్నీ కాడివదిలేసి.. పట్టణాలకు పోయి కూలి పనులు చేసుకోమన్నారు. విత్తనాలు అడిగితే తూటాల వర్షం కురిపించారు. చార్జీలు తగ్గించమంటే లాఠీచార్జిలు చేయించారు. కరెంటు బిల్లులు కట్టలేం మహాప్రభో అంటే.. జైల్లో పెట్టిస్తానని భయపెట్టారు. ఉండ్రాజవరం మండలం కాల్ధరిలో కాల్పులు జరిపించి రైతుల అసువుయించారు. ఇలాంటి అవమానాలను తట్టుకోలేక అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడ్డారు. వారిని ఆదుకోవాల్సింది పోయిన ప్రభుత్వం ఇచ్చే డబ్బుల కోసమే వాళ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని హేళన చేశారు. అలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజాప్రస్థానం పాదయూత్ర చేసిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రైతుల కడగండ్లను కళ్లారా చూశారు. త్వరలోనే మంచి రోజులొస్తాయని అభయమిచ్చారు. అధికారంలోకి రాగానే ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేశారు. విద్యుత్ బకాయిలు, రుణాలు మాఫీ చేశారు. కొత్త రుణాలు ఇప్పించారు. జలయజ్ఞం చేపట్టి పొలాల్లోకి నీళొచ్చేలా చేశారు. వ్యవసాయూన్ని పండగలా మార్చారు. ఆయన మరణానంతరం అన్నదాతలకు మళ్లీ కష్టాలు దాపురించాయి. వైఎస్ రాజశేఖరరెడ్డిలా ఆదుకునే ఆపన్నహస్తం కోసం వారంతా ఎదురు చూస్తున్నారు.
 
 
 సాక్షి, ఏలూరు :ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన ఒక్క సంతకం రైతులను విద్యుత్ చార్జీల నుంచి విముక్తుల్ని చేసింది. లక్షలాది రైతుల కుటుంబాల్లో వెలుగులు నింపింది. వ్యవసాయానికి రోజుకి 7 గంటల పాటు ఉచిత విద్యుత్ అందించడంతో పాటు అప్పటివరకూ ఉన్న విద్యుత్ బకాయిలను వైఎస్ రద్దుచేశారు. ఆయన మన జిల్లాకు వచ్చినప్పుడు తత్కాల్ సర్వీసులు పొందిన వారు తమకూ ఉచిత విద్యుత్ అందించమని అడగ్గా.. వారికీ ఆ పథకాన్ని వర్తింపజేస్తూ అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు హయాంలో విద్యుత్ బిల్లులు కట్టలేక కష్టాల్లో ఉన్న రైతన్నలకు వైఎస్ ఇచ్చిన ఉచిత విద్యు త్ వరం వ్యవసాయాన్ని పండగలా మార్చింది. 
 
 రోశయ్య.. కిరణ్ ప్రభుత్వాలూ చంద్రబాబు బాటలోనే...
 పూర్వ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వ్యవసాయ విద్యుత్‌పై హార్స్‌పవర్‌కు రూ.50 వసూలు చేసేవారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే దానిని రద్దుచేసి వ్యవసాయ విద్యుత్ చార్జీలు పెంచేశారు. వైఎస్ మరణం రోశ య్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాలు సైతం చంద్రబాబు బాటలోనే నడిచాయి. ఉచిత విద్యుత్ వరాన్ని వెనక్కు లాగేసుకోవడానికి శతవిధాలా ప్రయత్నించాయి. వ్యవసాయ విద్యుత్‌కు నగదు బదిలీ పథకాన్ని అమలు చేయాలని ప్రపం చ బ్యాంకు చేసిన సూచనలకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ప్రభుత్వం స్పందించింది. ఫలితంగా వ్యవసాయ విద్యుత్ వినియోగాన్ని లెక్కించేందుకు ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద మీటర్లు బిగించే పని మొదలైంది. ఇది పూర్తయితే వినియోగించిన యూనిట్ల మొత్తానికి రైతులు బిల్లు చెల్లించాలి. తర్వాత సబ్సిడీ సొమ్మును వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారు. అయితే నిర్ణీత యూనిట్లకు మాత్ర మే నగదు బదిలీ వర్తింపజేసి మిగిలిన యూనిట్లకు రైతుల నుంచి చార్జీలు వసూలు చేస్తారు. 
 
