జన కెరటం
సాక్షి, గుంటూరు :సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి, మహానేత తనయ షర్మిల జిల్లాలో నిర్వహిస్తున్న జనభేరి గురువారం పెదకూరపాడు, తాడికొండ, పొన్నూరు నియోజకవర్గాల్లో సాగింది. రెండు రోజుల షర్మిల పర్యటనకు జిల్లా ప్రజలు నీరాజనం పలికారు. గురజాల నియోజకవర్గం దాచేపల్లిలోని బస కేంద్రం నుంచి గురువారం ఉదయం బయలుదేరిన షర్మిల జనభేరి రథం పిడుగురాళ్ళ మీదుగా పెదకూరపాడు నియోజకవర్గంలోని బెల్లంకొండ అడ్డరోడ్డుకు చేరుకోగానే ఆమె కోసం ఎదురు చూస్తున్న జనం అపూర్వ స్వాగతం పలికారు.
జగన్‌ను ఎదుర్కొనే సత్తా లేకే బాబు పాట్లు..
అక్కడి నుంచి అనంతవరం మీదుగా క్రోసూరు చేరుకున్న షర్మిలకు నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థి ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి, పెదకూరపాడు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడులు స్వాగతం పలికారు. క్రోసూరు కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కోలేక చంద్రబాబు బీజేపీతో పొత్తుపెట్టుకుని మోడీ, వెంకయ్యనాయుడు, పవన్ కళ్యాణ్‌లతో కలిసి ఎన్నికల్లోకి వస్తున్నారని విమర్శించారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా జగన ప్రభంజనాన్ని అడ్డుకోలేరని చెప్పగా అభిమానులు హర్షధ్వానాలు చేశారు. ఆమె మాటలు విన్న ప్రజల మోములో జగనన్న ముఖ్యమంత్రి కాబోతున్నారని, తమ జీవితాలు బాగుపడతాయన్న ఆశ, ఆకాంక్ష కనిపించింది. అక్కడి నుంచి ఆమె విప్పర్ల, ఉటూరుకూరు గ్రామాల మీదుగా అమరావతి మండలం జూపూడి గ్రామంలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న బస కేంద్రానికి చేరుకున్నారు.
తాడికొండలో బైక్ ర్యాలీతో స్వాగతం..
భోజన విరామం అనంతరం అమరావతి మీదుగా ప్రచార రథం తాడికొండ అడ్డరోడ్డుకు చేరుకుంది. గుంటూరు పార్లమెంటు అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, తాడికొండ అసెంబ్లీ అభ్యర్థి హెని క్రిస్టీనా అక్కడ షర్మిలకు స్వాగతం పలికారు. యువకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తూ జననేత సోదరిని తమ గ్రామానికి తోడ్కొని వెళ్లారు. అక్కడి నుంచి నియోజకవర్గ కేంద్రమైన తాడికొండ సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకున్న షర్మిల తన కోసం నిరీక్షిస్తున్న అభిమానులు, కార్యకర్తలను అభివాదం చేసి ప్రసంగాన్ని ప్రారంభించారు. అనంతరం తాడికొండలోని ప్రధాన వీధుల్లో రోడ్‌షోగా కంతేరుకు చేరారు. స్థానిక మహిళలు రాజన్న బిడ్డకు హారతులిచ్చి స్వాగతం పలికారు. పూలజల్లులతో ముంచెత్తారు.
వెనిగండ్లలో ముగిసిన ప్రచారం...
గుంటూరు రోడ్డు వద్దకు చేరుకోగానే పొన్నూరు అసెంబ్లీ అభ్యర్థి రావి వెంకటరమణ పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో వచ్చి స్వాగతం పలికారు. వెనిగండ్ల పొలిమేర సెంటర్‌కు చేరుకున్న జనభేరి రథంపై పూల జల్లులు కురిపిస్తూ అభిమానులు ఈలలు, కేకలతో కేరింతలు కొడుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. రాజన్న బిడ్డను కనులారా చూడాలని ఆమె చెప్పే మాటలను చెవులారా వినాలని వృద్ధులు సైతం రోడ్లపైకి చేరి గంటల కొద్దీ ఆమె రాకకోసం ఎదురు చూపులు చూశారు. ఆమె పలికే ప్రతి మాటకు ప్రతిస్పందనగా కరతాళ ధ్వనులు చేశారు. గురువారం రాత్రి వెనిగండ్ల గ్రామంలో జిల్లా ప్రచారాన్ని ముగించుకుని విజయవాడ బయలుదేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నూతలపాటి హనుమయ్య, కత్తెర సురేష్‌బాబు, అంజిరెడ్డి, షేక్ షౌకత్, ఈపూరి అనూఫ్, మేరిగ విజయలక్ష్మి, వెనిగండ్ల సర్పంచ్ కె.తులసిబాయి, పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.