సాక్షి, గుంటూరు :పరిషత్ ఎన్నికల్లో పల్లె ప్రజలు ఫ్యాన్ పక్షం వహించారు. పట్టణ ఓటర్లకు భిన్నంగా స్పందించి వైఎస్సార్ సీపీకి పట్టం కట్టారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిపై ఉన్న అభిమానాన్ని ఓటు రూపంలో చూపారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో ధీమాగా ఉన్న టీడీపీ శ్రేణులు పల్లె ఓటర్ల తీర్పుతో కాస్త నిరాశచెందాయి. ఏప్రిల్ 7వ తేదీన జిల్లాలో 57 మండలాల్లో జిల్లా పరిషత్, మండల పరిషత్‌కు ఎన్నికలు జరిగాయి. మంగళవారం వెల్లడయిన ఫలితాల్లో సంఖ్యాపరంగా తెలుగుదేశం పార్టీ స్వల్ప ఆధిక్యం కనబర్చినా ఓట్ల శాతంలో మాత్రం వైఎస్సార్ సీపీ ముందంజలో ఉంది.
వైఎస్సార్ సీపీకే అధిక మెజారిటీ..
జిల్లాలోని 36 లక్షల మంది ఓటర్లలో పట్టణ ఓటర్లు 6.90 లక్షలు ఉన్నారు. మిగిలిన 29 లక్షల పల్లెవాసులువైఎస్సార్ సీపీ వైపే మొగ్గు చూపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 912 మండల పరిషత్‌లకు ఎన్నికలు నిర్వహించారు. వాటిలో 409 స్థానాలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకోగా 469 స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. సీట్లు పరంగా టీడీపీ ముందంజలో ఉన్నప్పటికీ మెజారిటీలను లెక్కిస్తే వైఎస్సార్‌సీపీ ముందుంది. దీన్ని బట్టి చూస్తే పల్లె ఓటర్లు అధికంగా ఫ్యాన్ వైపే మొగ్గు చూపారన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. దీనికి తోడు టీడీపీ గెలిచిన ఎంపీటీసీ స్థానాల్లో ఎక్కువ చోట్ల చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా 10 ఓట్లలోపు మెజారిటీతో బయటపడింది.
తాడేపల్లిలో 55 స్థానాల్లో భారీగా ఓట్లు..
జిల్లాలోని అన్ని మండలాల్లో ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే అత్యధిక స్థానాల్లో వైఎస్సార్‌సీపీకి ఓట్లు ఎక్కువగా పోలవడం విశేషం. జిల్లా పరిషత్ ఎన్నికల్లో మొత్తం 57 జడ్పీటీసీలకు పొన్నూరు, తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు పోటీలో లేరు. మిగిలిన 55 స్థానాల్లో పోటీచేసిన ఆ పార్టీ అభ్యర్థులకు భారీగా ఓట్లు పోల య్యాయి. జిల్లా పరిషత్ అభ్యర్థుల ఓట్ల లెక్కింపులో రౌండ్‌రౌండ్‌కు మెజార్టీలు మారుతుండటంతో అభ్యర్థులు, ఏజెంట్లు నరాలు తెగే టెన్షన్ పడ్డారు. మండల పరిషత్ ఎన్నికల్లో అనేక స్థానాలు టీడీపీ దక్కించుకున్నప్పటికీ ఆయా స్థానాల్లో జిల్లా పరిషత్‌లను వైఎస్సార్ సీపీ గెల్చుకోగలిగింది. గురజాల నియోజకవర్గం దాచేపల్లి, పిడుగురాళ్ల, మాచర్ల నియోజకవర్గం రెంటచింతల, తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురం, బాపట్ల నియోజకవర్గం పిట్టలవానిపాలెం, కర్లపాలెం మండల పరిషత్‌లను టీడీపీ దక్కించుకున్నప్పటికీ ఆయా స్థానాల్లో వైఎస్సార్ సీపీ జిల్లా పరిషత్ అభ్యర్థులు విజయం సాధించారు. ఒక దశలో జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ దక్కించుకుంటుందేమోనని టీడీపీ నాయకులు తీవ్ర ఆందోళన చెందారు. వైఎస్సార్‌సీపీ జిల్లా పరిషత్ అభ్యర్థులు గెలుపొందిన చోట భారీ మెజార్టీలు సంపాదించుకోగా, టీడీపీ అభ్యర్థులు గెలుపొందిన చోట స్వల్ప మెజార్టీలతో బయటపడ్డారు. పల్లె ఓటర్ల తీర్పును బట్టి చూస్తే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జిల్లాలో అత్యధికంగా అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకొనే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పల్లెజనం ఫ్యాన్ పక్షం
Published Wed, May 14 2014 1:33 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
Advertisement