
ఈ మాట వింటేనే భయం అనిపిస్తుందిగానీ.. శాస్త్రవేత్తల తాజా అంచనా ఇదే. పెట్రోలు, డీజిళ్ల వంటి శిలాజ ఇంధనాల విచ్చలవిడి వాడకం, అడవుల నరికివేత ఇప్పుడున్నట్టుగానే కొనసాగితే 2050 కల్లా భూమ్మీద మానవ నాగరికత మొత్తం అంతమైపోవచ్చునని అంటున్నారు శాస్త్రవేత్తలు. వాతావరణ మార్పులను అడ్డుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టకపోతే 2050 కల్లా భూమి సగటు ఉష్ణోగ్రతలు మూడు డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ పెరుగుతుందని ఫలితంగా భూవాతావరణం సరిదిద్దలేని స్థితికి చేరుకుంటుందని శాస్త్రవేత్తలు తాజాగా అంచనాకట్టారు.
భూమ్మీద కనీసం 35 శాతం భూభాగంలో.. మొత్తం జనాభాలో 55 శాతం మందిపై విపరీతమైన వేడి వాతావరణం ప్రభావం పడుతుందని.. మనిషి బతికేందుకు వీలుకాని పరిస్థితుల్లో ఏటా 20 రోజుల వరకూ ఉండాల్సి వస్తుందని అంటున్నారు. అమెజాన్ అడవులు మొదలుకొని సముద్రపు పగడపు దిబ్బల వరకూ చాలా జీవజాతుల ఆవాస ప్రాంతాలు నాశనమైపోతాయని వడగాడ్పులు పెచ్చరిల్లడంతోపాటు కార్చిచ్చులు, కరవులు సాధారణమైపోతాయని వివరించారు. ఆసియాలోని జీవనదుల్లో నీటి లభ్యత గణనీయంగా తగ్గిపోవడం వల్ల 200 కోట్ల మంది ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని అన్నారు.
మెక్సికో, సెంట్రల్ అమెరికాలలో వర్షపాతం సగానికిపైగా తగ్గిపోతుందని ఉష్ణమండల ప్రాంతాల్లో వ్యవసాయం అస్సలు సాధ్యం కాని పరిస్థితి ఏర్పడుతుందని తెలిఆపరు. ప్రస్తుతం నాలుగైదు ఏళ్లకు ఒకసారి వచ్చే ఎల్‌నినో ఏటా వచ్చినా ఆశ్చర్యం లేదని అన్నారు. ఈ సమస్యలన్నింటినీ అధిగమించాలంటే.. తక్షణం ప్రపంచవ్యాప్తంగా విప్లవాత్మక మార్పులు ప్రారంభం కావాలని, పెద్ద ఎత్తున నిధులు సమకూర్చుకుని అన్ని భేదాభిప్రాయాలను పక్కనపెట్టి కృషి చేస్తేనే ఇది సాధ్యమని అన్నారు.