వ్యూహాత్మక ఆధిపత్యం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మొదటిసారి పాల్గొంటున్నప్పటికీ వ్యూహాత్మకంగా వ్యవహరించడం ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పైచేయి సాధించి.. ఆత్మవిశ్వాసంతో పోలింగ్‌కు సిద్ధమవుతోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే పార్టీ కార్యక్షేత్రంలోకి దిగింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, నియోజకవర్గ సమన్వయకర్తలతో పార్టీ నాయకత్వం హైదరాబాద్‌లో సమీక్ష సమావేశం నిర్వహించి ఎన్నికలకు దిశానిర్దేశం చేసింది.
వీటిని మున్సిపల్ ఎన్నికలుగా కాకుండా రానున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు దిశానిర్దేశం చేసేవిగా పార్టీ పరిగణించింది. మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికలకు జిల్లా పార్టీ పరిశీలకుడిగా కొయ్య ప్రసాదరెడ్డిని నియమించి ఎన్నికల ప్రణాళిక పకడ్బందీగా అమలు చేసింది. అభ్యర్థుల ఎంపిక నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరించింది. నియోజకవర్గ సమన్వయకర్తల అభిప్రాయానికి ప్రాధాన్యమిస్తూనే అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించింది.
దాదాపు నాలుగు మున్సిపాలిటీల్లోనూ నియోజకవర్గ సమన్వయకర్తల కుటుంబ సభ్యులకు కాకుండా ఇతర నేతలకే టిక్కెట్లు కేటాయించింది. దాంతో ఎలాంటి అసంతృప్తులకు తావు లేకుండా టిక్కెట్ల కేటాయింపు ప్రక్రియ ముగి సింది. అనంతరం ప్రచారాన్ని కూడా పార్టీ వ్యూహాత్మకంగా సాగించింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ఎన్నికల పరిశీలకుడు, ఎంపీ నియోజకవర్గ సమన్వయకర్త, మున్సిపాలిటీలకు నియమించిన పరిశీలకులు.. ఇలా అందరూ సమన్వయంతో ముమ్మర ప్రచారం చేశారు.
అన్ని వార్డుల్లోని అన్ని గడపలనూ పలకరించి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాల్సిందిగా అభ్యర్థించారు. రాష్ట్రంలో సంక్షేమ రాజ్యాన్ని తీసుకువచ్చే క్రమంలో వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వా న్ని బలపరిచేందుకు మున్సిపల్ ఎన్నికలు నాంది కావాలని ప్రజలను కోరారు. ప్రజల నుంచి కూడా సానుకూల స్పందన లభించడంతో పార్టీ శ్రేణులు ఉత్సాహం తో పని చేశాయి. ఇచ్ఛాపురంలో మాజీ ఎమ్మెల్యే ఎం.వి.కృష్ణారావు మొదటి నుంచి పకడ్బందీగా వ్యవహరించారు. సమన్వయకర్తలు శ్యాంప్రసాద్ రెడ్డి, నర్తు నరేంద్రలను సమన్వయపరుచుకూంటూ అభ్యర్థుల ఎంపిక ఇతరత్రా కార్యాచరణను అమలు చేశారు. మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్, నర్తు రామారావులు కూడా పార్టీ కార్యాచరణలో క్రియాశీలపాత్ర పోషించా రు.
పలాసలో సమన్వయకర్త వజ్జ బాబూరావు, ఎమ్మె ల్యే జుత్తు జగన్నాయకులు మధ్య సమన్వయం పార్టీకి అదనపు బలాన్నిచ్చింది. ఆమదాలవసలో సమన్వయకర్త తమ్మినేని సీతారాం అంతా తానై వ్యవహరించి పార్టీ ప్రచారాన్ని పరుగులెత్తించారు. పాలకొండ నగర పంచాయతీలో సీనియర్ నేత పాలవలస రాజశేఖరం బాధ్యతను భుజానికెత్తుకున్నారు. తన సతీమణి ఇందుమతిని మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా ప్రకటించి ఆయన ఎన్నికల మంత్రాంగాన్ని వేగవంతం చేశారు.
పడుతూ లేస్తూ సాగిన సైకిల్
మున్సిపల్ పోరులో వైఎస్సార్‌సీపీకి గట్టి పోటీఇస్తుందని భావించిన టీడీపీ అసలు పరీక్షా సమాయానికి చతికిలపడిపోయింది. ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటీలున్న నియోజకవర్గాల్లో టీడీపీకి సమర్థ నాయకత్వం లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. దాంతో ఎన్నికల బాధ్యతను భుజానికెత్తుకునేందుకు ఎవరూ సాహసించలేకపోయారు. పెద్దదిక్కుగా నిలుస్తారని ఆశించిన కింజరాపు రామ్మోహన్‌నాయుడు కూడా మున్సిపల్ రాజకీయాల్లో జోక్యం చేసుకోకపోవడం విస్మయపరిచింది. అభ్యర్థుల ఎంపిక గురించి ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు.
రామ్మోహన్ ఎన్నికలకు మేం పనిచేయాలిగానీ ఆయన తమ ఎన్నికల సమయంలో కనిపించరా అని మున్సిపల్ నేతలు ఆగ్రహించారు. దాంతో రామ్మోహన్ అరకొరగా ప్రచారంలో కనిపించినా అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. పార్టీ జిల్లా అధ్యక్షుడితో సహా ఇతర ముఖ్యనేతలు కూడా మున్సిపల్ ఎన్నికల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. ఇచ్ఛాఫురం నియోజకవర్గ ఇన్‌చార్జి బెందాళం అశోక్‌కు కవిటి మండలంలోనే కొంతవరకు పట్టుంది. ఇచ్ఛాఫురం మున్సిపాలిటీలో ఆయన ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు ఎవరికివారే యమునా తీరే అన్న రీతిలో వ్యవహరించారు.
సీనియర్ నేత గౌతు శివాజీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్నప్పటికీ పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో కూడా పరిస్థితి అలాగే తయారైంది. తనను కింజరాపు కుటుంబం ఇబ్బంది పెడుతుండటంతో ఆయన కినుక వహించి మున్సిపల్ ఎన్నికలను పట్టించుకోలేదు. ఆమదాలవలస నియోజకవర్గ ఇన్‌చార్జి కూన రవికుమార్ పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది.
ఆమదాలవలస మున్సిపాలిటీలో పట్టు లేకపోవడంతో పార్టీకి నాయకత్వం వహించలేకపోయారు. దాంతో టీడీపీ ప్రచారం, ఎన్నికల కార్యాచరణ పడుతూ లేస్తూ సాగింది. పాలకొండ మున్సిపాలిటీలో టీడీపీ పరిస్థితి ఆ పార్టీ నేతలకే అంతుచిక్కడం లేదు. అభ్యర్థుల ఎంపికలోనే గందరగోళం ఏర్పడటంతో ఆ పార్టీ సానుభూతిపరులే అత్యధిక సంఖ్యలో ఇండిపెండెంట్లుగా పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పత్తా లేని కాంగ్రెస్
మున్సిపల్ ఎన్నికల పోరులో కాంగ్రెస్ పాత్ర నామమాత్రంగా మారిపోయింది. ఏ ఒక్క మున్సిపాలిటీలో కూడా పార్టీ అన్ని వార్డులకు అభ్యర్థులను నిలబెట్టలేని దుస్థితికి దిగజారిపోయింది. ఎన్నికల గురించి పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. కాంగ్రెస్‌కు జవసత్వాలు అందిస్తామని ప్రకటనలు గుప్పిస్తున్న కేంద్రమంత్రి కృపారాణిగానీ, రాష్ట్ర మాజీ మంత్రి కోండ్రు మురళీగానీ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీని ఏమాత్రం పట్టించుకోలేదు.
దీంతో పార్టీ శ్రేణులు ఎన్నికల కంటే ముందే కాడి వదిలేసి కాళ్లు చాపుకుని కూర్చున్నాయి. ఈ పరిణామాలతో జిల్లాలో ఎన్నికల కథ క్లైమాక్స్‌కు చేరుకుంది. ఇక అసలు ఘట్టం పోలింగ్ మిగిలి ఉంది. అందుకు మూడు ప్రధాన పార్టీలు పోలింగ్ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.