సాక్షి, ఖమ్మం: రాజన్నపై గిరిజనుల గుండెల్లో నిండిన అనురాగం ఆయన తనయపై పూల వర్షమై కురిసింది. ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆమెను అభిమానంతో అడుగడుగునా ఆశీర్వదించారు. గ్రామగ్రామాన జనం పరుగుపరుగున ఎదురొచ్చి స్వాగతం పలికారు. పినపాక పోటెత్తింది...భద్రాద్రి జనగోదారైంది...దమ్మపేట దమ్ముచూపింది...ఇదీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల జిల్లాలో మంగళవారం నాడు నిర్వహించిన ఎన్నికల ప్రచారయాత్ర జనభేరికి లభించిన అపూర్వ స్పందన.
జిల్లాలో షర్మిల చేపట్టిన ఎన్నికల ప్రచార యాత్ర జనభేరి మూడోరోజు మంగళవారం ఉదయం 9.45 గంటలకు మణుగూరు నుంచి ప్రారంభమైంది. అశ్వాపురం మండలం మిట్టగూడెం, చింత్రియాల క్రాస్‌రోడ్డు, సీతారాంపురం, మొండికుంట, బూర్గంపాడు మండలం ఈరవెండిల మీదుగా షర్మిల ప్రచార యాత్ర సారపాక వైపు కదలింది. దారిపొడవునా గిరిజనులు ప్రచార రథానికి ఎదురొచ్చి పూలవర్షం కురిపించారు. డప్పువాయిద్యాలతో అడుగడుగునా ఆమెకు నీరాజనం పలికారు.
ఉదయం 11.45 గంటలకు ప్రచారయాత్ర సారపాక శివారుకు చేరుకుంది. భారీగా జనం కదలిరావడంతో సారపాక జన ప్రవాహాన్ని తలపించింది. మహిళలు ఎదురొచ్చి ప్రచార వాహనంపై పూలు చల్లి షర్మిలను ఆశీర్వదించారు. సారపాక సెంటర్‌లో భారీగా హాజరైన ప్రజలకు వాహనం పై నుంచి షర్మిల అభివాదం చేశారు. అనంతరం ప్రచారరథం భద్రాచలం వైపు కదిలింది. గోదావరి బ్రిడ్జిపైకి ప్రచారం రథం చేరుకోగా వైఎస్సార్‌సీపీ, సీపీఎం శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
భద్రాద్రి.. జనగోదారి..
భద్రాచలం బ్రిడ్జి నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ఎటు చూసినా వైఎస్సార్‌సీపీ, సీపీఎం శ్రేణుల జాతరే. ఉదయం 11.35 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు భద్రాచలంలో ప్రచార యాత్ర సాగింది. అంబేద్కర్ సెంటర్‌లో షర్మిల ప్రసంగానికి ప్రజల నుంచి విశేష స్పందన కనిపించింది. ఫ్యాన్‌గుర్తు, సుత్తికొడవలి నక్షత్రం గుర్తులకు ఓటు వేయాలని ఆమె అనగానే.. ప్రతిగా ఇరుపార్టీల కార్యకర్తలు ఈ రెండు గుర్తులకు మన ఓటు అంటూ నినదించారు. గిరిజన సాంప్రదాయంగా విల్లంబును ఎక్కుపెట్టి ఇరుపార్టీల అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని షర్మిల పిలుపునిచ్చారు. అంబేద్కర్ సెంటర్‌లో ప్రసంగం ముగిసిన అనంతరం ప్రచారయాత్ర మళ్లీ సారపాక వైపు కదిలింది. ఇక్కడికి భారీగా జనం తరలిరావడంతో షర్మిల వారినుద్దేశించి ప్రసంగించారు.
అలాగే నాగినేనేప్రోలు రెడ్డిపాలెంలో కార్యకర్తల అభిమానం కాదనలేక ఆమె ప్రసంగిస్తూ.. ఇంత చిన్న ఊరిలో 6 రాజన్న విగ్రహాలు పెట్టారని, మీ అభిమానం, అప్యాయత ఎప్పటికీ మరువలేనని ఆమె గ్రామస్తులను ఉద్దేశించి అన్నారు. బూర్గంపాడు, మొరంపల్లిబంజరలలో భారీగా హాజరైన జనాన్ని ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. మొత్తంగా పినపాక నియోజకవర్గం ప్రజలు షర్మిల యాత్రకు హారతి పట్టారు.మోరంపల్లి బంజర మీదుగా పాల్వంచ నుంచి ఈ యాత్ర అశ్వారావుపేట నియోజకవర్గం ములకలపల్లిలోకి ప్రవేశించింది.
దమ్ముచూపిన దమ్మపేట..
వైఎస్‌ఆర్‌సీపీ అశ్వారావుపేట అసెంబ్లీ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు షర్మిలకు ముల్కలపల్లిలో స్వాగతం పలికారు. డప్పువాయిద్యాలతో పార్టీ శ్రేణులు ప్రచారయాత్రలో పాల్గొనగా...షర్మిలను చూసేందుకు, ప్రసంగం వినేందుకు భారీగా జనం తరలివచ్చారు. ఇక్కడి నుంచి దమ్మపేట చేరుకునే సరికి రాత్రి 7.30 గంటలు అయింది. నియోజకవర్గంలో పలు మండలాల నుంచి జనం తరలిరావడంతో దమ్మపేట హోరెత్తింది. ఇక్కడ ఎటు చూసినా జనమే. షర్మిల ప్రసంగంలో వైఎస్‌ఆర్, జగన్ పేర్లను ప్రస్తావించినప్పుడల్లా జనం జేజేలు పలికారు. వైఎస్‌ఆర్ అమర్హ్రే అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు పాలనలో మీకోసం ఏమైనా చేశారా..? అని ఆమె ప్రజలను ఉద్దేశించి అనడంతో.. లేదు..లేదు అంటూ వారు ప్రతిగా చేసిన నినాదాలతో దమ్మపేట మార్మోగింది.
పరుగు పరుగున వచ్చి..
పర్యటన ఆద్యంతం రాజన్న తనయను చూసేం దుకు ప్రజలు పరుగుపరుగున వచ్చి ఆమెతో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. ప్రచార రథంలో ఆమె కనిపించేంత వరకు వచ్చి చూశా రు. కొంతమంది తమ ఇళ్లలో ఉన్న పూలను తీసుకొచ్చి అభిమానంతో ఆమె ప్రచార వాహనంపై చల్లారు. షర్మిల ప్రసంగం రాజన్నను మళ్లీ ఒక్కసారి గుర్తు చేసిందని, తండ్రికి తగ్గతనయులు జగన్, షర్మిల అంటూ ఈసందర్భంగా పలువురు అనుకోవడం కనిపించింది.
ఈ ప్రచారయాత్రలో షర్మిల వెంట ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తెల్లం వెంకట్రావ్, పినపాక, కొత్తగూడెం, అశ్వారావుపేట వైఎస్సార్‌సీపీ అసెంబ్లీ అభ్యర్థులు పాయం వెంకటేశ్వర్లు, వనమా వెంకటేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, వైఎస్సార్‌సీపీ మద్దతు ఇచ్చిన భద్రాచలం సీపీఎం అభ్యర్థి సున్నం రాజయ్య, వైఎస్సార్‌సీపీ వాణిజ్య విభాగం నాయకులు విఎల్‌ఎన్ రెడ్డి, నేతలు పాయం ప్రమీల, వీరారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, బిగ్గెం శ్రీనివాస్‌రెడ్డి, పాకలపాటి చంద్రశేఖర్,జూపల్లి ఉపేంద్రబాబు, సారేపల్లి శేఖర్, బత్తుల అంజి, ఆకులమూర్తి, బీమా శ్రీధర్, బీమనాథుల అశోక్‌రెడ్డి, జల్లేపల్లి సైదులు, సీపీఎం నేతలు బి.వెంకట్, అన్నవరపు కనకయ్యలు ఉన్నారు.
అపూర్వ ఆదరణ
Published Wed, Apr 16 2014 6:26 AM | Last Updated on Sat, Sep 2 2017 6:07 AM
Advertisement
Advertisement