
కొత్త అడుగు
సుదీర్ఘకాలం ‘ఫ్రెంచ్ సుడాన్’ పేరిట ఫ్రెంచ్ పాలనలో ఉంది పశ్చిమ ఆఫ్రికాలోని మాలి. 1959లో ఫ్రెంచ్ సుడాన్, సెనెగల్‌లు ‘మాలి ఫెడరేషన్’గా ఏర్పడ్డాయి. 20 జూన్ 1960లో ఈ ‘మాలి ఫెడరేషన్’ ఫ్రాన్సు నుంచి స్వాతంత్య్రం పొందింది. అయితే 20 ఆగస్ట్, 1960లో సెనెగల్ ‘మాలి ఫెడరేషన్’ నుంచి విడిపోయి ‘రిప్లబిక్ ఆఫ్ సెనెగల్’గా ఏర్పడింది. 22 సెప్టెంబర్ 1960లో ‘రిపబ్లిక్ ఆఫ్ మాలి’ ఏర్పడింది.
మాలిలో ఒకానొక కాలంలో సువర్ణయుగం నడిచింది. గణితం, ఖగోళశాస్త్రం, సాహిత్యం, చిత్రకళ గొప్పగా వెలిగిపోయాయి. 19వ శతాబ్దంలో మాలి సామ్రాజ్యం ‘ఫ్రెంచ్ సుడాన్’లో భాగంగా ఉండి ఉండకపోయి ఉన్నట్లయితే... ఆ రాజ్యం తనదైన ప్రత్యేకతతో విలసిల్లి ఉండేది. ‘ఒకే జాతి, ఒకే లక్ష్యం, ఒకే విశ్వాసం’ అనే నినాదంతో కొనసాగిన మాలిలో చాలా కాలం పాటు ఏక పార్టీ పాలన సాగింది. 1991లో మాలి నూతన రాజ్యాంగాన్ని రూపొందించుకుంది. బహుళపార్టీ వ్యవస్థ ఏర్పడింది. సహజవరులకు ప్రసిద్ధిగాంచిన మాలి ఆఫ్రికా చరిత్రలో ముఖ్యమైన పాత్రను నిర్వహించింది.