 వైఎస్సార్ హయాంలో కొత్త సర్వీసులు
 ప్రస్తుతం జిల్లాలో 86,978 వ్యవసాయ విద్యుత్ సర్వీసులు ఉన్నాయి. వీటిలో 79,168 సర్వీసులు ఉచిత విద్యుత్ కేటగిరీలో ఉన్నాయి. 1995కు ముందు 43,949 సర్వీసులు మాత్రమే ఉండేవి. గడచిన 19 ఏళ్లలో 43,029 సర్వీసులు మంజూరు చేశారు. వాటిలో టీడీపీ అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లలో 11,553 సర్వీసులు ఇస్తే వైఎస్ అధికారంలో ఉన్న ఐదున్నరేళ్లలో సుమారు 20 వేలకు పైగా సర్వీసులు ఇచ్చారు. ఆ తర్వాత రోశయ్య, అనంతరం కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రులయ్యారు. వారి హయాంలో మంజూరు చేసిన కొత్త విద్యుత్ కనెక్షన్లలో దాదాపు 7వేల సర్వీసుల నుంచి చార్జీలు వసూలు చేస్తున్నారు. ఉచిత విద్యుత్ కేటగిరీలో విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయడం తగ్గించేశారు. 
 
 వారిద్దరి హయూంలోనూ వేధింపులు
 మరోవైపు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు రోజుకు 7గంటల సరఫరాను అటకెక్కించారు. సగటున 4 గంటలు మాత్రమే అతికష్టం మీద విద్యుత్ సరఫరా అవుతోంది. 2009 నుంచి సర్వీస్ చార్జీలను చెల్లించాలంటూ గతేడాది రైతులను వేధిం చారు. నిజానికి దీనిని ప్రభుత్వమే భరించాలి. కానీ.. రైతుల నుంచే ఆ మొత్తాల్ని రాబట్టుకోవాలని డిస్కంలకు ప్రభుత్వం తేల్చిచెప్పేసింది. ఉచిత విద్యుత్  సర్వీస్ చార్జీని నెలకు రూ.20నుంచి రూ.30 పెంచింది. పొలం ఎక్కువ ఉందని, కనెక్షన్లు పరిమితికి మించి ఉన్నాయని కుంటిసాకులు చూపి జిల్లాలో దాదాపు 2,033 ఉచిత విద్యుత్ సర్వీసులను తొలగించారు. 
 
 వైఎస్ ఆదుకున్నారు
 ‘నేను 12ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాను. 2004కు ముందు రాష్ట్రాన్ని చంద్రబాబు పాలించిన కాలంలో నా పొలంలో మూడు మోటార్లు పనిచేసేవి. ఒక్కో మోటారుకు అప్పట్లో 5 హార్స్‌పవర్ వరకు 50 రూపాయలు, ఆపైన ప్రతి హార్స్‌పవర్‌కు నెలకు 100 రూపాయలు చెల్లించేవాడిని. వర్షాలు లేక కరువు పరిస్థితులొచ్చారుు. వ్యవసాయం సాగేది కాదు. బిల్లులు కట్టమని అధికారుల ఒత్తిడి చేసేవారు. మూడు మోటార్లకు నెలకు రూ.2 వేల వరకు కట్టాల్సి వచ్చేది. బిల్లులు కట్టలేక విద్యుత్ శాఖకు బకాయిపడ్డాను. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తొలి సంతకం ఉచిత విద్యుత్‌పై పెట్టడంతో 15 వేల రూపాయల బకాయిలు రద్దయ్యాయి. వ్యవసాయం గాడిలో పడింది. ఇద్దరు ఆడ పిల్లల పెళ్లిళ్లు చేశాను. మరో ఆడపిల్ల పెళ్లి చేయాల్సి ఉంది. ఆ మహానుభావుడు చనిపోయాక సర్వీస్ చార్జీల పేరుతో మోటారుకు 30 రూపాయలు వసూలు చేస్తున్నారు. విద్యుత్ మాత్రం ఇస్తానన్న 7 గంటలు ఇవ్వడం లేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి బతికున్నంత కాలం ఇచ్చిన మాట ప్రకారం 7 గంటలు ఉచిత విద్యుత్ అందించి మమ్మల్ని ఆదుకున్నారు. ఆ రోజులు మాకు మళ్లీ రావాలి. వ్యవసాయం పండగలా మారాలి.
 - కోలా వెంకటేశ్వరరావు, కాంతంపాలెం, చింతలపూడి మండలం
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement