విజయ దుందుభి | YS Vijayamma Road show in Rajam, Srikakulam | Sakshi
Sakshi News home page

విజయ దుందుభి

Published Fri, May 2 2014 1:52 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

విజయ దుందుభి - Sakshi

విజయ దుందుభి

 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : రెండున్నర రోజులు... 10 నియోజకవర్గాలు... 13 ప్రచార సభలు... అదీ రోడ్డు మార్గాన... మొదటి దశలో మండుటెండలు... రెండో దశలో హోరు గాలి... జోరువాన... అయినా చెక్కుచెదరని ప్రజాభిమానం... వెల్లువెత్తిన జనసందోహం... ఎండలను.. వానలను ఖాతరు చేయకుండా ప్రచారాన్ని కొనసాగించి ప్రజల మనసులు గెలుచుకున్న  విజయమ్మ...  సంక్షేమ రాజ్య  స్థాపన, అభివృద్ధి సాధన జగన్ వల్లే సాధ్యమని ఉద్ఘాటన... ఇచ్చిన మాటకు కట్టుబడతామని ప్రతిన... వెరసి రాష్ట్రాభివృద్ధికి తన కుమారుడు జగన్‌కు ప్రజలకు అప్పగిస్తున్నానని చెబుతూ ప్రజల హృదయాలను సృ్పశించిన అమ్మ...
 
 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ జిల్లాలో నిర్వహించిన సుడిగాలి ఎన్నికల ప్రచారం సంక్షిప్త చిత్రమిదీ....అందుకు జిల్లా కూడా అంతే సానుకూలంగా స్పందించింది. అమ్మ పర్యటనపై జిల్లావ్యాప్తంగా  ప్రజాభిమాన వర్షం కురిసింది. తమ కోసం వచ్చిన అమ్మ కోసం ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. ప్రతి సభకు జనవాహిని పోటెత్తింది. విజయమ్మ ప్రచారానికి జిల్లాలో వెల్లువెత్తిన ప్రజా స్పందన ఇదీ. వెరసి విజయమ్మ రెండున్నర రోజుల పర్యటన జిల్లా రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యయాన్ని లిఖించింది. ఎన్నికల ముందు విజయమ్మ సుడిగాలి పర్యటనతో జిల్లాలో ఫ్యాన్ గాలి హోరెత్తింది. ఎన్నికలకు సర్వసన్నద్ధమయ్యేలా పార్టీ శ్రేణులకు ఉత్ప్రేరకంగా పనిచేసింది.
 
 నూతన అధ్యాయం
  విస్తృత పర్యటనతో ప్రజల మనసులు గెలుచుకున్న విజయమ్మ వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ ఎన్నికల ప్రచారం జిల్లా రాజకీయ చరిత్రలో నూతన అధ్యాయనాన్ని లిఖించింది. ఇంతవరకు జిల్లాలో ఏ రాజకీయ నేత చేయని రీతిలో రెండున్నర రోజుల్లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాలను ఆమె చుట్టుముట్టారు. మొత్తం 10 నియోజకవర్గాల్లోనూ 13 ప్రచార సభల్లో ప్రసంగించారు. అదీ మండు వేసవిలో వయోభారాన్ని కూడా లెక్కచేయకుండా రోడ్డు మార్గంలో సుడిగాలి పర్యటన చేయడం విశేషం. అన్ని సభల్లోనూ విజయమ్మ ఒకే రీతిలో తనదైన శైలిలో ప్రసంగించి ప్రజల మనసులు గెలుచుకున్నారు. ఉదయమైనా.. మధ్యాహ్నమైనా.. సాయంత్రమైనా.. రాత్రి అయినా ఏమాత్రం విసుగులేకుండా ఎంతో ఓపికతో ప్రసంగించి అందరి మనన్నలు పొందారు. ఇంత విస్తృతస్థాయిలో జిల్లాలో ఇంతవరకు ఏ రాజకీయ నేత కూడా ప్రచారం చేయలేదు.
 
 నా కష్టం తీరనిది కానీ...మీ సేవకు జగన్‌ను అందిస్తున్నా
 విజయమ్మ ప్రధానంగా మూడు అంశాలను ప్రజల దృష్టికి తీసుకొచ్చారు. ఒకటి వై.ఎస్.జగన్ పోరాటపటిమను, నిబద్ధతను ప్రజలకు వివరించారు. కేవలం ఇచ్చిన మాటకు కట్టుబడి ఓదార్పు యాత్ర చేయడం వల్లే కాంగ్రెస్ ప్రభుత్వం అతనిపై కక్ష కట్టిందని ఆమె ప్రజల దృష్టికి తీసుకువచ్చారు. జైలుకు వెళ్లినా ఆ పోరాట పటిమను వీడలేదనే విషయాన్ని గుర్తు చేశారు. ‘ప్రజలకు మేలు చేయాలన్న వై.ఎస్.రాజశేఖరరెడ్డిగారిలోని తపన జగన్‌బాబులో ఉంది... ప్రజల కోసం ఎంత కష్టాన్ని అయినా భరించగల వైఎస్ ఓపిక జగన్‌బాబులో ఉంది. మీ కోసం పోరాడగల తెగువ జగన్‌బాబులో ఉంది. పోరాటపటిమ జగన్‌బాబులో ఉంది’అన్న విజయమ్మ మాటలు ప్రజల గుండెల్లో నాటుకుపోయాయి.
 
 అదే సమయంలో ఆమె మాట్లాడుతూ తన కష్టాన్ని కూడా లీలామాత్రంగా సృ్పశిస్తూ ప్రజల మనసులను కదిలించారు. ‘రాజశేఖరరెడ్డిగారి లేని లోటు నాకెవ్వరూ తీర్చలేరు. నా కొడుకు కోడలు కూడా తీర్చలేరు’అని తన ఆవేదనను వెలిబుచ్చారు. ‘ప్రజలకు మాత్రం ఓ మాట ఇస్తున్నాను. రాజశేఖరరెడ్డిగారు లేని లోటును ప్రజలకు రానీయకుండా జగన్‌బాబు చూసుకుంటాడు. ఓ కొడుకులా, అన్నగా, తమ్ముడిగా, స్నేహితుడిగా అండగా ఉంటాడు’అని తన కుమారుడు జగన్‌ను ప్రజలకు అందిస్తున్నా అని చెప్పి అందరి మనసులను గెలుచుకున్నారు. సంక్షేమ రాజ్య స్థాపన, నూతన రాష్ట్రాభివృద్ధి జగన్ వల్లే సాధ్యమని ఉద్ఘాటించారు.  వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలోని అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారు.
 
 అదే సమయంలో విభజన అనంతరం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించగల సత్తా జగన్‌కే ఉందని ఆమె సాదోహరణంగా స్పష్టం చేశారు. ఎన్నికల వేళ ప్రజలను మోసం చేసేందకు చంద్రబాబు వేస్తున్న నక్కజిత్తులను విజయమ్మ సూటిగా కడిగి పారేశారు. ఎన్టీ రామారావు ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకానలు రద్దు చేసిన చంద్రబాబు ప్రస్తుతం కొత్తగా ఏం చేస్తారని ఎద్దేవా చేశారు. ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టి... కాంట్రాక్టు ఉద్యోగాలను ప్రవేశపెట్టి, ఉద్యోగ భద్రత లేకుండా చేశారని, ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తానంటూ ప్రజలను మభ్యపెడుతున్నాడని దుయ్యబట్టారు. విభజన కారకుడు చంద్రబాబేననే విషయాన్ని ప్రజలకు వివరిస్తూ ఆయన లేఖతోనే తెలంగాణా ఏర్పడిందన్న వాస్తవాన్ని గుర్తు చేశారు.  
 
 అమ్మ పర్యటన విజయవంతం..కదం తొక్కుతున్న పార్టీ శ్రేణులు
 ఆశించినదానికంటే ఎక్కువుగా విజయమ్మ పర్యటన విజయవంతం కావడంతో వైఎస్సార్ కాంగ్రెస్‌లో కొత్త జోష్ ఉరకలెత్తుతోంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమతూల్యం, సంక్షేమ మేనిఫెస్టోతో ప్రజల్లో సానుకూలతతో పార్టీ జిల్లాలో ముందంజలో ఉంది. అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఏప్రిల్ 3, 4 తేదీలలో నిర్వహించిన ప్రచారంతో పార్టీలో ఉత్సాహం రెట్టింపైంది. దీనికి మరింతగా అదనపు బలాన్ని చేకూరుస్తూ విజయమ్మ తాజా పర్యటన పార్టీ ఉత్సాహాన్ని ఇనుమడింపజేసి జిల్లాలో పార్టీ ఘన విజయాన్ని ఖాయం చేసేసింది.  విజయమ్మ ప్రచారానికి ప్రజల నుంచి విస్తృత స్పందన లభిస్తోందని గుర్తించిన పార్టీ అభ్యర్థులు ఆమెతో మరిన్ని ఎక్కువ ప్రచార సభలు నిర్వహించడానికి ఒత్తిడి తేవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
 
 వాస్తవానికి అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి టెక్కలి డివిజన్‌లో పర్యటించినందున విజయమ్మ ఇతర డివిజన్లలో పర్యటించాలని భావించారు. కానీ టెక్కలి డివిజన్ అభ్యర్థులు అమ్మ ఒక్కసారైనా తమ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించాలని పట్టుబట్టారు. దాంతో ఆమె ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించి ప్రజల మన్ననలను పొందారు. ధర్మాన ప్రసాదరావు పట్టుబట్టి మరీ విజయమ్మతో తన నియోజకవర్గంలో ఏకంగా మూడు ప్రచార సభలు ఏర్పాటు చేయడం గమనార్హం. తమ్మినేని సీతారాం కూడా తన నియోజకవర్గంలో అదనంగా మరో ప్రచార సభలో పాల్గొనాలని విజయమ్మను కోరి మరీ ఒప్పించారు.
 
 దాంతో రెండో దశ ప్రచారాన్ని ముగింపులో పొందూరులో గురువారం రోడ్‌షో ఏర్పాటు చేశారు. కానీ గురువారం రాత్రి 9 గంటలకు కూడా పొందూరలో భారీ జనసందోహం విజయమ్మ కోసం ఓపిగా నిరీక్షించింది. తన కోసం నిరీక్షిస్తున్న ప్రజల కోరికను కాదనలేక విజయమ్మ రోడ్‌షో కాస్త ప్రచార సభగా మార్చి తనదైన శైలిలో ప్రసంగించి అందర్నీ మెప్పించారు. గురువారం అంతకుముందు పాలకొండ, రాజాం సభలకు వేలాదిగా ప్రజలు కదం తొక్కడం అందర్నీ అబ్బురపరచింది. ఓ వైపు హోరుగాలి... జోరున వాన... కానీ ప్రజాభిమానం ఏమాత్రం చెక్కుచెదర లేదు. వేలాదిగా తరలివచ్చిన ప్రజలు ఎంతో ఓపిగ్గా... ఆసక్తిగా విజయమ్మ ప్రచార సభల్లో పాల్గొన్నారు. అందుకు తగ్గట్లుగానే ఆమె కూడా ఓ వైపు వర్షంలో తడుస్తూనే సభలో పాల్గొని ప్రసంగాన్ని కొనసాగించారు. ఇలా పార్టీ విధానాలను సమర్థంగా ప్రజలకు వివరించి... తన వ్యక్తిగత చరిష్మాతో అందరి మన్ననలు పొంది విజయమ్మ జిల్లా పర్యటనను వజయవంతంగా ముగించడం వైఎస్సార్ కాంగ్రెస్‌లో జోష్‌ను అమాంతంగా పెంచేసింది. పోలింగ్‌కు వారం రోజలు ముందు నిర్వహించిన విజయమ్మ పర్యటనకు లభించిన విశేష ప్రజా స్పందన పార్టీ విజయాన్ని ఖరారు చేసిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement