సర్వమత పర్వం
పీస్ ఫెస్టివల్
- గజవెల్లి రాజు, సాక్షి, పోచమ్మ మైదాన్, వరంగల్
అది 1993వ సంవత్సరం. దీపావళి పండుగ రోజు. హిందువుల పిల్లలు టపాసులు కాలుస్తూ ఆనందంగా గడుపుతున్నారు. దీన్ని చూసిన హన్మకొండ జులైవాడకు చెందిన ఇద్దరు ముస్లిం చిన్నారులు దీపావళి పండుగను మనం ఎందుకు జరుపుకోవడం లేదని తమ తండ్రి మహ్మద్ సిరాజుద్దీన్‌ను ప్రశ్నించారు. రెవెన్యూ శాఖ రిటైర్డ్ ఉద్యోగి అయిన ఆయనలో ఈ ప్రశ్న కొత్త ఆలోచనలకు తెర తీసింది. మతాలు, కులాల వారీగా కాకుండా అందరూ కలిసి జరుపుకునేందుకు పండుగలే లేవా అని ప్రశ్నించుకున్న సిరాజుద్దీన్‌లో రెండేళ్ల పాటు సాగిన అంతర్మథనంలోంచి ‘ప్రపంచ శాంతి పండుగ’ ఆవిర్భవించింది.
సమితి ఆమోదం
తన పిల్లలు వేసిన ప్రశ్నతో 1995లో ప్రపంచ శాంతి పండగ పేరిట ఓ పుస్తకాన్ని రాశారు సిరాజుద్దీన్. ఆ పుస్తకాన్ని 1996లో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బౌత్రోస్ బౌత్రోస్ ఘలీకి పంపించారు. దానికి స్పందనగా అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని శాంతి పండుగను జరుపుకోవాలని సూచిస్తూ సమితి కార్యాలయం నుంచి సిరాజుద్దీన్‌ను లేఖ అందింది.
ఏటా ఫిబ్రవరి 28న
నాలుగేళ్లకోసారి వచ్చే లీపు సంవత్సరంలో 29 రోజులు ఉంటాయి. ఇలాంటి ప్రత్యేకత ఉన్న ఫిబ్రవరి నెలలో 28వ తేదీన ప్రపంచ శాంతి పండగను నిర్వహించాలని సిరాజుద్దీన్ నిర్ణయించారు. ఈ విషయాన్ని ప్రజాకవి కాళోజీ నారాయణరావుకు చెబితే.. ఎవరు వచ్చినా, రాకున్నా మనమిద్దరమే పండుగ జరుపుకుందామని చెప్పారు. అలా తొలిసారి 1997 ఫిబ్రవరి 28న హన్మకొండ పబ్లిక్ గార్డెన్‌లో రెండు టెంట్లు వేశారు. ప్రతీ టెంట్‌లో అన్ని కులాలు, మతాల వారు ఉన్నారు. ఇంతలో ఓ టెంట్‌లో నుంచి మహిళలు మరో టెంట్లోకి వెళ్లి తమ పండుగకు రావాలని ఆహ్వానించగా.. అందరూ కలిసి రెండు టెంట్ల నడుమ శాంతి జెండా ఎగరవేశారు. ఇక పురుషులూ పిలుచుకుని శాంతి కపోతాలు ఎగరవేశారు. అనంతరం అందరూ ఆప్యాయంగా, సందడిగా గడిపారు. అలా శాంతి పండుగ ప్రారంభమైంది.
ఫొటో: సంపెట వెంకటేశ్వర్లు
ప్రపంచ శాంతి కోసం కృషి చేసే వారిని గుర్తించి 2007 సంవత్సరం నుంచి ‘శాంతి దూత’ అవార్డులు ఇస్తున్నాం. ఈ యేడు హన్మకొండలోని రాయల్ గార్డెన్స్‌లో జరుగుతున్న వేడుకల్లో చందుపట్ల దేవేందర్‌రెడ్డి, డాక్టర్ అద్దెపల్లి రామ్మోహన్‌రావు, ప్రొఫెసర్ కోదండరామ్‌లకు అవార్డులు ప్రదానం చేయనున్నాం.
- మహ్మద్ సిరాజుద్దీన్, ఫౌండర్,
వరల్డ్ పీస్ ఫెస్టివెల్ సొసైటీ ఇంటర్నేషనల్