ఆ ఇంట్లో 98 ఓట్లూ ఒకరికే!
ఓటుమ్మడి కుటుంబం
ఉత్తరప్రదేశ్‌లోని మహరాజ్‌గంజ్ జిల్లాలోని బాబా అహ్మద్ అలీ కుటుంబానికి ఓ ప్రత్యేకత ఉంది. సోమవారం సాయంత్రం సార్వత్రిక ఎన్నికల ఘట్టం ముగిసేవరకూ ఆ ఇంటికి రాని పార్టీ వాళ్ళు లేరు. నవ్వుతూ పలకరిస్తూ, ఓటెయ్యమని అడగని అభ్యర్థి లేడు. ఆ ఇంటికీ, ఆ కుటుంబానికి ఉన్న అంతటి ప్రత్యేకత ఏమిటంటారా? ఆ ఇంట్లో ఉన్నది ఒకే కుటుంబం. మొత్తం 136 మంది సభ్యులున్న ఆ కుటుంబంలో ఒకటీ, రెండూ కాదు... ఏకంగా 98 ఓట్లున్నాయి. అందుకే, ఆ ఇంటి చుట్టూ అన్ని పార్టీల అభ్యర్థులూ మొన్నటి దాకా చక్కర్లు కొడుతూ వచ్చారు.
ఉమ్మడి కుటుంబంగా బతుకుతున్న ఆ ఇంట్లో వారందరికీ కలిపి ఒకటే పేద్ద... సామూహిక వంట గది. స్థానికంగా దాన్ని ‘సాంఘా ఛూలా’ అంటారు. వంట విషయంలోనే కాదు... ఓటింగ్‌లోనూ ఆ ఇంటిల్లపాదీ ఒకే మాట మీద ఉంటారు. పోలింగ్‌కు ముందు రోజున ఈ భారీ ఉమ్మడి కుటుంబంలోని సభ్యులందరూ కలసి కూర్చుంటారు. ఎవరు సరైన అభ్యర్థి అన్నది చర్చించుకుంటారు. చివరకు ఓ అభ్యర్థిని ఎంచుకుంటారు. ఈ ఎంపిక నిర్ణయంలో కుటుంబంలోని స్త్రీల మాటకు కూడా సమాన ప్రాధాన్యం ఉంటుంది. ఒకే ఇంట్లో ఇంత మంది ఓటర్లుండడంతో అభ్యర్థులే కాక, ఓటింగ్ శాతాన్ని పెంచాలని కంకణం కట్టుకున్న పోలింగ్ అధికారులు కూడా వీరిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంటారు. సోమవారం నాడు ముగిసిన ఆఖరు విడత ఓటింగ్ సందర్భంగా స్వయంగా పోలింగ్ బూత్ స్థాయి అధికారి వచ్చి, ఈ ఇంట్లో వాళ్ళందరికీ ఓటరు స్లిప్పులు ఇచ్చి వెళ్ళారు. ‘‘వీళ్లందరూ కలసి వచ్చి ఓటేయడం ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది’’ అని ఆ అధికారి చెప్పారు.
నిజానికి, ఈ కుటుంబం ఇక్కడ అనేక దశాబ్దాలుగా ఉంటోంది. సూఫీ సాధువు సమేరా షరీఫ్ దాదాపు నూరేళ్ళ క్రితం ఈ ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారట. ఆయన పెంపుడు కొడుకైన అహ్మద్ అలీ ఈ కుటుంబ పెద్ద. అహ్మద్‌కు ఎనిమిది మంది అబ్బాయిలు. ఇక పిల్లలకు పిల్లలు - 31 మంది అబ్బాయిలు, 21 మంది అమ్మాయిలు. వీళ్ళు, వీళ్ళ పిల్లలు కూడా ఇదే ఇంట్లో ఉంటున్నారు. ఈ ఇంట్లో అందరూ వాడుకొనే గదులు, వంటిల్లు కాక ఏకంగా 60 ప్రత్యేక గదులున్నాయి. ‘‘కలసి ఉంటే కలదు సుఖం అన్నది మా ఆలోచన. సరైన అభ్యర్థిని ఎంచుకోవడంలో కూడా మేము అలాగే ఐకమత్యంతో ఉంటాం’’ అని ఆ కుటుంబీకులు చెబుతున్నారు.
కుల మతాలకతీతంగా వ్యవహరిస్తామంటున్న ఈ కుటుంబంలో ఈ ఏడాది ఏడుగురు తొలి ఓటర్లుగా నమోదయ్యారు. వాళ్ళందరూ కూడా ఓటింగ్ విషయంలో కుటుంబ సంప్రదాయాన్ని అనుసరించారు. అన్నట్లు రానున్న 2017లో ఉత్తరప్రదేశ్‌లో శాసనసభ ఎన్నికలు జరిగే సమయానికి ఈ కుటుంబంలో మరింత మందికి పెళ్ళిళ్ళు జరగడం, కొత్త ఓటర్లు రావడం తథ్యమంటున్నారు ఈ కుటుంబ సభ్యులు. అప్పటికి తమ ఇంటి ఓట్ల సంఖ్య ఇప్పటి 98 నుంచి ఏకంగా 115 దాకా పెరుగుతుందని వారి అంచనా. రికార్డు పుస్తకాల్లోకి ఎక్కే ఈ ఓటర్ల కుటుంబం మరెంతోమందికి ప్రజాస్వామ్య ఓటింగ్ పట్ల స్ఫూర్తి కలిగిస్తే, అంతకన్నా కావాల్సింది ఏముంటుంది!