Ahmed Ali
-
వైఎస్సార్సీపీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత..
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కర్నూలుకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, డీసీసీ మాజీ అధ్యక్షుడు అహ్మద్ అలీఖాన్.. అధికార వైఎస్సార్సీపీలో చేరారు. ఆయనతో పాటుగానే ఇతర నేతలు పోరెడ్డి వేణుగోపాల్‌రెడ్డి, తకియాసాహెబ్, వినయ్ కుమార్‌లు కూడా వైఎస్సార్సీపీలో చేరిపోయారు. ఇక, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీరికి పార్టీ కండువా కప్పి వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, కర్నూలు ఎమ్మెల్యే అబ్ధుల్ హఫీజ్ ఖాన్, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఉన్నారు. అహ్మద్ అలీఖాన్ పార్టీలో చేరినందుకు వీరంతా హర్షం వ్యక్తం చేశారు. ఇక, అహ్మద్ అలీఖాన్.. కాంగ్రెస్ పార్టీ తరపున 2014లో ఎమ్మెల్యేగా, 2019లో కర్నూలు ఎంపీగా పోటీ చేశారు. కర్నూలు డీసీసీ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఈ సందర్భంగా అలీఖాన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో పలు పదవుల్లో ఉంటూ నేను దేశవ్యాప్తంగా పర్యటించాను. ఏపీలోనే పారదర్శకంగా పాలన జరుగుతోంది. పాఠశాలలు చాలా బాగా అభివృద్ధి చెందాయి. అధిష్టానం సూచించిన విధంగా నేను పనిచేస్తాను అని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: మన విద్యావ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భాగం కావాలి: సీఎం జగన్ -
ఇథియోపియా ప్రధానికి నోబెల్ శాంతి పురస్కారం
ఓస్లో(నార్వే) : ఇథియోపియా ప్రధాన మంత్రి అబీ అహ్మద్ అలీకు(43) అరుదైన గౌరవం దక్కింది. ఈ ఏడాది గానూ నోబెల్ శాంతి పురస్కారం ఆయనను వరించింది. ఆయనకు నోబెల్ శాంతి పురస్కారం అందజేయనున్నట్టు నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. ముఖ్యంగా తమ పక్క దేశమైన ఎరిట్రియాతో ఉన్న శత్రుత్వాన్ని పరిష్కరించడానికి అలీ చేసిన కృషికి గానూ ఆయనను నోబెల్ శాంతి పురస్కారానికి ఎంపిక చేసినట్టు జ్యూరీ సభ్యులు తెలిపారు. డిసెంబర్ 10న జరిగే కార్యక్రమంలో అలీ శాంతి పురస్కారాన్ని అందుకోనున్నారు. 2018 ఏప్రిల్‌లో ఇథియోపియా ప్రధానిగా భాద్యతలు చేపట్టిన అహ్మద్.. సరిహద్దు దేశాలతో ఉన్న సమస్యలను పరిష్కరించడమే.. కాకుండా తన దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే విధానాలను అవలంభించారు. కేవలం ఆరు నెలల్లోనే చాలా ఏళ్ల పాటు ఇథియోపియాకు శత్రు దేశంగా ఉన్న ఎరిట్రియాతో శాంతి కుదిరేలా చేశారు. -
అమెరికాలో హైదరాబాదీ అదృశ్యం
హైదరాబాద్: అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్లిన హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ యువకుడు కనిపించకుం డా పోయాడు. యువకుడి తల్లి గురువారం వివరాలను మీడియాకు తెలిపింది. సంతోష్‌నగర్ ఎం.బి.హట్స్‌కు చెందిన మెరాజ్ బేగం, మహ్మద్ ఇస్మాయిల్‌ల నాల్గవ కుమారుడు మీర్జా అహ్మద్ అలీబేగ్ (26) 2014లో బీటెక్ పూర్తి చేసి 2015 జూలై 23న యూఎస్ వెళ్లాడు. అక్కడ ఎంఎస్ చదువుకుంటూ మొబైల్ షాపులో గత 6 నెలలుగా పార్ట్‌టైమ్ జాబ్ చేస్తున్నాడు. ఈ నెల 20న రాత్రి 9 గంటలకు ఫోన్ చేసిన అహ్మద్ తాను ఇబ్బందుల్లో ఉన్నానని తల్లిదండ్రులకు చెప్పాడు. అది మీకు చెప్పేవి కాదని, తమ్ముడు సుజీత్ బేగ్ వచ్చాక మళ్లీ ఫోన్ చేసి చెబుతానని పెట్టేశాడు. అనంతరం సుజీత్ బేగ్ ఫోన్ చేయగా అందుబాటులోకి రాలేదు. ఆందోళ నకు గురైన వారు యూఎస్‌లో ఉన్న స్నేహితులు, మొబైల్ షాపు నిర్వా హకునికి ఫోన్ చేశారు. తమకు సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయాడంటూ పొంతనలేని సమాధానాలు చెప్పారు. యూఎస్‌లోని అహ్మద్ రూమ్మేట్కు ఫోన్ చేయగా... అదృశ్యంపై న్యూజెర్సీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. అక్కడి పోలీసులు రూమ్‌ను పరిశీలించగా.. ఆధారాలు, పాస్ పోర్టు లభించలేదని చెప్పాడు. ఈ విషయమై భారత రాయబారి కార్యాలయం, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌కు లేఖ రాసినట్లు అహ్మద్ తండ్రి మహ్మద్ ఇస్మాయిల్ తెలిపారు. -
ఆ ఇంట్లో 98 ఓట్లూ ఒకరికే!
ఓటుమ్మడి కుటుంబం ఉత్తరప్రదేశ్‌లోని మహరాజ్‌గంజ్ జిల్లాలోని బాబా అహ్మద్ అలీ కుటుంబానికి ఓ ప్రత్యేకత ఉంది. సోమవారం సాయంత్రం సార్వత్రిక ఎన్నికల ఘట్టం ముగిసేవరకూ ఆ ఇంటికి రాని పార్టీ వాళ్ళు లేరు. నవ్వుతూ పలకరిస్తూ, ఓటెయ్యమని అడగని అభ్యర్థి లేడు. ఆ ఇంటికీ, ఆ కుటుంబానికి ఉన్న అంతటి ప్రత్యేకత ఏమిటంటారా? ఆ ఇంట్లో ఉన్నది ఒకే కుటుంబం. మొత్తం 136 మంది సభ్యులున్న ఆ కుటుంబంలో ఒకటీ, రెండూ కాదు... ఏకంగా 98 ఓట్లున్నాయి. అందుకే, ఆ ఇంటి చుట్టూ అన్ని పార్టీల అభ్యర్థులూ మొన్నటి దాకా చక్కర్లు కొడుతూ వచ్చారు. ఉమ్మడి కుటుంబంగా బతుకుతున్న ఆ ఇంట్లో వారందరికీ కలిపి ఒకటే పేద్ద... సామూహిక వంట గది. స్థానికంగా దాన్ని ‘సాంఘా ఛూలా’ అంటారు. వంట విషయంలోనే కాదు... ఓటింగ్‌లోనూ ఆ ఇంటిల్లపాదీ ఒకే మాట మీద ఉంటారు. పోలింగ్‌కు ముందు రోజున ఈ భారీ ఉమ్మడి కుటుంబంలోని సభ్యులందరూ కలసి కూర్చుంటారు. ఎవరు సరైన అభ్యర్థి అన్నది చర్చించుకుంటారు. చివరకు ఓ అభ్యర్థిని ఎంచుకుంటారు. ఈ ఎంపిక నిర్ణయంలో కుటుంబంలోని స్త్రీల మాటకు కూడా సమాన ప్రాధాన్యం ఉంటుంది. ఒకే ఇంట్లో ఇంత మంది ఓటర్లుండడంతో అభ్యర్థులే కాక, ఓటింగ్ శాతాన్ని పెంచాలని కంకణం కట్టుకున్న పోలింగ్ అధికారులు కూడా వీరిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంటారు. సోమవారం నాడు ముగిసిన ఆఖరు విడత ఓటింగ్ సందర్భంగా స్వయంగా పోలింగ్ బూత్ స్థాయి అధికారి వచ్చి, ఈ ఇంట్లో వాళ్ళందరికీ ఓటరు స్లిప్పులు ఇచ్చి వెళ్ళారు. ‘‘వీళ్లందరూ కలసి వచ్చి ఓటేయడం ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది’’ అని ఆ అధికారి చెప్పారు. నిజానికి, ఈ కుటుంబం ఇక్కడ అనేక దశాబ్దాలుగా ఉంటోంది. సూఫీ సాధువు సమేరా షరీఫ్ దాదాపు నూరేళ్ళ క్రితం ఈ ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారట. ఆయన పెంపుడు కొడుకైన అహ్మద్ అలీ ఈ కుటుంబ పెద్ద. అహ్మద్‌కు ఎనిమిది మంది అబ్బాయిలు. ఇక పిల్లలకు పిల్లలు - 31 మంది అబ్బాయిలు, 21 మంది అమ్మాయిలు. వీళ్ళు, వీళ్ళ పిల్లలు కూడా ఇదే ఇంట్లో ఉంటున్నారు. ఈ ఇంట్లో అందరూ వాడుకొనే గదులు, వంటిల్లు కాక ఏకంగా 60 ప్రత్యేక గదులున్నాయి. ‘‘కలసి ఉంటే కలదు సుఖం అన్నది మా ఆలోచన. సరైన అభ్యర్థిని ఎంచుకోవడంలో కూడా మేము అలాగే ఐకమత్యంతో ఉంటాం’’ అని ఆ కుటుంబీకులు చెబుతున్నారు. కుల మతాలకతీతంగా వ్యవహరిస్తామంటున్న ఈ కుటుంబంలో ఈ ఏడాది ఏడుగురు తొలి ఓటర్లుగా నమోదయ్యారు. వాళ్ళందరూ కూడా ఓటింగ్ విషయంలో కుటుంబ సంప్రదాయాన్ని అనుసరించారు. అన్నట్లు రానున్న 2017లో ఉత్తరప్రదేశ్‌లో శాసనసభ ఎన్నికలు జరిగే సమయానికి ఈ కుటుంబంలో మరింత మందికి పెళ్ళిళ్ళు జరగడం, కొత్త ఓటర్లు రావడం తథ్యమంటున్నారు ఈ కుటుంబ సభ్యులు. అప్పటికి తమ ఇంటి ఓట్ల సంఖ్య ఇప్పటి 98 నుంచి ఏకంగా 115 దాకా పెరుగుతుందని వారి అంచనా. రికార్డు పుస్తకాల్లోకి ఎక్కే ఈ ఓటర్ల కుటుంబం మరెంతోమందికి ప్రజాస్వామ్య ఓటింగ్ పట్ల స్ఫూర్తి కలిగిస్తే, అంతకన్నా కావాల్సింది ఏముంటుంది!